ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా: మోదీ | PM Modi launches 'Beti Bachao Beti Padhao' campaign | Sakshi
Sakshi News home page

ఆడపిల్లలను కాపాడాలని అర్థిస్తున్నా: మోదీ

Published Fri, Jan 23 2015 1:40 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

PM Modi launches 'Beti Bachao Beti Padhao' campaign

అమ్మాయిలను చదివించండి.. మగపిల్లలతో వారూ సమానమే  ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ ప్రారంభంలో మోదీ
ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిని విడనాడాలి.. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు.. ఆడపిల్లల ప్రాణాలను భిక్షమడుగుతున్నాడు.. భ్రూణ హత్యలు, సమాజంలో బాలికలపై చూపుతున్న వివక్ష వంటివన్నీ మానసిక వ్యాధులు.. అది 18 వ శతాబ్దపు ఆలోచనాధోరణి కన్నా దారుణం. పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలియగానే గర్భంలోనే చంపేయడం దారుణం.. దీనికి సహకరిస్తున్న డాక్టర్లు ఆ పాపపు పని ద్వారా సమాజానికి అన్యాయం చేస్తున్నారు.. దీని ద్వారా రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయి..

పానిపట్: మరో ప్రజాహిత కార్యక్రమానికి ప్రధాని  గురువారం శ్రీకారం చుట్టారు. బాలికాసంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యాలుగా ‘బేటీ బచావో.. బేటీ పఢావో’(ఆడపిల్లల్ని కాపాడండి..ఆడపిల్లల్ని చదివించడం)’ పథకాన్ని హరియాణలోని పానిపట్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడశిశువులను గర్భంలోనే చిదిమేసే విష సంస్కృతిపై నిప్పులు చెరిగారు. ‘ఈ దేశానికి ప్రధాని ఒక యాచకుడిగా మీ వద్దకు వచ్చాడు. ఆడపిల్లల ప్రాణాల్ని భిక్షమడుగుతున్నాడు’ అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.
 
 పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలియగానే గర్భంలోనే చంపేసే దారుణాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. దానికి సహకరిస్తున్న డాక్టర్లు ఆ పాపపు పని ద్వారా సమాజానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆక్షేపించారు. ‘మీరు వైద్యవిద్య చదువుకుంది ఆడపిల్లలను గర్భంలోనే చంపేందుకు కాదు. డబ్బు కోసం ఆ దారుణం చేస్తున్నారా? అది సమాజాన్ని మోసం చేయడమే. బాలికల రక్షణ, అభివృద్ధి బాధ్యత సమాజంలో భాగమైన మీకూ ఉంది’ అని డాక్టర్లకు హితవు చెప్పారు. ‘భ్రూణ హత్యలు, లింగ వివక్ష అనే నేరాలు చేస్తూ 18వ శతాబ్దపు మనుషుల కన్నా నీచస్థితిలో ఉన్నామని చెప్పొచ్చు. 18వ శతాబ్దంలో ఆడపిల్లల్ని కనీసం కొన్నాళ్లైనా బతకనిచ్చేవారు.
 
 ఇప్పుడు మన బిడ్డల్ని తల్లి గర్భంలో ఉండగానే చంపేస్తున్నాం’ అన్నారు. అయితే, ఏ తల్లి కూడా గర్భంలో ఉండగానే పిల్లల్ని చంపుకోవాలనుకోదని, కుటుంబ ఒత్తిడి, సమాజంలో పరిస్థితులు ఆమెను అందుకు ఒప్పుకునేలా చేస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. స్త్రీ, పురుష నిష్పత్తి అతితక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా జన్మించిన గడ్డపై ఎంతోమంది కల్పనాచావ్లాలను పురిట్లోనే చంపేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ‘భారతీయ సమాజంలో మగపిల్లలకు మాత్రం ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఆడపిల్లలు పెళ్లి అయిన తరువాత వేరే ఇంటి ఆస్తిగా మారిపోతారనే తప్పు భావన ఉంది. మగపిల్లలైతే వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే అపోహలో ఉంటారు. అదే నిజమైతే.. దేశంలో వృద్ధాశ్రమాలు ఇంతగా పెరిగేవి కావు’ అన్నారు.  ‘కూతుళ్లను చదవుకోనివ్వరు. కానీ కోడళ్లు మాత్రం చదువుకున్నవారు కావాలని కోరుకుంటారు. ఇవీ మన సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలు’ అని ఎత్తిపొడిచారు.
 
 బాలికల పట్ల సున్నితంగా, సానుకూలంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజం, కుటుంబం, తల్లిదండ్రులు.. అందరిపై ఉందని మోదీ స్పష్టం చేశారు.  ‘హర్యానాలోని మహేంద్రగఢ్, ఝజ్జర్ జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి 1000: 785గా ఉంది. అంటే రానున్న రోజుల్లో 215 మంది మగపిల్లలు అవివాహితులుగా ఉండిపోవాల్సి వస్తుంది’ అన్నారు. అనంతరం లింగవివక్షకు వ్యతిరేకంగా అక్కడున్నవారితో ప్రతిజ్ఞ చేయించారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో కేంద్రమంత్రులు మనేకాగాంధీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, జేపీ నద్దా, హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ పాల్గొన్నారు. బేటీ పఢావో.. బేటీ బచావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు.
 
 ‘రోజుకు 2వేల భ్రూణ హత్యలు’
 దేశవ్యాప్తంగా రోజుకు 2000 మంది ఆడపిల్లల్ని తల్లిగర్భంలోనే చిదిమేస్తున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. పురుష- స్త్రీ నిష్పత్తి కొన్ని రాష్ట్రాల్లో దారుణంగా ఉందని, 1000 మంది బాలురు ఉంటే 840 మంది బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
 
 సుకన్య సమృద్ధి యోజన
 అదే వేదికపై బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’ను మోదీ ప్రారంభించారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ(9.1%), ఆదాయపన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలిక పెళ్లయేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేయొచ్చు. బాల్యవివాహాలను అడ్డుకునే లక్ష్యంతో 18 ఏళ్లలోపు విత్‌డ్రాయల్‌ను అనుమతించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement