వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవీందర్‌రెడ్డి
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్‌లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్‌కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్‌ఐ సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment