పేదల కష్టం తెలిసినోడు కేసీఆర్
► డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి
► కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మెదక్ మున్సిపాలిటీ: మన కడుపునొప్పి తెలిసినోడు కేసీఆర్ అని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మాయ గార్డెన్‌లో నియోజకవర్గంలోని 214మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లల తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 45వేల చెరువులను గుర్తించి మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తోందన్నారు.
చెరువులకు జలకళ రావడంతో ఊర్లు బాగుపడుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పైప్‌లైన్ల నిర్మాణం పూర్తైందని, డిసెంబర్‌లోగా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు. మెదక్ నియోజకవర్గానికి రెండు వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులకు వాటిని కేటాయిస్తామని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్యుత్ కొరత లేకుండా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు రూ. నాలుగు వేలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తోందన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, రామాయంపేట ఎంపీపీ విజయలక్ష్మి, పాపన్నపేట జెడ్పీటీసీ స్వప్న, పాపన్నపేట ఎంపీపీ పవిత్ర, తహసీల్దార్ యాదగిరి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.