-పరిశీలనకు నోచుకోని దరఖాస్తులు
-పెండింగ్‌లో 1372 దరఖాస్తులు
-బీసీ,ఈబీసీలపై మొదలు కాని ప్రక్రియ
సాక్షి,సిటీబ్యూరో
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమల్లో స్తబ్దత నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించటంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకొనని పరిస్థితి నెలకొంది. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు అమలు చేస్తున్న ఈ పథకాలు తాజాగా ఏఫ్రిల్ నుంచి బీసీ, ఈబీసీలకు కూడా వర్తింప చేస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్‌లో కళ్యాణలక్ష్మీకి సంబంధించిన దరఖాస్తులు 1372 పరిశీలన దశ( పెండింగ్)లో ఉన్నాయి.ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, ఈబీసీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహాము కోసం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. గ్రేటర్ కళ్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ వర్గాల నుంచి 2016-17 సంవత్సరంలో 4,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటి వరకు 3,288 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
దీనికి సంబంధించిన నిధులు కూడా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే... ఇటీవల పథకంలో మార్పులు చోటుచేసుకోవటంతో రిజిష్టరై పెండింగ్‌లో ఉన్న 1372 దరఖాస్తుల పరిశీలన,ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇందులో బీసీ,ఈబీసీ వర్గాలకు సంబంధించిన 280 దరఖాస్తులు ఉన్నాయి. ఇవే కాక మిగతా జిల్లాల్లో కూడా ఈబీసీ దరఖాస్తుల పని అదే విధంగా ఉన్నాయి.
మారిన విధానంతో చిక్కులు...
గతంలో ఎస్సీ,ఎస్టీల దరఖాస్తులను ఆయా శాఖల జిల్లా అధికారులే పరిశీలించి నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్‌లైన్‌లో రూ.51 వేలు బదిలీ చేసేవారు. మైనారిటీలకు సంబంధించి జిల్లాల్లో సొంత యంత్రాంగం లేనందున రెవెన్యూశాఖ (ఎమ్మార్వోలు) ద్వారా దరఖాస్తులను పరిశీలించేవారు. ఇప్పుడు ఈ పథకాల అమల్లో స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ లబ్దిదారుల దరఖాస్తుల ఎంపిక బాధ్యత మొదలుకుని, వధువు తల్లి పేరిట ఆమెకే డమ్మీ చెక్కులను అందజేసే వరకు ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. ఇక్కడే ఆయా శాఖల అధికారులకు చిక్కులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు ఆయా దరఖాస్తులను అందజేయడం, వాటిపై వారు సంతకం చేశాక కేవలం తహసీల్దార్ల ద్వారా పరిశీలన జరిపించి, వధువు తల్లి పేరిట చెక్కును సిద్ధం చేసి, డమ్మీ చెక్కును తయారు చేయించి, ఎమ్మెల్యేల పర్యటన వివరాలు తెలుసుకుని వారి ద్వారా నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది.
బీసీ,ఈబీసీలపై అందని ఆదేశాలు...
ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల దరకాస్తులను పరిశీలిస్తున్న విధంగానే బీసీ,ఈబీసీలవి కూడా ఎమ్మార్వోలే పరిశీలించాల్సి ఉండగా ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు అందలేదు. తమ శాఖ పరిధిలోని దరఖాస్తులను పరిశీలించాలని సీసీఎల్‌ఏను బీసీసంక్షేమశాఖ సంప్రదించి లేఖను కూడా అందజేసింది. అయితే సీసీఎల్‌ఏ నుంచి ఎమ్మార్వోలకు ఇంకా ఉత్తర్వులు అందలేదు. అంతేకాకుండా ఎమ్మార్వోలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధికారులకు ఆన్‌లైన్‌లో దరకాస్తుల పరిశీలనకు ఇంకా లాగిన్‌లు ఇవ్వలేదు. ఈ పథకం కింద ప్రయోజనం కోసం తమకు వచ్చిన దరకాస్తుల జాబితాను ఎమ్మెల్యేలకు పంపించాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనితో ఎమ్మెల్యేలకు దరకాస్తులను పంపించి, వాటిపై ఆమోదం తీసుకోవడం కూడా మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తమకు కల్యాణ లక్ష్మీ పథకం కింద డబ్బులు వస్తాయో రావోనని ఈబీసీలు ఆందోళనలో ఉన్నారు.