సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.1 కోటి 88 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో జరిగిన షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3కోట్ల 49 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.
స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజా సంక్షేమాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 4 వేల 70 మందికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందించిందని పేర్కొన్నారు. మొదటి విడతగా 6వేల కోట్లు, రెండో విడతగా 2వేల కోట్లు మొత్తం 8వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఆదర్శం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment