‘‘ఉరి తీసేవాడ్ని కూడా ఆఖరి కోరిక అడుగుతరు. ఒక బలి ఇచ్చేటప్పుడు కూడా నోట్లో నీళ్లు పోస్తరు. అంతకన్నా దారుణంగా నన్ను ట్రీట్ చేసిండ్రు. టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. ఎమ్మెల్యే అయినాక ఆస్తులు అమ్ముకున్నా. పార్టీతో.. ఎమ్మెల్యే పదవితో లాభం పొందింది లేదు. పార్టీలో దందాలు, గుండాయిజాలు చేసినోళ్లు ఉన్నారు. నిజాయితీగా ఉన్న నాలాంటోడికేమో అన్యాయం జరుగుతోంది. టికెట్ రాకపోవడానికి.. నేనూ వాళ్లలా ఏదైనా తప్పు చేసి ఉండాలా?
:::ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అయిన తనకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంపై వారం తర్వాత మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. మంగళవారం తన కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్‌లో ఉన్న ఒకేఒక్క ఉద్యమకారుడ్ని నేను. అలాంటిది నగరంలోని నా ఒక్క సీటే తొలగించడం బాధగా అనిపిస్తోంది. 2001 నుంచి పార్టీలో ఉన్నా. పద్మారావు గౌడ్ నా తర్వాత వచ్చి మంత్రి అయ్యారు. నేను మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ ఇలాగే ఉండిపోయా. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్‌లో పార్టీని కాపాడాను. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారు. నేను మాత్రం ఆస్తులు అమ్ముకున్నా. అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారు.
అసలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి)కి టికెట్ ఎలా ఇస్తారు? ఆయన ఏ జెండా మోశాడు?. కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకున్నోడికి టికెట్ ఎలా ఇస్తారు?. కాంగ్రెస్ నేత అయిన తన అన్న ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటోళ్లకు టికెట్ ఇస్తారా?. అసలు టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. నేనేం తప్పు చేశా. నన్నెందుకు బలి చేశారు?. టికెట్ ఇవ్వనుందుకు నిరసనగా నా కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేద్దామంది. మా క్యాడర్ ఆందోళన చేస్తామంది. నేనే వద్దాన్నా. పార్టీలో ఉన్నాం.. అలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పా.
వారం రోజులైనా ఇప్పటికీ నన్ను పిలిచి మాట్లాడలేదు. కనీసం ఏ నేత ద్వారా సంప్రదింపులు జరపలేదు. ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానం అందలేదు. మరో వారం వేచిచూసి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం ప్రకటిస్తా. పార్టీని నమ్ముకుని.. ఇంత మంది భవిష్యత్తును నమ్ముకుని పని చేశా అని సుభాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment