బీసీలకూ కల్యాణలక్ష్మి
అచ్చంపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని ఏప్రిల్ నుంచి బీసీలకూ వర్తింపజేయనున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఇందిరానగర్, పదో వార్డులో మంత్రి ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి ఉండే మనిషని, అచ్చంపేటకు ఎమ్మెల్యే బాలరాజు కృషి వల్లే వెయ్యి ఇళ్లు అదనంగా మంజూరయ్యాయని తెలిపారు. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం అందజేస్తామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచే కేజీ టూ పీజీ విద్యను ప్రారంభిస్తామన్నారు. అర్హులైన మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. ప్రచారంలో జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు నర్సింహగౌడ్, ఉస్సేన్, గణేష్, మాధవి, మల్లేశ్వరీ, శివ పాల్గొన్నారు.