వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లని గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. మరి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సీటు గురించి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు నాలుగోసారి సీటు కష్టమేనా? ఇంతకీ మెదక్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్నదెవరు?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ క్యాడర్‌ను పెంచుకుంటున్న మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి తాను పోటీలో ఉంటానని చెబుతున్నారు.
ఇన్ని రోజులు తనకు పెద్దగా పోటీ ఇచ్చేవారు ఎవరూ లేరనుకున్న పద్మా దేవేందర్ రెడ్డికి మైనంపల్లి రోహిత్ రాక తలనొప్పిగా మారింది. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్ నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మైనంపల్లి తనయుడు రోహిత్.
సీఎం కేసీఆర్‌తో మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్
మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించినా.. మెదక్ సీటుపై ఎక్కడో తేడా కొడుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్లో రోహిత్ ఎంట్రీతో జోష్ పెరిగింది. నియోజకవర్గంలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ
ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి నిర్లక్ష్యం వల్లనే రామాయంపేట అభివృద్ధి చెందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని గిరిజన తండాలలో మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయం లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా పద్మా దేవేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే అపవాదును ఎదుర్కొంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కేడర్‌లోనూ.. ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకతను తనకు సానుకూలంగా మార్చుకునేందుకు మైనంపల్లి రోహిత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలే లక్షంగా నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించి, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద యువతుల వివాహానికి పుస్తెలు, కాలి మట్టెలు అందిస్తున్నారు.
నిరుపేదలు మృతి చెందితే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. నిజాంపేట మండలంలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రామాయంపేట మండలం, చిన్నశంకరంపేట మండలాల్లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గులాబీ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ కొనసాగుతున్నారు. మూడు సార్లు గెలిచి, డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వరిస్తుందని ఆశించినా నెరవేరలేదు. టిక్కెట్ ఆశించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న తమ నాయకురాలు పద్మా దేవేందర్ వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఖాయమని ఆమె వర్గీయులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment