సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ కాంగ్రెస్‌లో సీట్ల కోసం సిగపట్లు తప్పడం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీలో సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆరు గ్యారంటీ పథకాలతో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కూడా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోంది. మహానగరంతోపాటు శివారు నియోజకవర్గాల నుంచి ఊహించిన దానికంటే దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వడపోతపై వడపోతతో బలమైన అభ్యర్ధులను ఎంపిక కోసం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే నాలుగైదు పర్యాయాలు సమావేశమై అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి జాబితాను అందించింది. సర్వేల ఆధారంగా షార్ట్ లిస్టులో సైతం అన్ని విధాలుగా బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేసింది. గత మూడు రోజులుగా ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుసోంది. వారం రోజుల్లో తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది.
అందులో భాగంగా గ్రేటర్‌లో నాలుగు నియోజకవర్గాల్లో సింగిల్ పేరు చొప్పున, పది నియోజవర్గాలకు ఇద్దరేసి, మిగిలిన నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున అభ్యర్ధిత్వాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బరిలో దిగితే ఎవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపైన సీరియస్‌గా చర్చించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిని బట్టి తొలి జాబితాలో నగరంలోని కొన్ని స్థానాల అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘సింగిల్’ ఈ స్థానాల్లో..
సింగిల్ అభ్యర్ధిత్వాల విషయానికొస్తే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజవర్గానికి ఫిరోజ్ ఖాన్, గోషామహల్ స్థానానికి మెట్టు సాయికుమార్, పరిగి స్థానానికి రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ స్థానానికి గడ్డం ప్రసాద్ కుమార్ అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
నువ్వా.. నేనా..
బాగా పోటీ ఉన్న స్థానాలకు సంబంధించి.. స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో మహేశ్వరం స్థానానికి చిగురింత పారిజాత, దేప భాస్కర్‌రెడ్డి అభ్యర్థిత్వాలు, జూబ్లీహిల్స్‌కు విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్, కూకట్‌పల్లికి శ్రీరంగం సత్యం, వెంగళరావు, ఇబ్రహీంపట్నంకు మల్‌రెడ్డి రంగారెడ్డి, దండెం రాంరెడ్డి, ఎల్బీనగర్‌కి మధుయాష్కీ, మల్‌రెడ్డి రాంరెడ్డి, కుత్బుల్లాపూర్‌కు భూపతిరెడ్డి నర్సారెడ్డి, కొలన్ హాన్మంతురెడ్డి, తాండూరుకు కేఎల్‌ఆర్, రఘువీరారెడ్డి, సనత్‌నగర్‌కు కోట నీలిమ, మర్రి ఆదిత్యరెడ్డి, కంటోన్మెంట్‌కు బొల్లు కిషన్, పిడమర్తి రవి, మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి తోటకూర జంగయ్య (వజ్రేశ్)యాదవ్, హరివర్దన్ రెడ్డిల అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురి పేర్లు పరిశీలన..
ఈ నియోజకవర్గాల్లో ముగ్గురేసి అభ్యర్థిత్వాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి నందికంటి శ్రీధర్, అన్నె వెంకట సత్యనారాయణ, బి.సురేశ్ యాదవ్, ఉప్పల్‌కు రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, మలక్‌పేట్ చెకొలేకర్ శ్రీనివాస్, అశ్వక్ ఖాన్, శ్రీరాంరెడ్డి, శేరిలింగంపల్లికి జెరిపేటి జైపాల్, రఘునాథ్ యాదవ్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, చేవెళ్లకు షాబాద్ దర్శన్, భీంభరత్, రాచమల్లు సిద్దేశ్వర్ ఉన్నారు.
రాజేంద్రనగర్‌కు ఎం.వేణుకుమార్, గౌరి సతీష్, నరేందర్ మందిరాజ్, ఖైరతాబాద్‌కు రోహిణ్‌రెడ్డి, విజయారెడ్డి, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, ముషీరాబాద్‌కు అంజన్‌కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, అంబర్ పేట్‌కు లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్ గౌడ్, మోతా రోహిత్, సికింద్రాబాద్‌కు ఆదం సంతోష్, నోముల ప్రకాశ్ గౌడ్, నగలూరి నగేష్ అభ్యర్థిత్వాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీ నియోజకవర్గాలైన చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం సీట్ల కోసం పోటీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment