పన్ను శూన్యం.. ఆదాయం అదనం | Best Tax Saving Investment Options in 2023, sakshi special story | Sakshi
Sakshi News home page

పన్ను శూన్యం.. ఆదాయం అదనం

Published Mon, Apr 3 2023 4:21 AM | Last Updated on Mon, Apr 3 2023 4:21 AM

Best Tax Saving Investment Options in 2023, sakshi special story - Sakshi

ఆదాయపన్ను ఆదాచేసే పెట్టుబడి సాధనాలకు మంచి డిమాండ్‌ ఉంది. మధ్యాదాయ వర్గాల వారికి పాత పన్ను విధానమే మెరుగైనది. అందులో పన్ను ఆదా, మినహాయింపునిచ్చే సెక్షన్లు చాలానే ఉన్నాయి. పన్ను ఆదా కోసం ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ఆరంభం నుంచే ఈ సాధనాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లడం వల్ల చివర్లో ఏకమొత్తంలో సమకూర్చుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అయితే, పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు లాభ, నష్టాల గురించి పూర్తిగా విచారించుకోవాలి. లాక్‌ ఇన్‌ పీరియడ్‌ను చూడాలి. రాబడిని చూడాలి.

రిస్క్‌ను అర్థం చేసుకోవాలి. పన్ను బాధ్యత ఏ మేరకు అన్నది పరిశీలించాలి. ముందస్తు ఉపసంహరణలకు అవకాశం ఉందా? లేదా? తెలుసుకోవాలి. చాలా మంది పెట్టుబడిపై పన్ను ఆదానే చూస్తుంటారు. కానీ రాబడిపై పన్ను బాధ్యత గురించి తెలుసుకోరు. ముఖ్యంగా రిస్క్‌లేని సంప్రదాయ డెట్‌ సాధనాల్లో రాబడి 6–8 శాతం మించదు. కానీ, దీనిపై పన్ను చెల్లించాల్సి వస్తే.. ఇక మిగిలేది ఏముంటుంది? కనుక పెట్టుబడిపై పన్ను ఆదాయే కాదు, రాబడిపైనా పన్ను లేని సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల అదనపు రాబడిని సంపాదించుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సాధనాల గురించి తెలియజేసే కథనమే ఇది.  

2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే వారు పాత, కొత్త విధానాల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే కొత్త విధానంలో పన్ను ఆదా ప్రయోజనాలు పెద్దగా లేవు. స్టాండర్డ్‌ డిడక్షన్, ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్‌పీఎస్‌ ఖాతాకు చేసే జమపైనే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పాత విధానంలో అయితే సెక్షన్‌ 80సీ, 80డీ సహా ఎన్నో సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గిస్తున్నాయి. కనుక పాత, కొత్త విధానాల్లో ఒక దానిని ఎంపిక చేసుకునే ముందు తమ ఆదాయం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత ఎంపిక చేసుకోవాలి. పాత విధానంలో అయితే, ఇక్కడ చర్చించే సాధనాలు రిస్క్‌లేని రాబడిని, పన్ను లేని రాబడినిస్తాయి. కనుక ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించొచ్చు.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌
పీపీఎఫ్‌ అన్నది ఎవరైనా ఇన్వెస్ట్‌ చేసుకోతగిన సాధనం. సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తంపైనా ఎలాంటి పన్ను లేదు. అంతేకాదు ఈ సాధనానికి మూడు రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిపైనా పన్ను కట్టక్కర్లేదు. చివర్లో గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను లేదు. భద్రత దృష్ట్యా చూస్తే.. సార్వభౌమ గ్యారంటీతో కూడిన పథకం ఇది. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక రాబడి ఈ పథకంలో ఉంది. పీపీఎఫ్‌ అకౌంట్‌ కాల వ్యవధి 15 ఏళ్లు. లాకిన్‌ పీరియడ్‌ కూడా ఇంతే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి మొదలు పెట్టిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాలం అమలవుతుంది. ఆరంభం నుంచి కాదు. ఖాతా ప్రారంభించిన ఆరో ఏట నుంచి రుణ సదుపాయం అమల్లో ఉంటుంది. ఖాతా ప్రారంభించిన ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇందుకు కొన్ని షరతులు అమలవుతాయి. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌లో ప్రారంభించుకోవచ్చు. పోస్ట్‌ ఆఫీసు అయితే అక్కడ సేవింగ్స్‌ ఖాతా తెరవాలని షరతు పెడుతున్నారు.

ఉద్యోగుల భవిష్య నిధి, స్వచ్ఛంద భవిష్య నిధి  
సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్‌ కిందకు వస్తారు. వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌ ఖాతాకు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. పని చేయించుకునే సంస్థ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఉద్యోగులు తన వంతుగా జమ చేసే మొత్తంపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ నిధికి 12 శాతానికి మించి జమ చేసుకోవాలంటే అందుకు వీలు కల్పించేదే స్వచ్చంద భవిష్య నిధి (వీపీఎఫ్‌). ఈపీఎఫ్‌ నిబంధనలు వీపీఎఫ్‌కు సైతం వర్తిస్తాయి. ఈపీఎఫ్‌ వడ్డీ రేటే వీపీఎఫ్‌ జమలపైనా అమలవుతుంది. ఈపీఎఫ్‌ పథకాన్ని కేంద్ర సర్కారు నిర్వహిస్తోంది. కనుక నూరు శాతం భద్రత ఉంటుంది.

గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీ రేటు అమలు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పథకం రిటైర్మెంట్‌ వరకు కొనసాగుతుంది. ముందస్తు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహం, వైద్య చికిత్సల కోసం ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన పథకాల మాదిరే ఈపీఎఫ్‌పైనా పన్ను లేదు. కాకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఉద్యోగి చేసే జమ రూ.2.5 లక్షలు మించినప్పుడు.. అంతకుమించి చేసే జమలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి జమ చేసే వారు 5 శాతం మంది కూడా ఉండరు. వీపీఎఫ్, ఈపీఎఫ్‌ రెండు కలసి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితిపైనే పన్ను ఆదా పరిమితం.

జీవిత బీమా పాలసీలు
సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కలిగిన సాధనాల్లో జీవిత బీమా సాధనాలు కూడా ఉన్నాయి. టర్మ్‌ పాలసీలు, ఎండోమెంట్‌ పాలసీలు, యూనిట్‌ లింక్డ్‌ పాలసీల (యులిప్‌లు)కు ఏటా చెల్లించే ప్రీమియం మొత్తాన్ని సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవచ్చు. జీవిత బీమాను పెట్టుబడి కోణంలో చూడొద్దు. కుటుంబానికి రక్షణ సాధనంగానే చూడాలి. అలా చూసినప్పుడు అసలైన బీమా ప్లాన్‌ అంటే టర్మ్‌ ప్లాన్‌ అనే చెప్పుకోవాలి. తక్కువ ప్రీమియంకే ఎక్కువ రక్షణ కవరేజీ లభిస్తుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బుందుల పాలు కాకుండా ఉంటుంది. గడువు తీరే వరకు జీవించి ఉంటే చివర్లో  ఏమీ తిరిగి రాదు.

అందుకే చాలా మంది దీని పట్ల విముఖత చూపిస్తుంటారు. దీనికి బదులు చివర్లో ఎంతో కొంత చెల్లింపులు చేసే ఎండోమెంట్‌ ప్లాన్ల వైపు వెళుతుంటారు. సంప్రదాయ పాలసీల్లో 20 ఏళ్లకు మించి కాలంపై రాబడి 4–6 శాతం మించదని గుర్తుంచుకోవాలి. యులిప్‌ ప్లాన్లు బీమా రక్షణ, పెట్టుబడితో కూడినవి. వీటిల్లోనూ ప్రీమియం అధికంగానే ఉంటుంది. యులిప్‌ ప్లాన్లలో పెట్టుబడులను ఈక్విటీ లేదా డెట్, లేదా ఈక్విటీ డెట్‌ కలసినవి ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్‌ నుంచి ఈక్విటీకి ఎలాంటి చార్జీల్లేకుండా మార్చుకోవచ్చు. గడువు తీరిన తర్వాత చివర్లో వచ్చే మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

యులిప్‌ ప్లాన్ల ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించకుండా చూసుకుంటే మెచ్యూరిటీపై పన్ను పడదు. యులిప్‌లలో ఉన్న మరో ప్రతికూలత ఇవి చాలా తక్కువ టర్మ్‌తో వస్తుంటాయి. యులిప్‌ ప్లాన్లలోనూ రాబడులకు హామీ ఉండదు. అంచనా రాబడినే బీమా సంస్థలు వెల్లడిస్తాయి. ఇక సంప్రదాయ బీమా పాలసీలు (జీవించి ఉంటే మెచ్యూరిటీ చెల్లించేది) తీసుకునే వారు వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు మించకుండా చూసుకోవాలి. అప్పుడే చివర్లో చేతికొచ్చే మొత్తం పన్ను రహితం. ఈ నిబంధన 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.  

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ పథకాలు
ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ పథకాలలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పైన చెప్పుకున్న వాటికి ఇది భిన్నం. సెక్షన్‌ 80సీ కింద గరిష్టంగా ఈ పథకాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక రిస్క్‌ ఉంటుంది. రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. రాబడులపై హామీ ఉండదు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా లాభ, నష్టాలు ఏవైనా రావచ్చు. కాకపోతే ఈక్విటీల్లో ఐదేళ్లకు మించిన కాలానికి నికరంగా రాబడులే వస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి.

ఈ పథకంలో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అమలవుతుంది. పన్ను ఆదా సాధనాల్లో తక్కువ లాకిన్‌ ఉన్నది ఇదే. ఈఎల్‌ఎస్‌ఎస్‌ నుంచి మూడేళ్లు నిండకుండా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌లో ఈ పథకం నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, గ్రోత్‌ ఆప్షన్‌కు బదులు డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. దాంతో ఫండ్‌ డివిడెండ్‌ ప్రకటించిన ప్రతీ సందర్భంలోనూ ఇన్వెస్టర్‌కు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కాకపోతే డివిడెండ్‌ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి కలిపి, పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏడాదికి మించిన కాలంపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు మూడేళ్ల లాకిన్‌తో ఉంటాయి కనుక.. ఇందులో వచ్చే రాబడులు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.లక్ష వరకు ఉంటే ఎలాంటి పన్ను లేదు. ఈ పరిమితికి మించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. అందుకే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో గ్రోత్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకుని సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలి. మూడేళ్లు నిండిన తర్వాత నుంచి ఏటా రూ.లక్ష లాభం మించకుండా ఉపసంహరించుకుని, తిరిగి ఆ మొత్తాన్ని మరొక ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల లాభంపై పన్ను పడదు. దీర్ఘకాలంలో మంచి నిధి
జమవుతుంది.  

సుకన్య సమృద్ధి యోజన
భేటీ బచావో భేటీ పడావో అనే పథకం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. కుమార్తెలకు సంబంధించిన డిపాజిట్‌ పథకం ఇది. ఆడ పిల్ల విద్య లేదా వివాహం అవసరాల కోసం తల్లిదండ్రులు ఆమె పేరిట ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇలా ఒక్కరు ఇద్దరు కుమార్తెల పేరిటే ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోగలరు. ఇద్దరికి మించి కుమార్తెలు ఉంటే, వారి పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఉండదు. పీపీఎఫ్‌ మాదిరే ఇందులోనూ పెట్టుబడిపై పన్ను లేదు. రాబడి, చివరిలో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. పన్ను లేని, మెరుగైన రాబడితో కూడిన డెట్‌ సాధనం ఇది.

కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో వస్తుంది కనుక భద్రత పరంగా సందేహం అక్కర్లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు 8 శాతం. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఇందులోనే రాబడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడులకు 21 ఏళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణలను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తారు. కుమార్తెల వయసు 10 ఏళ్లు మించకుండా ఉంటే, వారిపైనే ఈ పథకం కింద ఖాతా తెరిచి ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కుమార్తె వయసు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రి లేదా సంరక్షకుడు ఖాతాను నిర్వహించొచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతా తెరుచుకోవచ్చు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement