రాయవరం : అమ్మాయిలను పెంచి, పెద్ద చేసి, చదివించి, వివాహాలు చేయడం ఖర్చుతో కూడుకున్నదనే భావన కొంతమంది తల్లిదండ్రుల్లో నేటికీ గూడు కట్టుకుని ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా ‘సుకన్య సమృద్ధి యోజన’ పేరుతో ప్రారంభించిన పథకం ఆడపిల్లలకు ఎంతో ప్రయోజకరంగా ఉంది. ఆ పథకం వివరాలివీ..
పథకంలో చేరేదిలా..
పుట్టిన పాప నుంచి పదేళ్ల వయస్సులోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రారంభించవచ్చు. 2013 డిసెంబర్ రెండు తర్వాత జన్మించినవారు కూడా అర్హులే. తల్లిదండ్రులు లేదా న్యాయపరమైన సంరక్షకులు బాలికల పేరుతో పోస్టాఫీసులలో కనీసం వెయ్యి రూపాయలతో ఖాతా తెరవాలి. ఒక బాలిక పేరుతో ఒక ఖాతాను మాత్రమే ప్రారంభించాలి. గరిష్టంగా ఇద్దరు బాలికల పేరుతో ఒక సంరక్షకుడు రెండు ఖాతాల వరకూ తెరవడానికి అవకాశం ఉంది. సంరక్షకుడు ఏదైనా గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు కాపీలను ఖాతా తెరిచే సమయంలో దరఖాస్తుతోపాటు అందజేయాలి. బాలిక ఫొటోతోపాటు పుట్టిన తేదీ ధ్రువపత్రం అందించాలి.
గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు..
పదేళ్ల వయసు దాటిన తర్వాత సంబంధిత బాలిక స్వయంగా ఖాతాలో లావాదేవీలు జరుపుకునే వీలుంటుంది. ప్రారంభ డిపాజిట్‌గా వెయ్యి రూపాయలు, తదుపరి డిపాజిట్లుగా ఒక ఆర్థిక సంవత్సరంలో వెయ్యి రూపాయల నుంచి రూ.1.5 లక్షల వరకూ జమ చేయవచ్చు. ఇలా ఖాతా కలిగిన బాలికకు 14 ఏళ్ల వయసు నిండే వరకూ రోజువారీ, నెలవారీ, సంవత్సరంవారీగా గరిష్ట పరిమితి మించకుండా జమ చేసుకోవచ్చు. 14 ఏళ్లు నిండిన తర్వాత ఎలాంటి లావాదేవీలూ నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఖాతా మాత్రం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. 14 ఏళ్ల వరకూ పొదుపు చేసిన మొత్తానికి 21 ఏళ్ల వరకూ వడ్డీ ఇస్తారు. ఏ బ్యాంకు, ఏ ఆర్థిక సంస్థా ఇవ్వనంత గరిష్టంగా వడ్డీ ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 9.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. 14 ఏళ్లు పూర్తయ్యే వరకూ ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన వడ్డీని ఖాతాలో జమ చేస్తారు. ఒక ఏడాదిలో వెయ్యి రూపాయలు డిపాజిట్ చెయ్యని పక్షంలో సదరు ఖాతాను స్థంభింపజేస్తారు. తిరిగి దానిని కొనసాగించాలంటే రూ.వెయ్యి డిపాజిట్‌తో పాటు రూ.50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఉపయోగాలివే..
ఒక ఏడాది ఉన్న బాలికకు నెలకు వెయ్యి రూపాయల వంతున జమ చేస్తే ఏడాదికి రూ.12 వేలు అవుతుంది. 14 ఏళ్లకు రూ.1.68 లక్షలు జమ చేస్తే 21 ఏళ్లకు ఆ ఖాతాలో బాలిక పేరున రూ.6.25 లక్షలు ఉంటాయి. ఈ ఖాతా కలిగి ఉన్న బాలిక 18 ఏళ్లు నిండగానే ఖాతాలోని మొత్తంలో 50 శాతం రుణంగా పొందవచ్చు. 21 ఏళ్ల వయస్సు, 18 ఏళ్ల తర్వాత వివాహం.. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే ఆ తేదీకి ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఈ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. చెల్లింపు కాలంలో నెలవారీ లేదా సంవత్సరంవారీగా వడ్డీ లెక్కింపు లభిస్తుంది. స్తోమతకు తగ్గట్టుగా 14 ఏళ్లు పొదుపు చేసుకుంటే ప్రతి బాలికకు భరోసా లభిస్తుంది. ఖాతాదారు మరణిస్తే ఖాతాలో నిల్వ ఉన్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. జిల్లాలో ఆరు నెలల నుంచి మూడేళ్ల వయసు ఉన్న బాలికలు సుమారు 1.35 లక్షల మంది, మూడేళ్ల నుంచి పదేళ్ల వయసు ఉన్న బాలికలు సుమారు 1.5 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరూ ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఆడపిల్లలకు అండగా..
Published Fri, Mar 18 2016 2:06 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement