హైదరాబాద్ : ముస్లిం వధువులకు వివాహానికి రూ.51వేల చొప్పున నగదు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 'షాదీ ముబారక్' గా నామకరణం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సూచించారు.
అలాగే దసరా నుంచి కల్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా దళిత, గిరిజన వధువులకు వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఆ నగదును ప్రభుత్వం పెళ్లి కూతురు పేరిట బ్యాంకులో జమ చేయనుంది. రాష్ట్రంలో ఏటా దాదాపు లక్ష వరకు ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లిళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.