మగపిల్లలున్న తల్లిదండ్రులూ.. బహుపరాక్.. విశ్వనగరం దిశగా అడుగుల వేస్తున్న హైదరాబాద్‌లో మీ అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా మారవచ్చు. భవిష్యత్తులో అమ్మాయిలు దొరకని పరిస్థితి దాపురించనుంది. వధువు కోసం చిన్నపాటి యుద్ధాలే చేయాల్సి రావచ్చు. ఎందుంటే గ్రేటర్ నగరంలో బాలికల నిష్పత్తి అత్యంత దారుణంగా పడిపోతోంది. తాజా సామాజిక –ఆర్థిక సర్వే ఫలితాలు ఇదే సూచిస్తున్నాయి.
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో బాలికల శాతం రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. తాజాగా ప్రతి వెయ్యి మందికి బాలురకు బాలికలు 931 మంది మాత్రమే ఉన్నట్టు తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1000/954గా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈ నిష్పత్తి 1000/931గా నమోదైంది. అంటే ఐదేళ్లలో దాదాపు 23 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘బేటి బచావో.. బేటి పడావో’ నినాదంతో ఆడపిల్లల సంరక్షణ చర్యలు చేపడుతుంటే.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం బాలికల నిష్పత్తి తిరోగమనం ఆందోళన కలిగిస్తోంది.
దీంతో సిటీలో మున్ముందు పెళ్లికాని బ్రహ్మచారుల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సిటీలో బాలికల సంరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ‘బేటీ బచావో’పై విస్తృత ప్రచారం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో సాగుతోంది. తాజా తెలంగాణ ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి సినీనటి రకుల్ ప్రీత్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా రంగంలో దింపింది. హైదరాబాద్ నగరంలో బాలికల నిష్పత్తి అతి తక్కువగా ఉండడానికి వెనుకబాటుతనం ఒక్కటే కారణం కాదని మరోమారు రుజువైంది.
వెలుగు చూస్తున్న లింగ వివక్ష...
ప్రపంచ పటంలో సాంకేతిక పరంగా అరుదైన గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్‌లో లింగ వివక్ష కొనసాగుతోంది. బాలికల పట్ల చిన్నచూపు, లింగనిర్ధారణ పరీక్షలు, అమలుకాని పీసీపీఎన్‌డీటీ యాక్ట్, మగపిల్లవాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పడం వంటివి ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. గత ఏడాది అప్పటి హైదారబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఏకంగా గర్భిణులకు లేఖ రాశారు. ‘ఏమో..! మీ కడుపున ఒక సానియానో.. మరో సింధునో, సాక్షినో పుట్టొచ్చుకదా.! ఆడ పిల్లల్ని రక్షించుకుందాం.. చదివించుకుందాం..! ఆడ పిల్లని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం నేరమే కాకుండా.. ఆడవారై ఉండి ఆడపిల్లల పట్ల అన్యాయం చేసిన వారవుతారు’ అంటూ అందులో పేర్కొన్నారు.
బాలికల సంఖ్య పెంచేందుకు చర్యలు
సిటీలో బాలికల సంఖ్య పెంచేందుకు జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రతేక్యక చర్యలు చేపట్టింది. బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమానికి 18 మందితో టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసింది. వీరు ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే మిఠాయిలు పంచడం, అంగన్‌వాడి కేంద్రాల్లో ప్రతి మూడో శనివారం ఆ నెలలో పుట్టిన ఆడపిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. తల్లులతో కేట్ కట్ చేయించి శుభాకాంక్షలు చెబుతున్నారు. గర్భిణులకు సామూహిక సీమంతం సైతం చేస్తున్నారు. రాఖీ పండగ రోజు బేటీ బచావో–బేటీ పడాలో అంటూ అంగన్‌వాడీ పరిధిలోని ప్రముఖుల నుంచి గవర్నర్ వరకు రాఖీలు కట్టారు. తాజాగా సినీనటిని రంగంలో దింపారు.
బేటీ బచావోపై అవగాహన...
ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, కన్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆడపిల్లలను ఆదర్శంగా తీసుకోవాలి. బాలికలను రక్షించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. హైదరాబాద్‌లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నాం. ఆడపిల్లల ప్రాముఖ్యతను చాటుతున్నాం.
– మహ్మద్ ఇంతియాజ్ రహీమ్,
బేటీ బచావో–బేటీ పడావో సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment