సాక్షి,హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. మాజీలు అయ్యేవరకు నిద్రపోమని మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతాం. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. 2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభం అయ్యింది. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్ళు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారు. అలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా రానున్న రోజుల్లో మనదే అధికారం’’ అంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
మహిపాల్‌ను తల్లిలా అక్కున చేర్చుకుని
పార్టీ మారిన మహిపాల్ రెడ్డిపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డిని బీఆర్‌ఎస్ తల్లిలా అక్కున చేర్చుకుంది.మూడు సార్లు ఎమ్మెల్యేని చేసింది. బీఆర్‌ఎస్ ఏం తక్కువ చేసిందని పార్టీ మారారు..? ఫిరాయింపులకు పాల్పడేందుకు ఆయనకి మనసు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. గూడెం (గూడెం మహిపాల్ రెడ్డి) పోయినా గుండె ధైర్యం కోల్పోవద్దని అన్నారు హరీష్ రావు.
రుణమాఫీకి
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారు. ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రుణమాఫీలో కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డ్ ఆధారంగా రుణమాఫీ చేస్తాం అని జీవోలో ఉంది..నోటితో మాత్రం రేషన్ కార్డుతో సంబంధం లేదని అంటున్నారు. నోటితో వచ్చిన మాటని జీవోలో పెట్టినప్పుడే మేం నమ్ముతామని పునరుద్ఘాటించారు. పీఎం కిసాన్ నిబంధనలు ఎందుకు..? రేషన్ కార్డు నిబంధనలు ఎందుకు..? అని అడిగారు.
అధికారంలో వచ్చేది బీఆర్ఏస్సే
కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఐదేళ్లకు మించి అధికారంలో లేదు. ఆరునూరైనా మళ్ళీ అధికారంలో వచ్చేది బీఆర్ఏస్సే. కొద్దీ రోజులైతే కాంగ్రెస్ వాళ్లు గ్రామాల్లో తిరగని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో బస్సు తప్ప అన్ని తుస్సేనని హరీష్ రావు ఎద్దేశా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment