సీఎం రేవంత్ అజ్ఞానంతో దేశం ముందు రాష్ట్రం నవ్వులపాలు
మూసీ ప్రక్షాళన పేరిట మూటలు వెనకేసుకునే ప్రయత్నాలు
పెరిగిపోయిన రాజకీయ కక్ష సాధింపు చర్యలు
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు.. కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చిదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా పరపీడన పరాయణత్వంలా మారిందని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతామని అధికారంలోకి వచ్చి.. ఏడాదిలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధకాండను రేవంత్ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనపై ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ తరఫున హరీశ్‌రావు చార్జిషీట్ విడుదల చేశారు. త్వరలో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలపై మరో చార్జిïÙట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ‘సీఎం సొంత ఊరికి ఎవరైనా వెళ్లాలంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అనుమతి తీసువాల్సిన పరిస్థితి. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు’అని మండిపడ్డారు.
శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు..
‘రేవంత్ పాలన ప్రతికూల దృక్పథంతో ప్రారంభం కావడంతో ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేసి రాష్ట్రం దివాలా తీసిందనే నెగెటివ్ ఇమేజ్ సృష్టించారు. రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ప్రభుత్వ ౖశాఖల మధ్య సమన్వయం లేదు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెచ్చుమీరాయి.
కృష్ణా నది ప్రాజెక్టులపై పదేండ్లు కేసీఆర్ కాపాడిన హక్కులను.. అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే కేంద్రానికి కట్టబెట్టారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. రైతు సంక్షేమానికి రాహుకాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టింది. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల్లో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. హైడ్రా రూపంలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారు. మూసీ ప్రక్షాళన పేరిట మూటలు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిక్క విధానం, తిట్ల పురాణం అవలంబిస్తున్న సీఎంకు దుర్భాష దురంధరుడు అనే బిరుదు ఇవ్వవచ్చు’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment