Bethi Subhas Reddy
-
గ్రేటర్లో బీఆర్ఎస్కు మరో నేత రాజీనామా
మేడ్చల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పలువరు కీలక నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు కే. కేశవరావు, పట్నం మహేందర్‌రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలపటం గమనార్హం. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
కాంగ్రెసోళ్ల ఫొటో పెట్టుకునోడికి బీఆర్ఎస్ టికెట్టా?
‘‘ఉరి తీసేవాడ్ని కూడా ఆఖరి కోరిక అడుగుతరు. ఒక బలి ఇచ్చేటప్పుడు కూడా నోట్లో నీళ్లు పోస్తరు. అంతకన్నా దారుణంగా నన్ను ట్రీట్ చేసిండ్రు. టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. ఎమ్మెల్యే అయినాక ఆస్తులు అమ్ముకున్నా. పార్టీతో.. ఎమ్మెల్యే పదవితో లాభం పొందింది లేదు. పార్టీలో దందాలు, గుండాయిజాలు చేసినోళ్లు ఉన్నారు. నిజాయితీగా ఉన్న నాలాంటోడికేమో అన్యాయం జరుగుతోంది. టికెట్ రాకపోవడానికి.. నేనూ వాళ్లలా ఏదైనా తప్పు చేసి ఉండాలా? :::ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తనకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంపై వారం తర్వాత మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. మంగళవారం తన కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్లో ఉన్న ఒకేఒక్క ఉద్యమకారుడ్ని నేను. అలాంటిది నగరంలోని నా ఒక్క సీటే తొలగించడం బాధగా అనిపిస్తోంది. 2001 నుంచి పార్టీలో ఉన్నా. పద్మారావు గౌడ్ నా తర్వాత వచ్చి మంత్రి అయ్యారు. నేను మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ ఇలాగే ఉండిపోయా. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్‌లో పార్టీని కాపాడాను. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారు. నేను మాత్రం ఆస్తులు అమ్ముకున్నా. అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారు. అసలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి)కి టికెట్ ఎలా ఇస్తారు? ఆయన ఏ జెండా మోశాడు?. కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకున్నోడికి టికెట్ ఎలా ఇస్తారు?. కాంగ్రెస్ నేత అయిన తన అన్న ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటోళ్లకు టికెట్ ఇస్తారా?. అసలు టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. నేనేం తప్పు చేశా. నన్నెందుకు బలి చేశారు?. టికెట్ ఇవ్వనుందుకు నిరసనగా నా కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేద్దామంది. మా క్యాడర్ ఆందోళన చేస్తామంది. నేనే వద్దాన్నా. పార్టీలో ఉన్నాం.. అలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పా. వారం రోజులైనా ఇప్పటికీ నన్ను పిలిచి మాట్లాడలేదు. కనీసం ఏ నేత ద్వారా సంప్రదింపులు జరపలేదు. ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానం అందలేదు. మరో వారం వేచిచూసి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం ప్రకటిస్తా. పార్టీని నమ్ముకుని.. ఇంత మంది భవిష్యత్తును నమ్ముకుని పని చేశా అని సుభాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉప్పల్ నుంచి నేనే పోటీలో ఉంటా
హైదరాబాద్: ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.. ఉప్పల్ నుంచి తిరిగి నేనే పోటీలో ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీ కోసం.. మీ ఎమ్మెల్యే పాదయాత్ర బుధవారం 27వ రోజు డాక్టర్ ఏఎస్‌రావునగర్ డివిజన్లో కొనసాగింది. డివిజన్ పరిధిలోని కమలానగర్, మహేశ్‌నగర్, పంచవటికాలనీ, శ్రీనివాసనగర్, అరూల్కాలనీ, ఏఎస్‌రావునగర్, అణుపురం కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. మూడు రోజుల పాటుగా సాగిన పాదయాత్రలో గుర్తించిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం అణుపురం కమ్యూనిటీహాల్లో విలేకరులతో మాట్లాడుతూ తిరిగి ఉప్పల్ నుంచి తానే బరిలో ఉండబోయేదని, అందులో సందేహం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షాలకు పిచ్చెక్కిపోతోందన్నారు. దిక్కుతోచని స్థితిలో రెండు లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్లు వంటి హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ ఆ పథకాలన్నీ ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న వాస్తవాలను ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఉప్పల్‌లో కారిడార్ నిర్మాణం చేయకుండా చేతులెత్తేసిన పార్టీ నాయకులే పనులు నిలిచిపోయాయంటూ ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. జమ్మిగడ్డ శ్మశానవాటికకు సంబంధించి స్థల యజమానులతో మాట్లాడమని త్వరలోనే ఆ సమస్య కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీరెడ్డి, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, సుడుగు మహేందర్‌రెడ్డి, డప్పు గిరిబాబు, బోదాసు రవి, మురళిపంతులు, సీతారాంరెడ్డి, మల్కా రమాదేవి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు?
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలో గ్రూపులు బయల్దేరుతున్నాయి. టిక్కెట్లు ఆశించేవారు గళం విప్పుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడంలేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాలవారీగా విడిపోతున్నారు. గ్రేటర్‌లోని ఓ నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూపుల గురించి చూద్దాం. గులాబీ ముళ్లు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. (చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత) రాజకీయాల మధ్య కులం ఉప్పల్ లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్ గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావిడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో... కార్పొరేటర్, మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్ గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్ళుగా భరిస్తున్నానని ఇంక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్తా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. (చదవండి: ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?) సిట్టింగ్ హామీ ఏమవుతుంది? కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. సిటింగ్‌లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిటింగ్‌లను కాదని వేరేవారికి టిక్కెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఏమో తనకూ బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి.. బండారి లక్ష్మారెడ్డి ఒక్కటయ్యారని.. బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com