సాక్షి, సిటీబ్యూరో: ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా త్వరలో అమలు చేయబోతున్న గృహజ్యోతి పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తైంది. గ్రేటర్ జిల్లాల పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో 48,03,963 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులు 19.80 లక్షల మంది ఉన్నట్లు అంచనా.
వీరంతా ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. గృహ జ్యోతి పథకానికి ప్రభుత్వం రేషన్‌కార్డు/ ఆధార్‌కార్డు/ ఫోన్ నంబర్ల అనుసంధానం తప్పనిసరి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 17.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారుల్లో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో వీరు తమ కనెక్షన్లను ఉచిత పథకానికి అనుసంధానం చేసుకోలేక పోయారు.
ఫిబ్రవరి 15 వరకు 9,96,807 లక్షల కనెక్షన్లను మాత్రమే ఈ పథకానికి అనుసంధానించినట్లు తెలిసింది. మీటర్ రీడర్ల సమ్మె కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వివరాలు నమోదు చేయలేక పోయారు. అనుసంధానం ఇప్పటితో ఆగిపోలేదని, ఇది నిరంతర ప్రక్రియ అని.. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిస్కం అధికారులు చెప్పుతున్నారు.
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు తమ కరెంట్ బిల్లుతో పాటు ఆధార్, రేషన్ కార్డులను వెంట తీసుకెళ్లి.. సమీపంలోని ఈఆర్‌ఓ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నా రు.
కాగా.. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఇంటి యజమానుల నుంచి అభ్యంతరాలు తప్పడం లేదు. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావించి కొంత మంది యజమానులు తమ ఇంట్లోని విద్యుత్ మీటర్లపై అద్దెదారుల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను అప్‌డేట్ చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment