గురుకులాల్లో ‘ఔట్‌సోర్సింగ్’ చిక్కులు
- తాము చెప్పిన వారికి ఇవ్వాలంటున్న ఎమ్మెల్యేలు
- కాదంటున్న సంక్షేమ శాఖలు..
- భారీగా చేతులు మారుతున్న డబ్బులు
సాక్షి, హైదరాబాద్ : వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భర్తీ అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 221 గురుకులాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులు, సిబ్బంది నియామకానికి ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా. అయితే ఆయా సేవలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకుని తమ తమ నియోజక వర్గాల్లో ప్రారంభం కానున్న గురుకులాల్లో తాము చెప్పిన వారినే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో భర్తీ చేయాలని ఆయా సంక్షేమ శాఖలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఎస్సీ గురుకులాల్లోనే ఈ పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 133 కొత్త ఎస్సీ గురుకులాల్లో 900 మందిని ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఈ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. కార్మికశాఖ ఆమోదం పొందిన ఏజెన్సీలకే ఈ కాంట్రాక్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్న నిబంధనలున్నాయి. అయినా ఎమ్మెల్యేలు తమ వారిని నియమించాలని తమ లెటర్‌ప్యాడ్లపై అధికారులకు లేఖలు కూడా పంపిస్తున్నారు. ఎస్సీ గురుకులాల కార్యాలయం నుంచి మాత్రం ఎస్‌ఆర్ శంకరన్ పేరిట ఉన్న ఏజెన్సీకి చెందిన వారినే ఈ పోస్టుల్లో భర్తీచేయాలని లేఖ అందినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల లేఖలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, సందట్లో సడేమియా అన్నట్లు సచివాలయంలోని ఓ మంత్రి పేషీతో పాటు ఒక సంక్షేమ శాఖ కార్యదర్శి పేషీలోని సిబ్బంది ఈ పోస్టులను ఇప్పిస్తామంటూ పలువురి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ కార్యదర్శి పేషీలో పోస్టు ఇప్పించాలని లేదంటే డబ్బు తిరిగివ్వాలని సిబ్బంది, బయట వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.