ఆడబిడ్డల పుట్టుకే ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో వారికి ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛను ఇచ్చి ఆత్మగౌరవంతో ఎదిగేలా చేయడం చాలా అవసరం. తద్వారా అమ్మాయిలను చిన్న చూపు చూడకుండా, వారిని ఆర్థిక భారంగా భావించకుండా, భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలందేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశంతో వచ్చిందే ‘సుకన్య సమృద్ధి యోజన’. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక పథకం, ప్రయోజనాల గురించి మాట్లాడుకోవడం ఉత్తమం.
కేంద్రం ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం,రక్షణ కోసం తీసుకొచ్చిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం బేటీ బచావో, బేటీ పఢావో. ఇందులో భాగంగా తీసుకొచ్చిన పొదుపు పథకమే సుకన్య సమృద్ధి యోజన. స్పెషల్‌గా అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అందించారు.
సుకన్య సమృద్ధి యోజన (SSY) 2015లో ప్రారంభించింది ప్రభుత్వం. దీని సాయంతో తల్లిదండ్రులు తమ ఆడపిల్ల కోసం అధీకృత వాణిజ్య బ్యాంకు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ఆదాయం లభించనుంది. ఈ ఆదాయాన్ని మనం పెట్టిన పెట్టుబడి , వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు.
సుకన్య సమృద్ధి యోజన - అర్హత
అమ్మాయి తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి
అమ్మాయికి పదేళ్లకు మించి ఉండకూడదు
సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఒక కుటుంబానికి ఇద్దరు కుమార్తెలకు మాత్రమే అవకాశం
సుకన్య సమృద్ధి యోజనకు అర్హత పొందిన తర్వాత అవసరమైన పెట్టుబడి మొత్తాన్ని కాలిక్యులేటర్‌లో నమోదు చేయాలి. ఈ పథకంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు. అంటేకేవలం రూ.250తో సుకన్య ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అలాగే గరిష్టంగా నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేయొచ్చు. అకౌంట్ తెరవొచ్చు. ఈ ఖాతా తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. తర్వాత డబ్బులు కట్టాల్సిన పని లేదు. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే 18 ఏళ్లు వచ్చిన తర్వాత పాక్షికంగా కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి నగదు మన సొంతం అవుతుంది.
ఇంతకు ముందు కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండేది. అయితే, భారత ప్రభుత్వం జూలై 2018లో దీన్ని రూ.250కి తగ్గించడం గమనార్హం.
ఉదాహరణకు, 10 సంవత్సరాలకు 7.6శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 8,333 (సుమారుగా) చొప్పున ఏడాదికి లక్షరూపాయల పెట్టుబడి పెట్టారనుకుందాం. మీకు వడ్డీతో కలిపి రూ.15,29,458లు చేతికి అందుతాయన్న మాట. అదే నెలకు రూ. 5 వేలు చొప్పున 21 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా (రూ.25,59,142) వస్తాయి. అలాగే నెలకు 8 వేల రూపాయల చొప్పున 21 ఏళ్లు పెట్టుబడి పెడితే వచ్చే మెచ్యూరిటీ రూ. 40,94,627లు. అయితే ఈ వడ్డీరేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఈ స్కీమ్‌లో చేరేందుకవసరమైన డాక్యుమెంట్లు
పాన్ కార్డు
ఆధార్ కార్డు
పాప ఫోటోలు
పాప ఆధార్ కార్డు
పాప బర్త్ సర్టిఫికెట్
పన్ను మినహాయింపు
సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. ఈ విమెన్స్ డే సందర్భంగా మీ ముద్దుల తనయ కోసం ఎంతో కొంత పెట్టుబడిని మొదలు పెట్టండి. బంగారు భవిష్యత్తును ఆమెకు కానుకగా ఇవ్వండి!
Comments
Please login to add a commentAdd a comment