రాష్ట్రంలో వరుస పర్యటనలు..సమావేశాలకు ప్రణాళిక
5న సిర్పూర్, నిజామాబాద్, మల్కాజిగిరి సభలలో పాల్గొననున్న అమిత్ షా
6వ తేదీన పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండ సభలకు జేపీ నడ్డా..
8న వేములవాడ, వరంగల్.. 10న ఎల్‌బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభలు
మధ్యలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు,కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా.. బీజేపీ అధినాయకత్వం దూకుడు పెంచుతోంది. పోలింగ్ దగ్గరపడుతుండటంతో.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఒకే రోజున రెండు మూడు సభలతో..
1వ తేదీన హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో రోడ్ షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మళ్లీ ఈ నెల 5న రాష్ట్రానికి వస్తున్నారు. ఒకేరోజు 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్‌లో, సాయంత్రం 4 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు.
పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం ఒంటి గంటకు భువనగిరిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు నల్లగొండలో జరిగే సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.
మూడు నెలల్లో ఎనిమిది సార్లు మోదీ..
ప్రధాని మోదీ ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనతో కలిపితే.. మూడు నెలల్లోనే ఎనిమిది సార్లు ఆయన రాష్ట్ర పర్యటన చేసినట్టు అవుతుంది. మోదీ ఇంతకుముందే.. ఫిబ్రవరి మొదటివారంలో రెండు సార్లు, మార్చిలో మూడుసార్లు, ఏప్రిల్ చివరిలో ఒకసారి రాష్ట్రానికి వచ్చారు. ఇక ఈ నెల 8న వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.
10న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలను కవర్ చేసేలా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. అదేరోజున నారాయణపేటలో ప్రచారసభలోనూ మోదీ పాల్గొననున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే వారికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
పోలింగ్‌కు ముందు మరోసారి ఇంటింటి ప్రచారం
పార్టీ అగ్రనేతలు హాజరయ్యే సభలను మాత్రమే భారీగా నిర్వహించి.. మిగతా అంతా కూడా ఇంటింటి ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల పాటు ‘హర్‌ఘర్ బీజేపీ’కార్యక్రమాన్ని పూర్తి చేసిన బీజేపీ నేతలు.. పోలింగ్‌కు ముందు 9, 10, 11 తేదీల్లో తుది విడత ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల భేటీలో.. పోలింగ్ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ సార్లు ఓటర్లను కలుసుకోవడంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment