పెదవాల్తేరు (విశాఖ తూర్పు): బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమం కింద కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికల బంగారు భవితకు భరోసాగా నిలుస్తుంది. పొదుపు పథకాలపై బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కన్నా సుకన్య సమద్ధి యోజన అందించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండడం విశేషం. ఈ పథకం కింద ఏడాదికి ఒకసారి సవరించి దానిని కేంద్ర బడ్జెట్ సమయంలో ప్రకటిస్తుంది. ఏడాదికి కనీస పెట్టుబడిని కేంద్రం రూ.వెయ్యి నుంచి రూ.250కి తగ్గించడం తెలిసిందే.
కాగా, ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు చెల్లించినట్టయితే 21 ఏళ్లు పూర్తయిన తర్వాత, అంటే మెచ్యూరిటీ సమయంలో రూ.48,821 పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ.20 వేలు కనీస పెట్టుబడి పెడితే 21 ఏళ్ల కు రూ.9,36,429 పొందవచ్చు ఏడాదికి కనీస డిపాజిట్ రూ.250, గరిష్ట డిపాజిట్ రూ.1.5 లక్షలు చెల్లించేలా గత ఏడాది జూన్ లో పరిమితిని సడలించారు. వార్షిక వడ్డీ 7.6 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరింత చేరువగా... : ఆడపిల్లలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరు. వారి చదువులకు, భవిష్యత్తుకు ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో భారత ప్రభుత్వం సుకన్య పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేస్తే అవే పిల్లలకు ఆసరాగా ఉంటాయి. పుట్టిన శిశువు నుంచి పదేళ్ల లోపు చిన్నారుల పేరున వారి తల్లిదండ్రులు సుకన్య పథకానికి సంబంధించిన ఖాతాను తెరవడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలను తెరిచేందుకు కావాల్సిన అన్ని వసతులు అధికారులు కల్పించారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ, మరింతమందికి పేదలకోసం ప్రీమియం చెల్లింపు మొత్తాన్ని తగ్గించింది. దీంతో ఎక్కువ మందికి ఈ పథకం చేరువవుతోంది. ఇదిలావుండగా విశాఖ డివిజన్‌లో 30 వేల మంది పథకంలో చేరారు.
ఆన్‌లైన్‌లో కూడా చెల్లింపు అవకాశాలు...: గతంలో సుకన్య ఖాతాను ఎక్కడ ప్రారంభిస్తే అక్కడ మాత్రమే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. దీంతో సంరక్షకులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం చెల్లింపులకు ఆన్‌లైన్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో ఎక్కడైనా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా బదిలీ చేసుకునే వీలు కల్పించింది. ఈ ఖాతాలో జమ అయిన మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
ఒక కుటుంబంలో ఇద్దరికి మాత్రమే..: ఈ ఖాతా కాలపరిమితి 21 ఏళ్లు ఉంటుంది. ఒక చిన్నారికి ఒక ఖాతా చొప్పున ఇద్దరికి ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది.. లేదా ఒకే కాన్పులో కవలలు పుట్టిన సందర్భాల్లో లేదా మొదటి కాన్పులో ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో ముగ్గురు ఆడపిల్లలు ఈ పథకంలో చేరవచ్చు. 21 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే ముందు అమ్మాయి వివాహం చేసుకున్నట్లయితే ఖాతా అనివార్యంగా మూతపడుతుంది. ఆ రోజు వరకు లెక్కించి నగదు చెల్లిస్తారు. ఖాతా ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 14 ఏళ్లు చెల్లించాలి. తపాలాశాఖలో అత్యధిక వడ్డీ ఇచ్చే పథకం ఇదొక్కటేనని అధికారులు చెబుతున్నారు.
ఏటా పొదుపు చేస్తున్న మొత్తంపై వచ్చే వడ్డీని ఆ తరువాత ఏడాది పొదుపులో కలిపి మళ్లీ ఏడాది ఈ మొత్తానికి వడ్డీ లెక్కిస్తారు. తద్వారా వడ్డీ, చక్రవడ్డీ రూపంలో జమ అవుతుంది. దీంతో లబ్ధిదారులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం చేకూరే అవకాశం కలుగుతుంది. బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చదువు లేదా వివాహం కోసం ఈ ఖాతాల్లో ఉన్న నిల్వల్లో 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన వెంటనే ఖాతాలోని మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహమైన తర్వాత ఖాతాను రద్దు చేసుకునే వీలు కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment