నిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.
బాలికల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రత్యేక పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన. బాలికల తల్లిదండ్రులు, సంరక్షకులు బాలికల పేరున ఈ ఖాతాలను తెరుస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు లేదా బంధువులు ఖాతాలు తెరిచారు. కానీ వీరు చట్టబద్ధంగా సంరక్షకులు కారు. కొత్త నిబంధనల ప్రకారం, చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులు తెరవని ఖాతాలను పథకం ప్రాథమిక మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బదిలీ చేయడమో లేదా మూసివేయడమో తప్పనిసరి. తల్లిదండ్రులు లేని బాలికలకు వారి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలు సంరక్షకులుగా ఉంటే ఇందుకోసం ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది.
ఖాతా మూసివేత, బదిలీకి అవసరమైన పత్రాలు
» అన్ని వివరాలున్న ప్రాథమిక ఖాతా పాస్‌బుక్
» బాలిక జనన ధ్రువీకరణ పత్రం
» బాలికతో సంబంధాన్ని రుజువు చేసే బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర ధ్రువ పత్రాలు
» తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు.
» పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్
పత్రాలన్నీ తీసుకుని ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వ్యక్తి ఖాతా తెరిచిన పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం సంరక్షకుడికి ఖాతాను బదిలీ చేయాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేయాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసు వారు అందించిన బదిలీ ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే ఉన్న ఖాతాదారు (తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ), కొత్త సంరక్షకుడు (తల్లిదండ్రులు) ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఫారమ్‌పై సంతకం చేయాలి.
ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను సమర్పించిన తర్వాత, బ్యాంక్ లేదా పోస్టాఫీసు సిబ్బంది అభ్యర్థనను సమీక్షించి ధ్రువీకరణను ప్రాసెస్ చేస్తారు. అవసరమైతే వారు అదనపు సమాచారం కోసం కూడా అడగవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతా రికార్డులు కొత్త సంరక్షకుని సమాచారంతో అప్‌డేట్ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment