Shaadi Mubarak
-
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సక్సెస్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
-
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.3210 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘కల్యాణ’ కానుకకు 2023– 24 బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. క్షేత్రస్థాయి నుంచి సాయం అందుకునే వారి సంఖ్య పెరుగు తుండడంతో కేటాయింపులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లకు రూ.3210 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.2750 కోట్లు కేటాయించగా... ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.460 కోట్లు పెంచింది. తాజా కేటాయింపులతో 3.20లక్షల మందికి కల్యాణ కానుక అందనుంది. -
2.17లక్షల మందికి షాదీముబారక్!
సాక్షి, హైదరాబాద్: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో షాదీముబారక్ కింద 2.17లక్షల మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,751 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2022–23 వార్షిక ఏడాదిలో ఈ పథకం కోసం రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు వెల్లడించింది. షాదీముబారక్ పథకంతో మైనార్టీ వర్గాల్లో బాల్యవివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ శాఖ నివేదికలో పేర్కొంది. విద్యాభివృద్ధికోసం గురుకులాలు మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గురుకుల విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చిందని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 12 పాఠశాలలు మాత్రమే ఉండగా...ఇప్పుడు వాటి సంఖ్య 206కు చేరిందని తెలిపింది. ఈ పాఠశాలల్లో మొత్తం 1.14లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ ఉన్నతవిద్య పథకం కింద ముఖ్యమంత్రి ఉపకార వేతనాల కింద ఇప్పటివరకు రూ.6.30 కోట్ల ఆర్థిక సహకారాన్ని మైనార్టీ విద్యార్థులకు అందించామని, 2022–23 ఆర్థిక ఏడాదికి గాను రూ.100 కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది. రూ.40కోట్లతో నాంపల్లిలో అనీస్ –ఉల్ –గుర్బా అనాథ శరణాలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు వివరించింది. మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే 10 వేలమంది ఇమాం, మౌజంలకు నెలకు రూ.5 వేలచొప్పున గౌరవవేతనం అందిస్తోందని, రంజాన్ కానుకగా 4.65లక్షల మందికి, క్రిస్మస్ పండుగకు ఏటా సుమారు 5లక్షల మందికి కొత్త బట్టలను కానుకగా అందిస్తున్నట్లు ఆ శాఖ వివరించింది. -
కల్యాణం కమనీయం.. థాంక్యూ జగనన్నా.. ( ఫొటోలు)
-
‘ఎన్ని కష్టాలెదురైనా.. ప్రజా ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.1 కోటి 88 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో జరిగిన షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3కోట్ల 49 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజా సంక్షేమాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 4 వేల 70 మందికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందించిందని పేర్కొన్నారు. మొదటి విడతగా 6వేల కోట్లు, రెండో విడతగా 2వేల కోట్లు మొత్తం 8వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఆదర్శం అని అన్నారు. -
‘షాదీ ముబారక్’ సొమ్ము కాజేశారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ లబ్ధిదారుడికి ఇచ్చిన షాదీ ముబారక్ స్కీమ్ చెక్కు చెల్లకుండాపోయింది. ఇది జారీ కావడానికి ముందే తమిళనాడులో ఎన్‌క్యాష్ అయింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు... చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు ఈ ఏడాది జనవరిలో తన కుమార్తెకు వివాహం చేశాడు. నిరుపేద కావడంతో షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న బండ్లగూడ రెవెన్యూ అధికారులు చెక్కు అందించారు. దీన్ని బాధితుడు బ్యాంకులో డిపాజిట్ చేసినా ఎన్‌క్యాష్ కాలేదు. ఆరా తీయగా జనవరిలోనే ఈ చెక్కు చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎన్‌క్యాష్ (డబ్బు డ్రా ) అయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులు ఆగిపోయిన బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నేరం ఎలా జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
అమ్మాయి నవ్వింది!
హుస్నాబాద్‌రూరల్: ఆడ పిల్ల పెళ్లా...! అబ్బో.. అనుకునే సామాన్య కుటుంబాలు ఆడపిల్ల పుట్టిదంటే కష్టాలు మొదలవుతాయని ఉహించుకొంటారు. అలాంటి వివక్షను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ కుటుంబాలకు చెందిన 3 లక్షల కు పైగా కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించింది. వచ్చే ఏప్రిల్ నుంచి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116Sకు పెంచనుంది. జిల్లాలో 58,165 మంది కిశోర బాలికలు ఉండగా ఇందులో 50 వేల మందికి ఆరేళ్లలో ప్రయోజనం చే కూరనుంది. 4 వేల వరకు 18 ఏళ్లు దా టిన బాలికలకు తక్షణ లబ్ధి కలగనుంది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్ల క్రితం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లిలకు 51వేల ఆర్థిక సహాయం అందజేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని బీసీలు, ఓసీలలోని పేద కుటుంబాలకు వర్తింపజేస్తూ పథకం నగదు ప్రోత్సాహకాన్ని రూ.75,116లకు పెంచింది. ఆడబిడ్డలను కన్నవారిలో ఆనందం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే ప్రోత్సాహకాలను లక్షకు పెంచడంతో ఆడబిడ్డలను తల్లిదండ్రుల్లో కాస్త ఊరట కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 7వేల మంది కిశోర బాలికలు, 2వేల మంది పెళ్లి వయస్సు వచ్చిన యువతులు ఉండగా జిల్లాలో దాదాపు 40వేల మంది కిశోర బాలికలు, 12వేల వరకు పెళ్లి వయస్సు వచ్చిన ఆడపడచులకు ప్రయోజనం చేకూరనుంది. -
పేదల కష్టం తెలిసినోడు కేసీఆర్
► డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి ► కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మెదక్ మున్సిపాలిటీ: మన కడుపునొప్పి తెలిసినోడు కేసీఆర్ అని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మాయ గార్డెన్లో నియోజకవర్గంలోని 214మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లల తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 45వేల చెరువులను గుర్తించి మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తోందన్నారు. చెరువులకు జలకళ రావడంతో ఊర్లు బాగుపడుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పైప్లైన్ల నిర్మాణం పూర్తైందని, డిసెంబర్‌లోగా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు. మెదక్ నియోజకవర్గానికి రెండు వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులకు వాటిని కేటాయిస్తామని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్యుత్ కొరత లేకుండా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు రూ. నాలుగు వేలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తోందన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, రామాయంపేట ఎంపీపీ విజయలక్ష్మి, పాపన్నపేట జెడ్పీటీసీ స్వప్న, పాపన్నపేట ఎంపీపీ పవిత్ర, తహసీల్దార్ యాదగిరి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణానికి అందని లక్ష్మి
ఆర్నెల్లు దాటినా అందని సాయం పెండింగ్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు 95,579 దరఖాస్తుల్లో 30,390 మందికే సాయం.. దరఖాస్తుల పరిశీలనలో రెవెన్యూ అధికారుల ఉదాసీనత ఆడబిడ్డ తల్లిదండ్రుల ఎదురుచూపులు ఆసిఫ్‌నగర్‌కు చెందిన సంద పూజ వివాహం యాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో గతేడాది ఏప్రిల్29న జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన పూజ కుటుంబం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. పెళ్లై 9 నెలలు గడిచినా దరఖాస్తు మాత్రం తహశీల్దారు వద్దే పెండింగ్‌లో ఉంది. పెళ్లిరోజు అందాల్సిన ఆర్థిక సాయం ఇప్పటికీ అందకపోవడంతో ఆ కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డ పెళ్లి.. భారం కాకుండా ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాస్తవానికి పెళ్లిరోజు నాటికి లబ్ధిదారులకు రూ.51వేల ఆర్థిక సాయం అందాలి. అయితే సర్కారు లక్ష్యం ప్రస్తుతం గాడితప్పుతోంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలోనే జాప్యం వల్ల పెళ్లై ఆర్నెళ్లు గడిచినా అర్హులకు ఆర్థిక సాయం అందట్లేదు. దీంతో నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెండింగ్‌లో దరఖాస్తులు.. ప్రస్తుత వార్షికంలో అన్ని కేటగిరీలకు సంబంధించి ఇప్పటివరకు 95,579 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 59,593 దరఖాస్తులను అర్హులుగా నిర్ధారించారు. వీటిలో 30,390 మందికే ఖాతాల్లో ఆర్థికసాయాన్ని జమచేశారు. మిగతా లబ్ధిదారులకు చెల్లింపులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వేలాది దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వెబ్సైట్ దాదాపు నెలరోజుల పాటు నిలిచిపోవడంతో ఆ సమయంలో దరఖాస్తుల పరిశీలన అటకెక్కింది. తర్వాత వెబ్సైట్ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ఊపందుకోలేదు. మరోవైపు గత నెలరోజులుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు పెద్దగా జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్త దరఖాస్తులు రాకున్నా, పాతవాటి పరిశీలన నత్తనడకన సాగడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. బాధ్యతల బదిలీతో.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పర్యవేక్షణ సంక్షేమ శాఖలు నిర్వహించేవి. కానీ ఈ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ బాధ్యతల్ని రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఆర్డీవో, తహశీల్దార్ గ్రామ రెవెన్యూ అధికారుల స్థాయిలో ఈ పథకం పర్యవేక్షణ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి స్థితిగతులు పరిశీలించిన తర్వాత తహశీల్దార్ నివేదిక ఆధారంగా ఆర్డీవోలు అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తారు. అయితే రెవెన్యూ అధికారులకు శాఖపరమైన పనులతో బిజీగా ఉండడంతో వీటి పరిశీలనపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. గతవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో దరఖాస్తుల పరిశీలన విషయంలో ఉన్నతాధికారులు ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
స్తబ్ధతలో కల్యాణ లక్ష్మీ..
-పరిశీలనకు నోచుకోని దరఖాస్తులు -పెండింగ్‌లో 1372 దరఖాస్తులు -బీసీ,ఈబీసీలపై మొదలు కాని ప్రక్రియ సాక్షి,సిటీబ్యూరో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమల్లో స్తబ్దత నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించటంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకొనని పరిస్థితి నెలకొంది. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు అమలు చేస్తున్న ఈ పథకాలు తాజాగా ఏఫ్రిల్ నుంచి బీసీ, ఈబీసీలకు కూడా వర్తింప చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో కళ్యాణలక్ష్మీకి సంబంధించిన దరఖాస్తులు 1372 పరిశీలన దశ( పెండింగ్)లో ఉన్నాయి.ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, ఈబీసీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహాము కోసం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. గ్రేటర్ కళ్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ వర్గాల నుంచి 2016-17 సంవత్సరంలో 4,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటి వరకు 3,288 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన నిధులు కూడా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే... ఇటీవల పథకంలో మార్పులు చోటుచేసుకోవటంతో రిజిష్టరై పెండింగ్‌లో ఉన్న 1372 దరఖాస్తుల పరిశీలన,ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇందులో బీసీ,ఈబీసీ వర్గాలకు సంబంధించిన 280 దరఖాస్తులు ఉన్నాయి. ఇవే కాక మిగతా జిల్లాల్లో కూడా ఈబీసీ దరఖాస్తుల పని అదే విధంగా ఉన్నాయి. మారిన విధానంతో చిక్కులు... గతంలో ఎస్సీ,ఎస్టీల దరఖాస్తులను ఆయా శాఖల జిల్లా అధికారులే పరిశీలించి నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్లైన్లో రూ.51 వేలు బదిలీ చేసేవారు. మైనారిటీలకు సంబంధించి జిల్లాల్లో సొంత యంత్రాంగం లేనందున రెవెన్యూశాఖ (ఎమ్మార్వోలు) ద్వారా దరఖాస్తులను పరిశీలించేవారు. ఇప్పుడు ఈ పథకాల అమల్లో స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ లబ్దిదారుల దరఖాస్తుల ఎంపిక బాధ్యత మొదలుకుని, వధువు తల్లి పేరిట ఆమెకే డమ్మీ చెక్కులను అందజేసే వరకు ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. ఇక్కడే ఆయా శాఖల అధికారులకు చిక్కులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు ఆయా దరఖాస్తులను అందజేయడం, వాటిపై వారు సంతకం చేశాక కేవలం తహసీల్దార్ల ద్వారా పరిశీలన జరిపించి, వధువు తల్లి పేరిట చెక్కును సిద్ధం చేసి, డమ్మీ చెక్కును తయారు చేయించి, ఎమ్మెల్యేల పర్యటన వివరాలు తెలుసుకుని వారి ద్వారా నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. బీసీ,ఈబీసీలపై అందని ఆదేశాలు... ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల దరకాస్తులను పరిశీలిస్తున్న విధంగానే బీసీ,ఈబీసీలవి కూడా ఎమ్మార్వోలే పరిశీలించాల్సి ఉండగా ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు అందలేదు. తమ శాఖ పరిధిలోని దరఖాస్తులను పరిశీలించాలని సీసీఎల్ఏను బీసీసంక్షేమశాఖ సంప్రదించి లేఖను కూడా అందజేసింది. అయితే సీసీఎల్ఏ నుంచి ఎమ్మార్వోలకు ఇంకా ఉత్తర్వులు అందలేదు. అంతేకాకుండా ఎమ్మార్వోలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధికారులకు ఆన్లైన్లో దరకాస్తుల పరిశీలనకు ఇంకా లాగిన్లు ఇవ్వలేదు. ఈ పథకం కింద ప్రయోజనం కోసం తమకు వచ్చిన దరకాస్తుల జాబితాను ఎమ్మెల్యేలకు పంపించాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనితో ఎమ్మెల్యేలకు దరకాస్తులను పంపించి, వాటిపై ఆమోదం తీసుకోవడం కూడా మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తమకు కల్యాణ లక్ష్మీ పథకం కింద డబ్బులు వస్తాయో రావోనని ఈబీసీలు ఆందోళనలో ఉన్నారు. -
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో భారీగా అక్రమాలు
- అనర్హులకూ ఆర్థిక సాయం - దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులు - ఇప్పటికే షాదీ ముబారక్‌లో 11 కేసులు నమోదు - తూర్పున విస్తృత విచారణ - అక్రమార్కుల్లో వణుకు మంచిర్యాల సంక్షేమ ఫలాలు అక్రమార్కుల పాలయ్యాయి. పేదలకందాల్సిన ఆర్థిక సాయం పక్కదారి పట్టింది. పెళ్లి చేసుకోకుండానే కొందరు.. పెళ్లయి ఏళ్లు గడిచిన తర్వాత ఇంకొందరు.. ఇలా ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి డబ్బులు కాజేశారు. మరోపక్క పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చేరాల్సిన ఆర్థిక సాయాన్నీ కొందరు కాజేశారు. ఎంతోమంది దళారులు, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకున్నారు. జిల్లాలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల్లోనే షాదీ ముబారక్ పథకంలో అవినీతి నిరోధక శాఖ 11 కేసులు నమోదు చేసింది. తాజాగా.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకుల వివాహాలకు సంబంధించిన కల్యాణలక్ష్మీ పథకంపైనా దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఉట్నూరు, జైనూర్, నార్నూర్, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట మండలాల్లో విచారణ పూర్తి చేశారు. మరో రెండ్రోజుల్లో తూర్పు ప్రాంత పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్న దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో వెలుగులోకి వస్తున్న అక్రమాలతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. దళారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ రెండు పథకాల్లో అనర్హులకూ లబ్ధి చేకూర్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. క్షుణ్ణంగా విచారణ..! జిల్లాలో కల్యాణలక్ష్మీ పథకం కింద 3,800 దరఖాస్తులు రాగా.. కేవలం మంచిర్యాల పరిధిలోని నస్పూర్, తీగల్‌పహాడ్, క్యాతన్‌పల్లి ప్రాంతాల నుంచే సుమారు 1500, మంచిర్యాల పట్టణం నుంచి కేవలం నాలుగు దరఖాస్తులున్నాయి. ఇందులో విశేషమేమిటంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలన్నీ సింగరేణి కార్మికులవే కావడం. ఇటు షాదీ ముబారక్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,800 దరఖాస్తులొచ్చాయి. వీటిలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏళ్ల క్రితం పెళ్లయిన జంటలూ ఈ పథకం కింద లబ్ధిపొందారు. ఈ రెండూ పథకాల్లో లబ్ధిపొందిన సగానికి పైగా దరఖాస్తులపై ఏసీబీ అధికారులకు అనుమానాలున్నాయి. ఇప్పటికే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథక దరఖాస్తులు, లబ్దిదారుల జాబితాను డివిజన్, నియోజకవర్గం, మండలాల వారీగా సేకరించిన ఏసీబీ అధికారులు సమగ్ర విచారణలో నిమగ్నమయ్యారు. లబ్ధిదారుడు సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా..? కాదా..? కుటుంబ ఆర్థిక పరిస్థితి..? వివాహం జరిగిన తేదీ ? సంబంధిత ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. అయినా ఎంతోమంది ఆదాయానికి మించి ఆస్తులున్నా పథకం ద్వారా లబ్ధిపొందారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు: పాపాలాల్, ఏసీబీ డీఎస్పీ నిరుపేద యువతీ, యువకుల వివాహాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా అనర్హులూ లబ్ధిపొందినట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులకు లబ్ధి చేకూర్చారు. కొందరు ప్రజాప్రతినిధులు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేసి పేదలకందాల్సిన నిధులు కాజేశారు. అలాంటి వారి భరతం పడతాం. రెండు పథకాల లబ్ధిదారుల జాబితాను తీసుకున్నాం. మేమే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేపడతాం. అనర్హులు పథకాల ద్వారా లబ్ధిపొందినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం. -
మధ్యవర్తుల మాటలు నమ్మకండి
ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద డబ్బులిప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ సూచించారు. ఈ పథకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద దళిత, మైనార్టీ కుటుంబాల్లో పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చే ప్రక్రియలో మధ్యవర్తులు చలామణీ అవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సరూర్‌నగర్ మండలం నుంచి షాదీ ముబారక్ కింద లబ్ధిపొందిన సుల్తానాబేగం దరఖాస్తును పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవకతవకలను పసిగట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని అతడిపై క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 13-1-డి, ఐపీసీ 471 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, రాజేంద్రనగర్, బాలానగర్, మల్కాజిగిరి, సరూర్‌నగర్ మండలాలకు సంబంధించి 76 దరఖాస్తులు విచారణలో ఉన్నాయని చెప్పారు. త్వరలో వాటిని నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం ఉన్నట్లు గుర్తిస్తే తమను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణంలో కక్కుర్తి!
♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో భారీగా అక్రమాలు ♦ లబ్ధిదారులకు తెలియకుండా మధ్యవర్తుల స్వాహా ♦ అధికారులూ సూత్రధారులే.. పసిగట్టిన నిఘా విభాగం ♦ ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక లబ్ధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పక్కదారి పట్టాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు.. వారికి ఇచ్చే ఆర్థిక చేయూత వరకూ అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు తేలింది. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న వారికి సైతం కనీస సమాచారం లేకుండానే నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ వ్యవ హారంలో అధికారులు కూడా సూత్రధారులు కావడం గమనార్హం. ఈ పథకాల్లో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈక్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అక్రమాల డొంకను కదిలిస్తోంది. 2015-16 వార్షిక సంవత్సరంలో జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 8,396 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కళ్యాణ లక్ష్మికి సంబంధించి 3,146, షాదీముబారక్ కింద 5,250 మంది దరఖాస్తులు సమర్పించగా.. వీరిలో దాదాపు మెజారిటీ దరఖాస్తులను అర్హతకు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.34.18 కోట్లు కేటాయించింది. ఈ దరఖాస్తుదారుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించి అనంతరం అర్హతను నిర్ధారించా లి. కానీ ఈ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. అన్నీ డూప్లికేట్లే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ముందుగా ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు పెళ్లి కూతురు ఫొటో, ఆధార్ కార్డు, పెళ్లి పత్రిక, ముస్లిం మైనార్టీలైతే నిఖానామా, ఆదాయం, కుల ధ్రువీకరణ, బ్యాంకు పాసుపుస్తకం తదితర వివరాలన్నీ సమర్పించాలి. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో విచారణకు వచ్చిన అధికారులకు పై వివరాలు చూపాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో కొందరు అక్రమార్కులు రంగప్రవే శం చేశారు. పెళ్లైన దంపతుల ఫొటో, ఆధార్ వివరాలు సంపాదించి.. మిగతా వివరాలకు డూప్లికేట్లను తయారుచేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అనంతరం వాటిని ఆయా శాఖల అధికారులతో బేరం కుదుర్చుకుని నిధులు మంజూరయ్యాక పంచుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. నిరుపేదలకు అందాల్సిన ఆర్థిక సాయంలో అక్రమార్కులు చొరబడిన అంశాన్ని ఏసీబీ పసిగట్టింది. ముందుగా మైనార్టీ సంక్షేమ శాఖ, ఎస్సీ అభివృద్ధి విభాగాల నుంచి ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిపొందిన వారి వివరాలను సేకరించింది. అందులో పేర్కొన్న ఆధారాల ప్రకారం క్రమపద్ధతిలో మండలాల వారీగా విచారణకు దిగింది. ఈ క్రమంలో షాదీముబారక్ పథకం కింద సరూర్‌నగర్ మండలం నుంచి సుల్తానాబేగం అనే లబ్ధిదారురాలి ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లారు. చిరునామా తప్పుగా ఉందని గ్రహించిన ఏసీబీ అధికారులు సయ్యద్‌నగర్‌లో చిరునామాను పసిగట్టి వారిని విచారించగా.. తన వివాహం జూన్ 9, 2013లో జరిగిందని, దీంతో తనకు అర్హత లేనందున దరఖాస్తు చేసుకోలేదని నిఖానామాను చూపింది. దీంతో ఖంగుతిన్న అధికారులు మరింతలోతుగా పరిశీలన చేపట్టారు. దరఖాస్తు ఫారంతో ఉన్న వివరాల్లో సంతకాలు ఒకేలా ఉన్నప్పటికీ.. పెళ్లి కుమారుడి ఓటరు కార్డులో నకిలీ ఫొటో, నిఖానామాలో ఫోర్జరీ, తప్పుడు ఆదాయపత్రం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం పహడీషరీఫ్‌లోని ఇండియన్ బ్యాంకు ఖాతాలో జమైంది. అయితే ఈ నిధులను డ్రా చేసిన విత్‌డ్రా ఫాంలోనూ సరైన సంతకం ఉంది. కానీ ఈ ఖాతా తెరిచిన వ్యక్తికి పరిచయస్తుడైన ఖాతా దారుడు సంతకం పెట్టకపోవడం గమనార్హం. -
షాదీముబారక్ దరఖాస్తులపై నిఘా
సాక్షి, హైదరాబాద్: షాదీముబారక్ పథకంలో అక్రమాల నిర్మూలన కోసం ప్రభుత్వం స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో షాదీముబారక్ దరఖాస్తులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పరిశీలన జరిపించాలని ఆదేశిస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన తరహాలో షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన జరపాలని కోరింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం స్థానిక తహసీల్దార్లు ఈ దరఖాస్తులపై పరిశీలన జరపాలని కోరింది. ప్రభుత్వం అందించే రూ. 51 వేల ఆర్థిక సహాయాన్ని వధువు తల్లిఖాతాలోకి జమ చేయాలని ఆదేశించింది. -
'షాదీ ముబారక్'లో అక్రమాలపై ఏసీబీ విచారణ
నార్నూరు: ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో షాదీ ముబారక్ పథకంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. 2003 నుంచి 2008 మధ్య వివాహం చేసుకున్న వారు కూడా ఇటీవల షాదీ ముబారక్ పథకం కింద లబ్ది పొందిన విషయాన్ని సాక్షి పత్రిక కథనాలను ప్రచురించింది. దీంతో ముగ్గురు ఏసీబీ అధికారులు నార్నూరు ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ ఎమ్మార్వో సోము సమక్షంలో రికార్డులను తనిఖీ చేపట్టారు. 11 మందికిగాను ఇద్దరు లబ్దిదారులను గుర్తించారు. అనంతరం రెండు రోజుల తర్వాత మరోసారి తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
తప్పులు చేస్తే జైళ్లకే..
