కల్యాణ లక్ష్మీ పధకం ద్వారా డబ్బులు వస్తాయనే ఆశతో నకిలీ పెళ్లి కార్డులు సృష్టించి కటకటాలు పాలయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన జగదేవ్‌పూర్ మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. వివరాలు..ధర్మారం గ్రామానికి చెందిన క్రి ష్ణయ్య కూతురు భవానీకి ఇదే సంవత్సరం మార్చి 16న నల్గొండ జిల్లాకు చెందిన రాము అనే వ్యక్తితో పెళ్లి అయింది.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం బీసీలకు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత జరిగే వివాహాలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తిస్తుంది. దీంతో ఏమి చేయాలో తోచక..ఏప్రిల్ 27న కూతురి వివాహం జరిగినట్లు నకిలీ పెళ్లి కార్డు సృష్టించి ఆన్‌లైన్‌లో అఫ్లై చేశాడు. స్థానిక తహశీల్దార్‌కు అనుమానం వచ్చి గ్రామంలో విచారణ జరపగా మార్చి 16న పెళ్లయినట్లు తేలింది. ఈ విషయం తహశీల్దార్ పోలీసులకు తెలిపారు. పోలీసులు పెళ్లి కార్డు ప్రింటింగ్ చేసిన వేణుగోపాల్‌ను, వధువు తండ్రి క్రిష్టయ్యను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.