మధ్యవర్తుల మాటలు నమ్మకండి
ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద డబ్బులిప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ సూచించారు. ఈ పథకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద దళిత, మైనార్టీ కుటుంబాల్లో పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం
ఇచ్చే ప్రక్రియలో మధ్యవర్తులు చలామణీ అవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సరూర్‌నగర్ మండలం నుంచి షాదీ ముబారక్ కింద లబ్ధిపొందిన సుల్తానాబేగం దరఖాస్తును పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవకతవకలను పసిగట్టినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని అతడిపై క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 13-1-డి, ఐపీసీ 471 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, రాజేంద్రనగర్, బాలానగర్, మల్కాజిగిరి, సరూర్‌నగర్ మండలాలకు సంబంధించి 76 దరఖాస్తులు విచారణలో ఉన్నాయని చెప్పారు. త్వరలో వాటిని నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం ఉన్నట్లు గుర్తిస్తే తమను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.