- షాదీ ముబారక్, పింఛన్లు పక్కదారి పట్టొద్దు - విద్యార్ధుల ఆధార్, బ్యాంకు ఖాతాలపై నిర్లక్ష్యం తగదు - ఇన్ చార్జి డీపీఓ రమాదేవి ఇబ్రహీంపట్నం: అధికారులు తప్పులు చేసి జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని ఇన్చార్జి డీపీఓ రమాదేవి హెచ్చరించారు. మంగళవారం ఆమె ఇబ్రహీంపట్నంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. పేదలకు రెండో పెళ్లికి షాదీ ముబారక్ పథకం, ఉద్యోగుల తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్లు వర్తించని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పలుచోట్ల ఇలాంటి తప్పులు బయటపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. సంబంధిత వారినుంచి డబ్బులు రికవరీ చేస్తున్నట్లు వివరించారు. ఒకటికి రెండుసార్లు విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు గుర్తించాలని.. తప్పులు చేస్తే శిక్ష తప్పదని అధికారులను హెచ్చరించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కోసం ఎంతమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారని డీపీఓ మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించగా సరైన సమాధానం అయన చెప్పకపోవడంతో రమాదేవి అసహనానికి గురయ్యారు. విద్యార్ధుల ఆధార్ నంబర్ల సేకరణ, స్కాలర్షిప్స్, బ్యాంకు ఖాతాల వివరాల సేకరణలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అవసరమైతే ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్పు తక్కువ కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కులం, ఆదాయం, నివాస పత్రాలు తీసుకోవడం లేదని విద్యాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని, స్కాలర్షిప్స్ పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేయాలని రమాదేవి సూచించారు. రెండు వారాల క్రితం సమావేశమైనప్పుడు చెప్పిన సమాధానాలే అధికారుల నుంచి వస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కింద చెట్లు నాటాం.. ఇంకేం పని అని అనుకోవద్దు.. మళ్లీ వర్షకాలం వస్తుంది.. తిరిగి సదరు పథకం కింద మొక్కలు నాటాల్సి ఉందన్నారు. మండలంలో 2.09 లక్షల మొక్కలు నాటగా అందులో 52 శాతం వర్షాభావంతో ఎండిపోతున్నట్లు ఉపాధి హామీ ఏపీఓ లలిత తెలిపారు. వీలైనన్ని ఎక్కువ మొక్కలను బతికించుకునేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఆయా అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ ఎప్పుడైనా ప్రశ్నించవచ్చని, ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి డీపీఓ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ విజయేందర్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
షాదీ ముబారక్‌కు గ్రహణం!
నెలల తరబడి విచారణలో దరఖాస్తులు పెళ్లికి ముందు అందని ఆర్థిక సహాయం నగరంలో 3 వేలకు పైగా పెండింగ్ హజ్ హౌస్ చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు సిటీబ్యూరో: నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక చేయూత అందించేందుకు సర్కారు ఆర్భాటంగా ప్రకటిం చిన ‘షాదీ ముబారక్ ’ పథకానికి గ్రహణం పట్టుకుంది. ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహాయం అందుతుందన్న గంపెడాశతో ముహూర్తం తేదీలు ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో దరఖాస్తులు విచారణకు నోచుకొకుండా పెండింగ్‌లో మగ్గుతున్నాయి. మరోవైపు విచారణ జరిగి ఆర్థిక సహాయం మం జూరైనా ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. నిరుపేద కుటుంబాలు పెళ్లిల్లకు అప్పులు చేయక తప్పడం లేదు. పెళ్లికి ముందు ఏదీ ముబారక్? షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లికి నెలరోజుల ముందు పెళ్లి పత్రికతో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు...చివరకు పెళ్లి అయిపోయాక కూడా సహాయం అందని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి అయిన తర్వాత కూడా వెంటపడితే కానీ సాయం మంజూరు కావడం లేదు. పథకాన్ని అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల వెరిఫికేషన్ బాధ్యత ను రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ శాఖ సిబ్బంది ఇతరాత్రా విధుల్లో బిజీగా ఉండటంతో షాదీ ముబారక్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు ఉర్దూ అకాడమీ, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి వెరిఫికేషన్‌ను అప్పగించడంతో వారు చేతివాటం ప్రదర్శిస్తునట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని తాజాగా తప్పించి హజ్ కమిటీకి, రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్‌లో పడి ఆర్థిక సహాయం మంజూరుకు అడ్డంకిగాా మారాయి. ఇదీ పరిస్థితి... షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 8600 పైచి లుకు దరఖాస్తులు అందగా అందులో సగానికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని దరఖాస్తులు వెరిఫికేషన్‌కు నోచుకున్నప్పటికీ మంజూరు పెండింగ్‌లో పడిపోయిం ది. ఇటీవల 142 పెళ్లిల్లకు ఆర్థిక సహాయం మంజూ రైనా సాంకేతిక తప్పిదంతో రెండు పర్యాయాలు నగదు జమకావడం మరోవివాదానికి దారితీసింది. తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు బ్యాంక్ ఖాతాలనీ సీజ్ చేయడంతో నగదు ఉన్నా వినియోగించలేని పరిస్థితి నెల కొంది.ఈ వ్యవహారంతో గత నెల రోజులుగా ఎలాంటి ఆర్థిక సహాయం బ్యాంకులో జమ కాలేదు. పెళ్లి తంతు ముగిసినా అందలేదు.. షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక చేయూత అందుతున్న ఆశతో నగరంలోని బహదూర్ పురాకు చెందిన అమీనుద్దీన్ తన కుమార్తె పెళ్లి ఖరారు చేసుకొని ఒక నెల ముందే సెప్టెంబర్ 14న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తు హార్డ్ కాపీలను హజ్‌హౌస్‌లోని ైమైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించారు. నిఖా నాటికి ఆర్థిక చేయూత అందకపోవడంతో అప్పు చేసి అక్టోబర్ 10న పెళ్లి జరిపించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి రెండు నెలలు దాటినా కనీసం విచారణకు ఎవరూ రాలేదు. నిరుపేద తండ్రి హజ్‌హౌస్‌కు వచ్చి గగ్గోలు పెడితే కాని అధికారులు స్పందించలేదు. దరఖాస్తు స్టేటస్‌ను ఆన్లైన్లో పరిశీలించగా ఎలాంటి విచారణ జరుగలేదని తేలింది. దీంతో సదరు అధికారి వెంటనే హజ్ కమిటీ సిబ్బందికి దరఖాస్తులు అప్పగించి విచారణకు పంపించాలని సెక్షన్ ఇన్చార్జికి ఆదేశించడం గమనార్హం. ఇదీ డిప్యూటీ సీఎం ప్రకటన... హైదరాబాద్ నగరంలో ఆర్థిక స్థోమత లేక పెళ్లి కాని 30 సంవత్సరాలు దాటిన నిరుపేద ముస్లిం యువతులు సుమారు 40 వేలకు పైగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. నిరుపేద తల్లితండ్రులను ఆదుకునేందుకు షాదీ ముబారక్ పథకం కింద వధువు పేరుతో రూ. 51 వేల నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాం. ప్రతి యేట 20 వేల పెళ్లిలకు ఆర్థిక చేయూత అదించాలని లక్ష్యంగా నిర్ణయించాం. - రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ -
గ్రీన్ చానల్ కింద షాదీ ముబారక్!
ట్రెజరీ ఆంక్షలు లేకుండా నిధులు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి గ్రీన్ చానల్‌ను వ ర్తింపజేసింది. ట్రెజరీ ఆంక్షలను లేకుండా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ లబ్ధిదారుల వార్షిక ఆదా య పరిమితి రూ. 2 లక్షలు, గ్రామీణ లబ్ధిదారుల వార్షిక ఆదాయ పరిమితిని రూ. 2 లక్షల నుంచి 1.50 లక్షకు తగ్గించింది. జనన ధ్రువీకరణపత్రం తప్పనిసరి అనే నిబంధనను సడలించి రేషన్, ఓటరు ఐడీ, ఆధార్ కార్డులను వయస్సు ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని స్పష్టం చేసింది. గత ఏడాది పథకం ఆరంభంలో ఎదురైన అవరోధాలను అధిగమించేందుకు చర్య లు చేపట్టడంతో షాదీ ముబారక్ పథకానికి గ్ర హణం వీడినట్లయింది. లబ్ధిదారులకు నిధులు మంజూరైనా ట్రెజరీ శాఖ ప్రతినెల 5 నుంచి 18 తేదీ వరకు మాత్రమే బిల్లులను ఆమోదించడంతో సకాలంలో లబ్ధి అందడంలేదు. తాజాగా ట్రెజరీల ద్వారా నిధులు విడుద లై బ్యాంకు ఖాతాల్లో జమా అవుతాయి. పెళ్లి తర్వాత కూడా.. షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లి తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. వివాహానికి సంబంధిం చిన ఫొటోను ఆన్లైన్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. 2014 అక్టోబర్ 2 తర్వాత ఆడబిడ్డల పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలు ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకుంటే మాత్రం వివాహ ఆహ్వానపత్రం, ఇతర పత్రాలను సమర్పించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కేవలం 40 రోజుల్లో షాదీ ముబారక్ పథకం కింద 6,913 నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 2,335 మందికి, గత ఆర్థిక సంవత్సరం 5,839 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 5,414 మందికి లబ్ధిఅందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దళారులను నమ్మవద్దు షాదీ ముబారక్ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. వివాహానికి ముందు కానీ, తర్వాత కానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దళారులను నమ్మవద్దు. మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. హెల్ప్‌లైన్ నంబర్ 040-24760452 కు ఫోన్‌చేసి సహకారం పొందవచ్చు. -మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, డెరైక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖ -
‘కల్యాణలక్ష్మి’కి కష్టాలు
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వధువులకు సరిగా అందని ఆర్థిక సాయం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చిక్కులు ధ్రువపత్రాలు సంపాదించేందుకే నెలలకొద్దీ సమయం సాక్షి నెట్వర్క్: పేద కుటుంబాల యువతుల వివాహాల కోసం ఉపయోగపడాల్సిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అడ్డగోలు నిబంధనల చట్రంలో చిక్కుకుపోయాయి. సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, తనిఖీ పేరిట జరుగుతున్న జాప్యంతో పథకాలు గందరగోళంగా మారాయి. దరఖాస్తులపై వెరిఫికేషన్‌ను పూర్తిచేసి, ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. దీంతోపాటు జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఇదే మొదటి పెళ్లి అని నిర్ధారించేదాకా... కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాల నుంచి పెళ్లి కుమారుడి సర్టిఫికెట్ల దాకా 20 వరకు ధ్రువపత్రాలు సమర్పించాల్సి రావడం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారింది. అసలు ఈ పథకాలపై అవగాహన లేకపోవడం, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి రావడం వంటివాటి కారణంగా అర్హులైన పేద కుటుంబాలకు లబ్ధి కలగడం లేదని ప్రభుత్వాధికారులే అంటుండడం గమనార్హం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కల్యాణ లక్ష్మి పథకానికి ఇప్పటివరకు 2,222 మంది దరఖాస్తు చేసుకుంటే... అందులో బ్యాంకు ఖాతాలో నగదు జమ అయింది మాత్రం 503 మందికే. షాదీ ముబారక్ పథకానికి 2,173 మంది దరఖాస్తు చేయగా... నిధులు జమ అయింది 1,045 మందికే. దరఖాస్తు తంటాలు:ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాల యువతుల వివాహాలకు రూ. 51 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాల ఉద్దేశం బాగానే ఉన్నా... దరఖాస్తు చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. లబ్ధిపొందే వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హత పత్రాలను సమర్పించాలి. వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే చాలామందికి దీనంతటిపై అవగాహన లేదు. అవగాహన ఉన్నవారికి ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. ఈ పత్రాలన్నీ తెచ్చుకునేందుకే చాలా సమయం పడుతుండడంతో పాటు ఖర్చూ పెట్టాల్సి వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఆచరణ ఏదీ..? ఈ పథకాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ. 3 కోట్లను కేటాయించింది. కానీ రూ. 50 లక్షలైనా ఖర్చుచేయలేదని తెలుస్తోంది. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్ధిదారులకు త్వరగా సహాయం అందించగలమని అధికారులే చెబుతుండడం గమనార్హం. ఈ పథకాలకు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు చెక్‌లిస్ట్‌తో జత చేసి తహసీల్దార్ కార్యాలయాలకు పంపాలి. వాటిని తహసీల్దార్లు పరిశీలించాలి. తర్వాత వధువు ఇంటికి వెళ్లి వీఆర్వో విచారించాలి. ఈ క్రమంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. మంత్రి చెప్పినా సరే.. మంత్రి కేటీఆర్ ఇటీవల మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సందర్భంగా... గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కష్టమని, మాన్యువల్‌గా దరఖాస్తులు ఇచ్చినా తీసుకుని వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. కానీ అధికారులు అదేమీ పట్టించుకోవడం లేదు. చదువుకున్నా.. లేనట్లయింది నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పేర్వాలకు చెందిన షేక్ సయ్యద్ కుమార్తె సమీనాబేగం వివాహం గత జనవరి నెలలో జరిగింది. 2008కి ముందు బీసీ ‘బీ’లో ఉన్నవారి కులాన్ని.. తర్వాత ప్రభుత్వం బీసీ ‘ఈ’ జాబితాలో చేర్చింది. కానీ అప్పటికే చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లో మాత్రం బీసీ ‘బీ’గా పేర్కొంటుండగా ప్రస్తుతం బీసీ ‘ఈ’ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే అధికారులు అంగీకరించడం లేదు. దీంతో పెద్ద తంటా వచ్చి పడింది. పదవ తరగతి ఉత్తీర్ణురాలైన సమీనాబేగం చివరకు షాదీ ముబారక్ పథకానికి అర్హురాలిగా మారేందుకు.. తానేమీ చదువుకోలేదన్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి వచ్చింది. -
‘షాదీ’.. పరేషానీ
‘షాదీ హోగయేతో...బోజ్ ఉతర్ జాయేగా’ పేదింట ఆడపిల్ల పెళ్లి... నెత్తి మీద భారమే. ఖార్కానాల్లో...సైకిల్ పంక్ఛర్ దుకాణాల్లో రోజు కూలీతో గుట్టుగా సంసారం వెళ్లదీసుకునే నిరుపేద ముస్లింల పరిస్థితి మరీ అధ్వాన్నం. ఎదిగిన ఆడపిల్లకు సంబంధాలు తీసుకురాలేక, అరబ్ షేక్‌లకు ‘నిఖా’ చేసి పంపుతున్న సంఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. అందువల్లే సీఎం కేసీఆర్ నిరుపేద ముస్లింల కోసం కోసం అందించిన అద్భుత వరం ‘షాదీ ముబారక్’. కానీ అధికారుల అలసత్వం, కుల ధ్రువీకరణ పత్రం, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు ‘షాదీ’కి అడ్డం పడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేద ముస్లిం యువతు ల వివాహం కోసం తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకానికి ఇప్పటి వరకు జిల్లాలో 148 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2014-15 సంవత్సరానికి గాను మైనార్టీ కార్పొరేషన్ కింద సామూహిక వివాహాలు చేసేందుకు కోసం 6.51 లక్షల నిధులు విడుదల కాగా, ఈ నిధుల నుంచే ముగ్గురు ‘షాదీ ముబారక్ లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున పంపిణీ చేశారు. వాస్తవానికి నిరుపేదలైన మైనార్టీలకు ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. అందుకే దళిత, గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకం కంటే షాదీ ముబారక్ పథకానికేఎక్కువ స్పందన లభించింది. పథకం నిబంధనల మేరకు వివాహానికి 15 రోజులు ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, నిఖా జరిగి నెలలు గడిచినా నిధులు ఇంతవరకూ మంజూరు కాలేదు. దరఖాస్తులో సగమే పరిశీలన షాదీముబారక్ పథకానికి జిల్లాలో148 మంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు ప్రాథమిక పరిశీలనలో 65 దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు (డాక్యుమెంటేషన్) సరిగా లేవనే కారణంతో మిగిలిన వాటిని పక్కన పెట్టారు. ఈ 65 దరఖాస్తుల్లోనూ 41 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వారికి పథకం ముంజూరు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మంజూరు సర్టిఫికెట్ ఇచ్చిన 41 మంది లబ్ధిదారుల్లోని 17 మందికి సంబంధించిన డబ్బును మాత్రమే జిల్లా కోశాధికారి కార్యాలయానికి పంపారు. కానీ జనవరి 13వ తేదీ వరకు ఏ ఒక్కరి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. సమస్యగా మారిన కుల ధ్రువీకరణ పత్రం రెవెన్యూ చట్టం ప్రకారం షేక్‌లకు బీసీ-ఈ సర్టిఫికెట్, పఠాన్లు, సయ్యద్‌లకు ఓసీ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే పఠాన్లను, షేక్‌లను సయ్యద్‌లను గుర్తించడం కష్టంతో కూడుకున్న పని కావడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారీలో తహశీల్దార్లకు కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్ని ముస్లిం మైనార్టీలు మంత్రి హరీష్‌రావు దృష్టికి, తహశీల్దార్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా దృష్టికి తీసుకెళ్లారు. సమస్య నుంచి తక్షణం గట్టెక్కడం కోసం కమ్యూనిటీ పత్రాలు జారీ చేయాలని సూచించారు. అంటే షాదీ ముబారక్ పథకం కోసం కుల ధ్రువీకరణ పత్రం కావాలనుకున్న వారికి ధ్రువీకరణ పత్రంలో ఓసీ, బీసీ-ఈ అనే వర్గీకరణ లేకుండా కేవలం ముస్లిం మైనార్టీ అని మాత్రమే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని సూచించారు. అయితే కలెక్టర్ సూచించినట్టుగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారిక ఉత్తర్వులు ఉండాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి తహశీల్దార్లు వెనుకంజ వేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో డీడీలు అందిస్తాం డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడంతో 83 దరఖాస్తులు పక్కన పెట్టాం. మరో 24 దరఖాస్తులు అధికారుల పరిశీలనలోనే ఉన్నాయి. షాదీ ముబారక్ లబ్ధిదారులకు రెండు రోజుల్లో డీడీలు అందిస్తాం. ఇప్పటికే 17 మంది లబ్ధిదారుల డబ్బును ట్రెజరీకి జమ చేశాం, కానీ ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలె త్తడంతో వారి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. -మధు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, -
కల్యాణ ‘లక్షి’ ఏదీ
నల్లగొండ :నిరుపేద ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. దరఖాస్తులు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. ఇదీ పథకం ఉద్దేశం ప్రభుత్వం షాదీముబాకర్ పథకాన్ని అక్టోబర్ 2న, కల్యాణలక్ష్మిని అదే నెలలో 21న ప్రవేశపెట్టింది. అక్టోబర్ 2వ తేదీన తర్వాత వివాహ ం చేసుకున్న అమ్మాయిలకు ఈ పథకాల ద్వా రా ఆర్థికసాయం అందించాల్సి ఉంది. ఇందుకుగాను అమ్మాయిలు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. అమ్మాయి, అబ్బా యి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించరాదు. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉం టుంది. అన్ని అర్హతలు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన మేరకు వివాహం చేసుకున్న కుటుంబాలకు రూ. 51 వేల ఆర్థిక సాయం అందుతుంది. కానీ ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారులకు ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. తప్పని ఎదురుచూపులు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పథకాలకు వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లు పరిశీలించి ఆమోదముద్ర వేసి సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంది. కానీ నేటికీ ఆపని పూర్తి కాలేదు. ఎస్సీలకు మాత్రం ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది. తహసీల్దార్ల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సీనియారిటీ ప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తామని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ వెంకటనర్సయ్య తెలిపారు. ఎస్టీ, ముస్లిం, మైనార్టీ శాఖలకు ఇంకా నిధులు విడుదల కాకపోగా, దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తిచేయకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కల్యాణ లక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు ఎస్సీల నుంచి 52 తహసీల్దార్ల పరిశీలన పూర్తయినవి 4 ఎస్టీ 18 పరిశీలన పూర్తయినవి 4 షాదీముబారక్‌కు వచ్చిన దరఖాస్తులు 51 తహసీల్దార్లు పరిశీలించాల్సి ఉంది. -
కేసీఆర్......షాదీ ముబారక్
హైదరాబాద్ : ముస్లిం వధువులకు వివాహానికి రూ.51వేల చొప్పున నగదు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 'షాదీ ముబారక్' గా నామకరణం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు. అలాగే దసరా నుంచి కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా దళిత, గిరిజన వధువులకు వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఆ నగదును ప్రభుత్వం పెళ్లి కూతురు పేరిట బ్యాంకులో జమ చేయనుంది. రాష్ట్రంలో ఏటా దాదాపు లక్ష వరకు ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లిళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.