ఈ 75 ఏళ్ల స్వతంత్ర వేళ కూడా బాలికలపై వివక్ష ఉందనేది కాదనలేని సత్యం. జ్యోతీబా ఫూలే దంపతులు బాలికలకు పాఠశాలల ఏర్పాటుపై 1848లోనే పోరాడారు. కానీ 173 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో 5వ తరగతితోనే వేలాదిగా బాలికలు బడి మానేస్తున్నారు. పేద కుటుంబంలోని అమ్మాయిని పాఠశాలకు పంపడం ఇప్పటికీ ఒక అద్భుతమే. ఖర్చు భరించలేక పోవడంతోపాటు బాల్యవివాహాలు, ఇంటిపని, పొలాల్లో శ్రమ వంటివి బాలికా విద్యకు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. ఇక హైస్కూల్ స్థాయిలో బాలికలు బడి మానేయడానికి, బాల్య వివాహాలు, ఇంటిపని, వ్యవసాయ శ్రమ వంటివి ఇతర కారణాలు.
బాలికలకు ఉపాధి అవకాశాల కొరత ఉండటం వారు పాఠశాలకు దూరం కావడానికి ప్రధాన కారణం. తల్లితండ్రులు, కొన్ని సందర్భాల్లో భర్తలూ... అమ్మాయిలు చదువుకోవడానికి అనుమతిస్తున్నారు కానీ వారిపై తాము పెట్టిన ఖర్చు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. మరి ప్రాథమిక విద్య మాత్రమే పొందిన అమ్మాయిలు వేతనం వచ్చే ఉద్యోగాలను ఎలా పొందగలరు? పైగా బాలికలు బడికి పోవడానికి వారికి ఎలాంటి ప్రోత్సహకాలూ ఉండటం లేదు.
పెళ్లి చేసుకోవడం, ఇంటిపట్టునే ఉండి పిల్లలను చూసుకుంటూ ఇంటి పని చేయడం అనే తలరాత నుంచి తాము తప్పించుకునే అవకాశం లేదని గ్రహించాక చదువు పట్ల కనీస ఆసక్తి కూడా వారికి లేకుండా పోతోంది. కళాశాల విద్య పూర్తి చేసుకోవడం, ఉద్యోగావకాశాలు తలుపులు తట్టడం అంటే వీరికి పగటి కలగానే ఉంటోంది. వచ్చే ఇరవై ఐదేళ్లలో ఈ పరిస్థితిని మార్చేందుకు ‘బేటీ పఢావో’ సంకల్పాన్ని మరింతగా ఆచరణలోకి తెచ్చేందుకు అమృతోత్సవాలు ఒక చోదక శక్తిగా పని చేయగలవన్న ఆశను బాలికలున్న కుటుంబాలు వ్యక్తం చేస్తున్నాయి.
(చదవండి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833)
Comments
Please login to add a commentAdd a comment