హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే మల్కాజిగిరిలో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపించారు.
ఇటీవల ఆయన బీఆర్‌ఎస్ అగ్ర నాయకుడు హరీష్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వకపోతే తాను సైతం పోటీ చేయనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మైనంపల్లి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. శుక్రవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీవైపే మైనంపల్లి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరతారని సమాచారం.
వేగంగా పావులు కదిపిన బీఆర్‌ఎస్..
మైనంపల్లి హన్మంతరావు రాజీనామా నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం పార్టీ పటిష్టత కోసం వేగంగా పావులు కదిపింది. మైనంపల్లి పార్టీని వీడితే ఏం చేయాలనే దానిపై ముందస్తుగానే కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరి నుంచి మొదటగా బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లను పరిశీలించినట్లు సమాచారం.
వీరిద్దరిలో ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి బీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు చేస్తూ పార్టీ నాయకత్వం చెల్లా చెదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ వీడుతున్నారన్న సమాచారం రాగానే ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల బదిలీలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీలో డీఈగా పనిస్తున్న మహేష్‌ను బదిలీ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి, నేరేడ్‌మెట్ సీఐ నాగరాజులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆయన వెంట వెళ్లేది ఎవరో..
ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామాతో బీఆర్‌ఎస్ పార్టీలో కొంత గందరగోళం ఏర్పడినట్లే. ఆయన వెంట ఎవరెవరు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని 9 డివిజన్లలో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా..ఆరుగురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు కార్పొరేటర్లు మాత్రం కచ్చితంగా మైనంపల్లి వెంట వెళ్తారని తెలుస్తోంది.
మిగతా నలుగురిలో ఒకరైన విజయశాంతి తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని ముందే ప్రకటించారు. ఇక ముగ్గురి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉద్యమకారులు, ఓ మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు కొందరు మాత్రం పార్టీని మారేది లేదని స్పష్టంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment