mainampally hanumantha rao
-
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
బాధతో పార్టీని వీడుతున్నా..
సాక్షి, మేడ్చల్ జిల్లా:/అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. బీఆర్ఎస్లో తన కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి దెబ్బే.. శ్రీధర్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్ బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. -
హైదరాబాద్: మల్కాజిగిరిలో రాజకీయ మార్పులు! మైనంపల్లి రాజీనామా!!
హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే మల్కాజిగిరిలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ అగ్ర నాయకుడు హరీష్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వకపోతే తాను సైతం పోటీ చేయనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మైనంపల్లి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. శుక్రవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీవైపే మైనంపల్లి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరతారని సమాచారం. వేగంగా పావులు కదిపిన బీఆర్ఎస్.. మైనంపల్లి హన్మంతరావు రాజీనామా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీ పటిష్టత కోసం వేగంగా పావులు కదిపింది. మైనంపల్లి పార్టీని వీడితే ఏం చేయాలనే దానిపై ముందస్తుగానే కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి నుంచి మొదటగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు చేస్తూ పార్టీ నాయకత్వం చెల్లా చెదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ వీడుతున్నారన్న సమాచారం రాగానే ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల బదిలీలు చేపట్టింది. జీహెచ్ఎంసీలో డీఈగా పనిస్తున్న మహేష్‌ను బదిలీ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి, నేరేడ్మెట్ సీఐ నాగరాజులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వెంట వెళ్లేది ఎవరో.. ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళం ఏర్పడినట్లే. ఆయన వెంట ఎవరెవరు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని 9 డివిజన్లలో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా..ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు కార్పొరేటర్లు మాత్రం కచ్చితంగా మైనంపల్లి వెంట వెళ్తారని తెలుస్తోంది. మిగతా నలుగురిలో ఒకరైన విజయశాంతి తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ముందే ప్రకటించారు. ఇక ముగ్గురి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉద్యమకారులు, ఓ మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు కొందరు మాత్రం పార్టీని మారేది లేదని స్పష్టంగా ప్రకటించారు. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
మైనంపల్లికి సన్‌స్ట్రోక్ తప్పదా?
హైదరాబాద్: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది ప్రస్తుతం మల్కాజిగిరిలో చర్చనీయాంశంగా మారింది. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మల్కాజిగిరి అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మైనంపల్లి ఈ దఫా తనకు సిట్టింగ్ సీటుతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఆశించారు. రోహిత్ కొన్నాళ్లుగా మెదక్‌లో తన సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మైనంపల్లికి సైతం మెదక్ జిల్లాతో సత్సంబంధాలు ఉండటంతో కచ్చితంగా అక్కడి నుంచి రోహిత్ పోటీలో ఉంటారంటూ ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు. అయితే.. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికే మాత్రమే టికెట్ ఖరారు చేసింది. తన కుమారుడికి టికెట్ ప్రకటించకపోవడంపై మైనంపల్లి గుస్సా అయ్యారు. మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అధిష్టానం చివరి నిమిషంలోనైనా తన కుమారుడికి టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని, కొందరి నేతలపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అయిదు రోజుల క్రితం తన నివాసంలో మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రజాభిప్రాయం కూడా సేకరించి వారం రోజుల తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని మీడియా సమావేశంలో మైనంపల్లి ప్రకటించారు. కాగా.. ఇప్పటివరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి మైనంపల్లి హన్మంతరావుకు పిలుపు రాలేదని తెలుస్తోంది. ఆయన కూడా అధిష్టానం వద్దకు వెళ్లివచ్చినట్లు కనిపించలేదు. అభ్యర్ధి మార్పుపై ఊహాగానాలు బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని మార్చడానికే సిద్ధమైనట్లు ప్రచార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, శంభీపూర్ రాజు.. వీరిలో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే వాదనలు బయలుదేరాయి. ఈ వాదనలను వారిద్దరూ ఖండించినప్పటికీ మైనంపల్లిని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజెపీలో ఆయనకు చోటు లేదని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తండ్రీకొడుకుల్లో ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చేందుకు రెడీ అన్నట్టు తెలుస్తోంది. అది కూడా మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్, మెదక్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. మైనంపల్లిని మల్కాజిగిరి నుంచి తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రభావితం చూపుతారన్న విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా? తేడా వస్తే ఎవరినీ లెక్క చేయని ఆ పార్టీ అధినేత ఇవన్నీ పట్టించుకుంటారా? మొత్తంగా తనయుడికి సీటు కోసం యుద్ధం చేస్తున్న మైనంపల్లి విజయం సాధిస్తారా? లేదంటే చివరికి సన్ స్ట్రోక్ తగిలి ఆయనే దెబ్బతింటారా? అనేది త్వరలోనే తేలనుంది. -
మైనంపల్లి రోహిత్ దారెటు?
మెదక్: మెదక్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావంతో గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో సొంత డబ్బులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ మైనంపల్లి రోహిత్. తీరా సోమవారం సీఎం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. కాగా ఇన్నాళ్లు తననే నమ్ముకుని వెంట వచ్చిన వారికి న్యాయం చేయాలంటే తన కొడుకును పోటీలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళతారా..? లేక బీజేపీలో చేరి పోటీలో నిలబడతారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా.. అనే చర్చసాగుతోంది. మంత్రి హరీశ్‌రావుపై ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం లేదని, మల్కాజ్గిరి టిక్కెట్‌ను కూడా హన్మంతరావు తిరస్కరిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఇప్పటికే వీరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. మెదక్ బరిలో దిగి సత్తా చాటాలని హన్మంతరావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మకు పలువురు నుంచి గట్టి పోటీ తప్పేలాలేదు. మైనంపల్లి రోహిత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకయిన రోహిత్ గత కొన్నాళ్లుగా వేర్వేరు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మెడిసిటీ నుంచి MBBS చదివి డాక్టర్ అయిన రోహిత్.. మెడికల్ ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి రూటు మార్చారు. "మైనంపల్లి సోషల్ సర్వీస్ అర్గనైజేషన్" పేరిట ఓ స్వచ్ఛంధ సంస్ధను నెలకొల్పి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మల్కాజ్ గిరితో పాటు మెదక్ లో వేర్వేరుకార్యక్రమాలు చేపట్టారు. శానిటైజర్లు, మాస్క్ ల పంపిణీ, కమ్యూనిటీ హళ్ల నిర్మాణం, పేదలకు బియ్యం పంపిణీ, కాలనీల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఎలాగైనా టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఇప్పటికే కోట్లాది రుపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇక సిల్వర్ స్పూన్ తో పుట్టిన రోహిత్ లైఫ్ స్టైల్ లోనూ అదే తరహాలో కనిపిస్తాడు. ఫెర్రారీ 488 స్పైడర్, మెర్సిడెస్ AMG, రేంజ్ రోవర్స్, ఆడి కార్లతో పాటు తరచుగా హర్లీ డేవిడ్ సన్ బైక్ లపై తిరుగుతాడు. ముఖ్యంగా మల్కాజ్ గిరిలో సీఎం కెసిఆర్ కు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా రోహిత్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. వేలాది బ్యానర్లు, నిలువెత్తు కటౌట్లతో బోలెడు ప్రచారం నిర్వహించడం మైనంపల్లి కుటుంబానికే చెల్లింది. చదవండి: మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం! -
సొంత గూటిలోనే కుంపటి.. హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు ఈసారి కష్టమే!
వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే సీట్లని గులాబీ దళపతి కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. మరి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సీటు గురించి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన పద్మా దేవేందర్‌కు నాలుగోసారి సీటు కష్టమేనా? ఇంతకీ మెదక్ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నిస్తున్నదెవరు? మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ ఎంట్రీతో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ క్యాడర్‌ను పెంచుకుంటున్న మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి తాను పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఇన్ని రోజులు తనకు పెద్దగా పోటీ ఇచ్చేవారు ఎవరూ లేరనుకున్న పద్మా దేవేందర్ రెడ్డికి మైనంపల్లి రోహిత్ రాక తలనొప్పిగా మారింది. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్ నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మైనంపల్లి తనయుడు రోహిత్. సీఎం కేసీఆర్‌తో మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించినా.. మెదక్ సీటుపై ఎక్కడో తేడా కొడుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్లో రోహిత్ ఎంట్రీతో జోష్ పెరిగింది. నియోజకవర్గంలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే రామాయంపేట అభివృద్ధి చెందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని గిరిజన తండాలలో మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయం లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా పద్మా దేవేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కేడర్‌లోనూ.. ప్రజల్లోనూ ఉన్న వ్యతిరేకతను తనకు సానుకూలంగా మార్చుకునేందుకు మైనంపల్లి రోహిత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలే లక్షంగా నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి ఆర్థిక సహాయం అందించి, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద యువతుల వివాహానికి పుస్తెలు, కాలి మట్టెలు అందిస్తున్నారు. నిరుపేదలు మృతి చెందితే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారులకు 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. నిజాంపేట మండలంలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రామాయంపేట మండలం, చిన్నశంకరంపేట మండలాల్లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి గులాబీ పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ కొనసాగుతున్నారు. మూడు సార్లు గెలిచి, డిప్యూటీ స్పీకర్ పదవి నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి వరిస్తుందని ఆశించినా నెరవేరలేదు. టిక్కెట్ ఆశించే హక్కు ఎవరికైనా ఉంటుందని, కాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న తమ నాయకురాలు పద్మా దేవేందర్ వచ్చే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఖాయమని ఆమె వర్గీయులు చెబుతున్నారు. -
అలిగి అసెంబ్లీకి రాని మైనంపల్లి..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర పదవుల్లోనూ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీఆర్ఎస్ గ్రేటర్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి సోమవారం బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కగా... మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మనస్తాపంతో శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బెంగళూర్ వెళ్లారు. శాసనసభ ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, ఎమ్మెల్సీగానే ఉంటే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని తెలిపారు. కానీ తాజా మంత్రివర్గంలో తనను పక్కకు పెట్టడం, ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లను కాదని, ఇతరులకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మనోగతాన్ని వెల్లడించేందుకు సీఎంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మనస్తాపం చెందారు. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేబినెట్ విస్తరణకు ముందు కేటీఆర్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సరైన గుర్తింపునిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని.. తీరా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మైనంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ముఖ్య పదవుల భర్తీలోనూ తన ప్రాధాన్యతను గుర్తించడం లేదని ఆయన ఆదివారమే బెంగళూర్ వెళ్లారు. గ్రేటర్లో పార్టీ కోసం కష్టపడే మైనంపల్లికి కనీస గుర్తింపు ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సమంజసం కాదంటూ ఆయన సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేకే మైనంపల్లి బెంగళూర్ వెళ్లారని ఆయన సన్నిహితుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. -
చంద్రబాబుకు మైనంపల్లి ఝలక్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఝలక్ ఇచ్చారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పి, నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం బోలెడంత ఖర్చు పెట్టించి తీరా ఇప్పుడు ఆ స్థానాన్ని కాస్తా పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేశామని చెప్పడంతో ఆయన తీవ్ర నిరాశా నిస్పహలకు లోనయ్యారు. మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తనను మల్కాజిగిరి తీసుకొచ్చి, ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారని, నాలుగేళ్ల నుంచి ఈ మాట చెబుతూ వచ్చి ఇప్పుడు తీరాచూస్తే ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించి తనను అన్యాయం చేశారని మైనంపల్లి వాపోయారు. అందుకే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఢిల్లీ వెళ్లి, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.