ఎస్సీ, ఎస్టీ ‘కల్యాణలక్ష్మి’ ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కౌంటర్ సంతకంతో జాబితా సిద్ధం చేసి, వారి ద్వారానే ప్రీ ప్రింటెడ్ చెక్కులను అందజేసేలా మార్పులు చేసింది. వారంలో ఒకరోజు మండల/ తాలుకా కేంద్రాల్లో వీటిని పంపిణీ చేసేలా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వధువు బ్యాంకు ఖాతాలోకి రూ.51 వేలను నేరుగా జమ చేస్తుండగా, మార్పు చేసిన విధానాల ప్రకారం పెళ్లి కుమార్తె తల్లి పేరిట చెక్కును అందజేస్తారు. ఈ దరఖాస్తులను ఎమ్మార్వోలు మాత్రమే పరిశీలించేలా మార్పు చేశారు.
ప్రస్తుత విధానం ప్రకారం వధూవరుల ఆధార్‌కార్డులను స్కాన్‌చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ పథకం విధివిధానాల్లో మార్పులు చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, ట్రెజరీలో బిల్లులను సిద్ధం చేసి మంజూరు ఇచ్చాక వధువు బ్యాంక్ అకౌంట్‌లోకి నగదు బదిలీ చేయడం వంటి విషయాల్లో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం వల్ల ఇబ్బందులు తలెత్తడాన్ని ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) కింద సహాయాన్ని అందిస్తున్న మాదిరిగా ప్రీప్రింటెడ్ చెక్కులను జిల్లా సంక్షేమశాఖల అధికారులు ట్రెజరీ నుంచి తీసుకుంటారు. లబ్ధిదారుల పేరిట చెక్కును జారీ చేస్తారు. ఈ-పాస్ వెబ్‌సైట్ లాగిన్ సౌకర్యాన్ని తహసీల్దార్లకు కల్పించేందుకు, ఎస్సీ, ఎస్టీ శాఖల డెరైక్టర్లను సంప్రదించి కల్యాణలక్ష్మి దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఠీఠీఠీ.జౌజీట.్ట్ఛ్చజ్చ్చ. జౌఠి.జీ. వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఎస్టీల విదేశీవిద్యకు రూ.20 లక్షల సాయం
విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇచ్చే సహాయాన్ని పెంచాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.