పేదలందరికీ కల్యాణలక్ష్మి
వరంగల్ జిల్లా బహిరంగసభలో సీఎం కేసీఆర్
♦ మార్చి నుంచి తెల్లకార్డుదారులందరికీ కల్యాణలక్ష్మి వర్తింపు
♦ కాంట్రాక్టు జూనియర్ లైన్‌మన్‌లను రెగ్యులరైజ్ చేస్తాం
♦ విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతాం
♦ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తాం
♦ ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయి
♦ వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పినా మారడం లేదు
♦ హైదరాబాద్‌లోనూ అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
♦ కేటీపీపీ రెండో దశ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని, వచ్చే మార్చి నుంచి దీనిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. కులాలతో సంబంధం లేకుండా తెల్లకార్డు ఉన్న అందరికీ వచ్చే మార్చి నుంచి ఈ పథకం వర్తిస్తుందని, వివాహానికి ముందే ఈ సహాయం సొమ్మును అందిస్తామని చెప్పారు. కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ లైన్‌మెన్ (సీజేఎల్‌ఎం)గా పనిచేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు.
వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన రెండోదశ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ మంగళవారం జాతికి అంకితం చేశారు. అనంతరం కేటీపీపీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగం సీఎం కేసీఆర్ మాటల్లోనే.. ‘‘సమైక్య రాష్ట్రంలో ఒకాయన ఉండె. ముఖ్యమంత్రిగా చాన చెప్తుండే. తెలంగాణ వస్తే చిమ్మ చీకటైపోతది, అంధకారమైతదని మాట్లాడిండు. తెలంగాణ వస్తే ఈ రోజు ఏమైందో, ఇతర రాష్ట్రాల కంటే మనం ఎంత ముందున్నమో తెలుస్తోంది. విద్యుత్ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నరు. రైతులకు వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూటనే తొమ్మిది గంటల కరెంటు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల సందర్భంలనే చెప్పిన. 2018 నుంచి త్రీఫేజ్ గానీ, సింగిల్‌ఫేజ్ గానీ రెప్పపాటు కూడా పోకుండా 24 గంటల పాటు కరెంటు వస్తది.
ప్రాజెక్టుల కల సాకారమవుతోంది..
సమైక్య రాష్ట్ర పాలకులు ఎన్ని ప్రాజెక్టులు తలపెట్టినా.. మనకు నీళ్లు వచ్చేటట్టు కట్టలే. ఇదే జిల్లా (వరంగల్) నుంచి ఓ పుణ్యాత్ముడు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండె.. దేవాదుల ప్రాజెక్టుకు 170 రోజులు నీళ్లు తోడుకోవాలి.. కానీ ఇప్పుడు 60, 70 రోజులు కూడా తోడుకునే పరిస్థితి లేదు. ప్రాజెక్టు కట్టిండ్రుగాని బ్యారేజీని వదిలిపెట్టిండ్రు. ఈ రోజు మనం బ్యారేజీ కట్టుకోబోతున్నం. దేవాదుల మూడో దశ రామప్ప వరకు పూర్తయింది. రూపాయి ఖర్చు లేకుండా గణపురం, లక్నవరం చెరువులను నింపే అవకాశముంది. కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి ఐదారు జిల్లాలకు నీరు తీసువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినం. ఈసారి నుంచి ఏటా రూ.25 వేల కోట్లు ఇరిగేషన్ కోసం కేటాయిస్తున్నం. దేవాదుల పూర్తయితే భీంఘన్‌పూర్, రామప్ప, లక్నవరం చెరువులు 365 రోజులు నిండే ఉంటయి. తెలివిగల రైతులు మూడు పంటలు పండించేందుకు అవకాశం ఉంది..
పేదలను ఆదుకుంటం..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైనా.. బీసీ వర్గాలకు కూడా కావాలని కోరుతున్నరు. బీసీ, ఓసీ కాదు.. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మార్చి నెల నుంచి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తమని హామీ ఇస్తున్న. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద అందే డబ్బులు పెళ్లికి ముందే అందిస్తాం. పెళ్లి చేసే ఆడపిల్ల తల్లికి ఈ డబ్బులు అందేవిధంగా అధికారులు చూడాలె. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలె. పేదల సంక్షేమంలో నంబర్ వన్‌గా ముందుకు పోతున్నాం. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులను కూడా బానిసలుగా చూసిండ్రు. వారి శ్రమ దోపిడీ చేసిండ్రు. కాంట్రాక్టు ఉద్యోగులను రాచిరంపాన పెట్టారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బాధలను పట్టించుకోలేదు. ఇప్పుడు మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కాబట్టి... కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేలా ఆదేశాలు ఇచ్చింది. ఔట్‌సోర్సింగ్ వాళ్ల కడుపు నింపేం దుకు దాదాపు రెండు రెట్లు వేతనాలు పెంచి నం. కరెంటు శాఖలో ఉన్న సీజేఎల్‌ఎం (కాం ట్రాక్టు జూనియర్ లైన్‌మెన్)లు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నరు. రేపటి నుంచి వారం తా రెగ్యులర్ జూనియర్ లైన్‌మెన్‌లు అవుతరు. విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ శాఖ అధికారులు, మంత్రితో మాట్లాడి దీనిపై త్వరలోనే తీపి వార్త చెబుతాం..
బంగారు తెలంగాణ సాధిస్తం..
అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ, అన్ని వర్గాలను ఆదరిస్తూ ముందుకు పోతున్నం. దసరా, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాం. ముస్లిం సోదరులు రంజాన్ జరుపుకొంటే చరిత్రలో లేనివిధంగా లక్షల మందికి వస్త్రాలు పంచినం. క్రిస్‌మస్ పండుగకు లక్షల మంది పేద క్రిస్టియన్లకు వస్త్రాలు పంపిణీ చేసినం. ప్రజలందరూ సుఖసంతోషాలతో బతకాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. రాబోయే రోజుల్లో దళిత, మైనారిటీ విద్యార్థుల కోసం దాదాపు 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించబోతున్నం. ప్రజల దీవెనలతో బంగారు తెలంగాణను వంద శాతం సాధిస్తామని తెలియజేస్తున్నా..
ప్రతిపక్షాలను చూస్తే జాలివేస్తోంది..
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉండలె, వాటి మధ్య పోటీ ఉండాలె. కానీ ఇవాళ ప్రతిపక్షాలనేటి కొన్ని పార్టీలు ఉన్నయి. వారిని చూస్తే జాలి కలుగుతున్నది. మొన్ననే మీరిక్కడ వారికి బుద్ధి చెప్పి పంపిండ్రు. కానీ వాళ్లు హైదరాబాద్‌లో మళ్లా అదే మాదిరిగా, ఇక్కడ మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నరు. అన్నీ వ్యక్తిగత నిందలు, విమర్శలే తప్ప.. ఒక్క నిర్మాణాత్మక, గుణాత్మక సూచనగానీ, ప్రకటనగానీ చేసే సంస్కారం లేదు. నేను చేస్తున్నది తప్పయితే శిక్షించండి అని వరంగల్ బహిరంగ సభలోనే చెప్పిన. లేకపోతే అవాకులు చెవాకులు పేలేటోళ్లను శిక్షించాలని చెప్పినం. మాకు ప్రజలే దేవుళ్లు. మీ దీవెనలు, సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహోరాత్రులు కష్టపడ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న...’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు
వరంగల్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆనాడు ఉద్యమంలో, ఈనాడు ఉప ఎన్నికల్లో మీరు ఇచ్చిన ప్రేమ గొప్పది. ఈ జన్మలో ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. ఎందరో ఎన్నో అవాకులు చవాకులు పేలారు. ఎన్నో మాట్లాడారు. కానీ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతోంది. ఇంకా బాగా పనిచేయండని చెప్పి వరంగల్ ఉప ఎన్నికల్లో మంచి తీర్పు ఇచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా..’’ అన్నారు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
స్పీకర్ గింత హుషారనుకోలే!
భూపాలపల్లి నియోజకవర్గం అభివృ ద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి పలు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు సభలో తెలిపారు. దీనిని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ... ‘‘మధుసూదనాచారి హుషారేనని తెలుసుగానీ ఇంత హుషారని తెల్వది. ఒక ఊర్లో ఒక ఇంటికి ఆదుర్దా సుట్టమచ్చిండట. జరసేపుండి ఇగ పోతాపోతా అంటుంటే.. ఆ ఇంట్ల ఉన్న పెద్ద మనిషి.. ‘దూరం పోవాలె గదా బిడ్డా.. ఇంట్లో సల్లన్నం ఉన్నది తిని పో’ అన్నది. దానికా సుట్టం ‘ఎందుకవ్వా సల్లన్నం పెట్టు తింట, ఉడుకన్నమయ్యేదాక కూడ ఉంట’ అన్నడు. అట్లనే మధుసూదనాచారి.. పోయినసారి వచ్చినప్పుడు బాగనే ఇచ్చినవ్‌గానీ ఇప్పటి సంగతేంది చెప్పాలని అంటున్నడు. లేకపోతే ఇక్కడే కట్టెస్తం అంటున్నడు. ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా డెవలప్‌మెంట్ కావాల్సిందే. బాగుపడాల్సిందే. బాగుపడి తీరుతది కూడా. అది చేసి చూపిస్తా..’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.