కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని దుబ్బాక మండలం
డయల్ యువర్ జేసీలో ఫిర్యాదు
సంగారెడ్డి క్రైం : కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దళితుడు నవీన్‌కుమార్ వాపోయారు. డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో డీఎస్‌ఓ కార్యాలయ డిప్యూటీ తహశీల్దార్ బాల్‌రాజ్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన నసీర్ మాట్లాడుతూ సదాశివపేటలోని షాపు నంబర్ 6,14 రేషన్ దుకాణాల్లో డీలర్లు సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వినియోగదారులకు సకాలంలో సరుకులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హత్నూర మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నం. 33లోని ఆరు ఎకరాల 9 గుంటల భూమిలో సర్వే చేయాలన్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్‌కు చెందిన కుమార్ మాట్లాడుతూ గ్రామంలో మద్యం బెల్టు షాప్ నిర్వహిస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన గంగాధర్‌రావు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నం. 649/1లోని భూమిని సర్వే చేయాలని కోరారు.
నారాయణఖేడ్‌కు చెందిన ఎండీ మినాజొద్దీన్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నప్పటికీ ఇప్పటివరకు బిల్లు మంజూరు కాలేదన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌కు చెందిన నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని అసైన్‌మెంట్ భూమిని సర్వే చేయాలన్నారు. తూప్రాన్ మండలం మనోహరాబాద్‌కు చెందిన బాబురావు మాట్లాడుతూ గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు హద్దులను నిర్దేశించాలని కోరారు.