షాదీ ముబారక్‌కు గ్రహణం!
నెలల తరబడి విచారణలో దరఖాస్తులు
పెళ్లికి ముందు అందని ఆర్థిక సహాయం
నగరంలో 3 వేలకు పైగా పెండింగ్
హజ్ హౌస్ చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు
సిటీబ్యూరో: నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక చేయూత అందించేందుకు సర్కారు ఆర్భాటంగా ప్రకటిం చిన ‘షాదీ ముబారక్ ’ పథకానికి గ్రహణం పట్టుకుంది. ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహాయం అందుతుందన్న గంపెడాశతో ముహూర్తం తేదీలు ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో దరఖాస్తులు విచారణకు నోచుకొకుండా పెండింగ్‌లో మగ్గుతున్నాయి. మరోవైపు విచారణ జరిగి ఆర్థిక సహాయం మం జూరైనా ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. నిరుపేద కుటుంబాలు పెళ్లిల్లకు అప్పులు చేయక తప్పడం లేదు.
పెళ్లికి ముందు ఏదీ ముబారక్?
షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లికి నెలరోజుల ముందు పెళ్లి పత్రికతో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు...చివరకు పెళ్లి అయిపోయాక కూడా సహాయం అందని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి అయిన తర్వాత కూడా వెంటపడితే కానీ సాయం మంజూరు కావడం లేదు. పథకాన్ని అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల వెరిఫికేషన్ బాధ్యత ను రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ శాఖ సిబ్బంది ఇతరాత్రా విధుల్లో బిజీగా ఉండటంతో షాదీ ముబారక్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదు.
దీంతో అధికారులు ఉర్దూ అకాడమీ, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి వెరిఫికేషన్‌ను అప్పగించడంతో వారు చేతివాటం ప్రదర్శిస్తునట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని తాజాగా తప్పించి హజ్ కమిటీకి, రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్‌లో పడి ఆర్థిక సహాయం మంజూరుకు అడ్డంకిగాా మారాయి.
ఇదీ పరిస్థితి...
షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 8600 పైచి లుకు దరఖాస్తులు అందగా అందులో సగానికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని దరఖాస్తులు వెరిఫికేషన్‌కు నోచుకున్నప్పటికీ మంజూరు పెండింగ్‌లో పడిపోయిం ది. ఇటీవల 142 పెళ్లిల్లకు ఆర్థిక సహాయం మంజూ రైనా సాంకేతిక తప్పిదంతో రెండు పర్యాయాలు నగదు జమకావడం మరోవివాదానికి దారితీసింది. తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు బ్యాంక్ ఖాతాలనీ సీజ్ చేయడంతో నగదు ఉన్నా వినియోగించలేని పరిస్థితి నెల కొంది.ఈ వ్యవహారంతో గత నెల రోజులుగా ఎలాంటి ఆర్థిక సహాయం బ్యాంకులో జమ కాలేదు.
పెళ్లి తంతు ముగిసినా అందలేదు..
షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక చేయూత అందుతున్న ఆశతో నగరంలోని బహదూర్ పురాకు చెందిన అమీనుద్దీన్ తన కుమార్తె పెళ్లి ఖరారు చేసుకొని ఒక నెల ముందే సెప్టెంబర్ 14న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తు హార్డ్ కాపీలను హజ్‌హౌస్‌లోని ైమైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించారు. నిఖా నాటికి ఆర్థిక చేయూత అందకపోవడంతో అప్పు చేసి అక్టోబర్ 10న పెళ్లి జరిపించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి రెండు నెలలు దాటినా కనీసం విచారణకు ఎవరూ రాలేదు. నిరుపేద తండ్రి హజ్‌హౌస్‌కు వచ్చి గగ్గోలు పెడితే కాని అధికారులు స్పందించలేదు. దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలించగా ఎలాంటి విచారణ జరుగలేదని తేలింది. దీంతో సదరు అధికారి వెంటనే హజ్ కమిటీ సిబ్బందికి దరఖాస్తులు అప్పగించి విచారణకు పంపించాలని సెక్షన్ ఇన్‌చార్జికి ఆదేశించడం గమనార్హం.
ఇదీ డిప్యూటీ సీఎం ప్రకటన...
హైదరాబాద్ నగరంలో ఆర్థిక స్థోమత లేక పెళ్లి కాని 30 సంవత్సరాలు దాటిన నిరుపేద ముస్లిం యువతులు సుమారు 40 వేలకు పైగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. నిరుపేద తల్లితండ్రులను ఆదుకునేందుకు షాదీ ముబారక్ పథకం కింద వధువు పేరుతో రూ. 51 వేల నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాం. ప్రతి యేట 20 వేల పెళ్లిలకు ఆర్థిక చేయూత అదించాలని లక్ష్యంగా నిర్ణయించాం.
- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