సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని ఇకపై కటకటాల్లోకి నెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అవకతవకలు చోటుచేసుకుం టున్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ప్రభుత్వాదేశాలతో ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబి తాను ఆయా శాఖల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దరఖాస్తుదారులను, విడుదలైన నిధుల చిట్టాపద్దులను పరిశీలించగా భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దళారులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను కొల్లగొట్టినట్లు ఏసీబీ విచారణలో బయటపడుతోంది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 కేసులు నమోదు చేసింది. మరో 20 కేసులు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది.