బాల్యానికి మూడు ముళ్లు | Children's Marriages In Adilabad District | Sakshi
Sakshi News home page

బాల్యానికి మూడు ముళ్లు

Published Sat, Apr 28 2018 9:41 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

Children's Marriages In Adilabad District - Sakshi

నిర్మల్‌అర్బన్‌ : బాల్య వివాహాలు అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాపకింద నీరులా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నా పూర్తిస్థాయిలో వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఓ వైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌లు ఇస్తున్నా.. బాల్య వివాహాలు మాత్రం ఆగటం లేదు. మైనర్లు అయినప్పటికీ చాటుమాటుగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.

అభద్రత భావం, పేదరికం, నిరక్షరాస్యత, మేనరికం, డ్రాపవుట్, అజ్ఞానం, సామాజిక తదితర కారణాల వల్ల బాల్య వివాహాలను జరిపిస్తున్నారు. రక్షణ లేని సమాజంలో అమ్మాయికి పెళ్లి చేస్తే రక్షణలోకి వెళుతుందన్న భావన అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఉంటే, పెళ్లి చేయకపోతే బాధ్యత లేకుండా చేతికందకుండా పోతాడేమోనన్న అనుమానం అబ్బాయిల తల్లిదండ్రుల్లో ఉండటం, పెళ్లి చేస్తే దారితప్పిపోకుండా ఉంటారన్న ఆలోచనతో మరికొంత మంది వివాహాలు జరిపించేస్తున్నారు.

బాల్య వివాహాల గురించి సమగ్ర సమాచారం అందితేనే అధికారులు స్పందిస్తున్నారు. పూర్తి సాక్షాలు లేకుంటే తమకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎక్కువ మందయితే బాల్య వివాహాలను గుట్టు చప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఫోక్సో లాంటి చట్టాలు అనేకం ఉన్నా బాల్య వివాహాలు మాత్రం అడ్డుకోలేకపోవడం విచారకరం. తాజాగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బాల్య వివాహాన్ని పోలీసు, ఐసీడీఎస్‌ అధికారులు నిలిపివేశారు. 


చాపకింద నీరులా... 
జిల్లాలో బాల్య వివాహాలు చాపకింద నీరులా జరుగుతున్నాయి. మంచి సంబంధమైతే దొరికితే చాలు.. ఇక ఆలస్యం ఎందుకు అని తొందరగానే వివాహాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అబ్బాయి, అమ్మాయిల వయస్సులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం సూచించిన విధంగా అయితే అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ కొందరు అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు పడగానే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇంకొందరు అంతకు లోపున్నా పెళ్లి తంతు జరిపిస్తున్నారు.

మంచి సంబంధం మళ్లీ దొరకదనో.. ఆలస్యమైతే మనసులు మారతాయనో.. ఓ బాధ్యత తీరుతుందనో ఇలా రకరకాల కారణాలతో పెళ్లి ముచ్చట కానిచ్చేస్తున్నారు. అధికారుల దృష్టికి వస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని గోప్యత పాటిస్తున్నారు. పెళ్లిళ్లు ఇష్టం లేకనో, ఇంకా ఇతరత్రా కారణాల వల్ల సమాచారం బయటకు వస్తే తప్ప అధికారులకు విషయం తెలియడం లేదు. పక్కంటి వారికో, బంధువులకు, స్నేహితులకో తెలిసినా పెళ్లి ఆపడం ఎందుకులే అని.. పెళ్లివారు ఇబ్బంది పడతారని విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో చాలానే జరిగాయి. అధికారుల దాకా వచ్చి నిలిచిపోయినవి కొన్ని మాత్రమే ఉంటాయనడంలో సందేహం లేదు. 


తొమ్మిదింటికి అడ్డుకట్ట.. 
జిల్లాలో రెండేళ్లుగా అధికారులు తొమ్మిది బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయగలిగారు. 1098కు సమాచారం రావడం, అధికారులకు ఫిర్యాదులు అందటంతో జిల్లాలో తొమ్మిది చోట్ల వివాహాలు నిలిపివేశారు. సోన్‌ మండలం పాక్‌పట్ల, సారంగాపూర్‌ మండలం తాండ్ర, మామడ, మామడ మండలం అనంతపేట్, సోంపేట్, ముథోల్, తానూర్, భైంసాలలో బాల్య వివాహాలపై సమాచారం అందటంతో అధికారులు అడ్డుకున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని నాయిడి వాడకు చెందిన బాలుడికి, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన బాలికలకు ఆదివారం (ఈనెల 22) వివాహాం జరగాల్సి ఉంది. ఇద్దరు మైనర్లు కావడంతో పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ చేసి పెళ్లిని నిలిపివేశారు. 

బాల్య వివాహాలు చట్టరీత్యానేరం.. 
సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది చట్టరీత్యానేరం. బాల్య వివాహాల నిరోధక చట్టం– 2006 ప్రకారం 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగుపెట్టిన అమ్మాయి, 21 పూర్తయి 22 ఏళ్లకు చేరిన అబ్బాయి పెళ్లికి అర్హులు. అలాగే 2012 వచ్చిన పోక్సోచట్టం(పీవోసీఎస్‌వో) ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సీస్‌ లైంగిక దాడి నుంచి పిల్లల రక్షణ ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయికి గానీ, 21 ఏళ్లలోపు అబ్బాయికి వివాహం జరిగితే ఈ చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదు చేయబడుతుంది. అలాగే ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలి.
 
ఆరోగ్యపరంగా ఇబ్బందులు.. 
వివాహ వయసు రాకముందే చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం ఏమాత్రం సరికాదు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మానసికంగానూ వారు దెబ్బతింటారు. కనీసం 18ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయికి, 21ఏళ్లు నిండిన తర్వాతే అబ్బాయికి పెళ్లి చేయాలి. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా బాల్యవివాహాలను చేయడం మానుకోవాలి.
డాక్టర్‌ శోభాసుభాష్‌రావు, గైనకాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేస్తున్న పోలీసు, ఐసీడీఎస్‌ అధికారులు (ఫైల్‌)

2
2/2

సగ్గం రాజు, జిల్లా బాలల పరిరక్షణాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement