కల్యాణంలో కక్కుర్తి!
♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో భారీగా అక్రమాలు
♦ లబ్ధిదారులకు తెలియకుండా మధ్యవర్తుల స్వాహా
♦ అధికారులూ సూత్రధారులే.. పసిగట్టిన నిఘా విభాగం
♦ ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక లబ్ధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పక్కదారి పట్టాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు.. వారికి ఇచ్చే ఆర్థిక చేయూత వరకూ అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు తేలింది. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న వారికి సైతం కనీస సమాచారం లేకుండానే నిధులు స్వాహా చేస్తున్నారు.
ఈ వ్యవ హారంలో అధికారులు కూడా సూత్రధారులు కావడం గమనార్హం. ఈ పథకాల్లో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈక్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అక్రమాల డొంకను కదిలిస్తోంది. 2015-16 వార్షిక సంవత్సరంలో జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 8,396 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కళ్యాణ లక్ష్మికి సంబంధించి 3,146, షాదీముబారక్ కింద 5,250 మంది దరఖాస్తులు సమర్పించగా.. వీరిలో దాదాపు మెజారిటీ దరఖాస్తులను అర్హతకు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.34.18 కోట్లు కేటాయించింది. ఈ దరఖాస్తుదారుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించి అనంతరం అర్హతను నిర్ధారించా లి. కానీ ఈ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి.
అన్నీ డూప్లికేట్లే..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ముందుగా ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు పెళ్లి కూతురు ఫొటో, ఆధార్ కార్డు, పెళ్లి పత్రిక, ముస్లిం మైనార్టీలైతే నిఖానామా, ఆదాయం, కుల ధ్రువీకరణ, బ్యాంకు పాసుపుస్తకం తదితర వివరాలన్నీ సమర్పించాలి. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో విచారణకు వచ్చిన అధికారులకు పై వివరాలు చూపాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో కొందరు అక్రమార్కులు రంగప్రవే శం చేశారు. పెళ్లైన దంపతుల ఫొటో, ఆధార్ వివరాలు సంపాదించి.. మిగతా వివరాలకు డూప్లికేట్లను తయారుచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అనంతరం వాటిని ఆయా శాఖల అధికారులతో బేరం కుదుర్చుకుని నిధులు మంజూరయ్యాక పంచుకుంటున్నారు.
వెలుగులోకి వచ్చిందిలా..
నిరుపేదలకు అందాల్సిన ఆర్థిక సాయంలో అక్రమార్కులు చొరబడిన అంశాన్ని ఏసీబీ పసిగట్టింది. ముందుగా మైనార్టీ సంక్షేమ శాఖ, ఎస్సీ అభివృద్ధి విభాగాల నుంచి ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిపొందిన వారి వివరాలను సేకరించింది. అందులో పేర్కొన్న ఆధారాల ప్రకారం క్రమపద్ధతిలో మండలాల వారీగా విచారణకు దిగింది. ఈ క్రమంలో షాదీముబారక్ పథకం కింద సరూర్‌నగర్ మండలం నుంచి సుల్తానాబేగం అనే లబ్ధిదారురాలి ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లారు. చిరునామా తప్పుగా ఉందని గ్రహించిన ఏసీబీ అధికారులు సయ్యద్‌నగర్‌లో చిరునామాను పసిగట్టి వారిని విచారించగా.. తన వివాహం జూన్ 9, 2013లో జరిగిందని, దీంతో తనకు అర్హత లేనందున దరఖాస్తు చేసుకోలేదని నిఖానామాను చూపింది.
దీంతో ఖంగుతిన్న అధికారులు మరింతలోతుగా పరిశీలన చేపట్టారు. దరఖాస్తు ఫారంతో ఉన్న వివరాల్లో సంతకాలు ఒకేలా ఉన్నప్పటికీ.. పెళ్లి కుమారుడి ఓటరు కార్డులో నకిలీ ఫొటో, నిఖానామాలో ఫోర్జరీ, తప్పుడు ఆదాయపత్రం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం పహడీషరీఫ్‌లోని ఇండియన్ బ్యాంకు ఖాతాలో జమైంది. అయితే ఈ నిధులను డ్రా చేసిన విత్‌డ్రా ఫాంలోనూ సరైన సంతకం ఉంది. కానీ ఈ ఖాతా తెరిచిన వ్యక్తికి పరిచయస్తుడైన ఖాతా దారుడు సంతకం పెట్టకపోవడం గమనార్హం.