సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్‌ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు.
ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్‌ఎస్‌లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
మల్కాజిగిరి
నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్‌ఎస్‌లో చర్చ సాగుతోంది.
బీఆర్‌ఎస్‌లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది.
మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు.
మేడ్చల్
సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్‌కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఉప్పల్
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్‌ఎస్‌కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది.
అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది.
కూకట్‌పల్లి
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్‌పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు.
కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
కుత్బుల్లాపూర్
సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్‌ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment