కల్యాణ లక్ష్మితో సామాజిక మార్పు
ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గి సామాజిక మార్పునకు దోహద పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలుపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి కూడా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పథకం అమలుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.738 కోట్లు కేటాయించామన్నారు. పేదింటి ఆడపిల్లలందరికీ పథకం వర్తించేలా అవసరమైతే మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు.
వివాహానికి ముందే లబ్ధిదారులకు చెక్కు అందేలా పారదర్శకంగా పథకం అమలు చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం లక్ష కుటుంబాల్లో వెలుగులు నింపి రికార్డు సృష్టించిందన్నారు. 2014 సెప్టెంబర్ 24న పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1,04,057 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇందులో ఎస్సీలు 44,351, ఎస్టీలు 25,793, మైనార్టీలు 33,913 మందికి రూ.51వేల చొప్పున ఆర్థిక సాయం అందిందన్నారు. పథకం అమలుకు ఇప్పటి వరకు రూ.530 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం ప్రత్యేక సీఎం కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.