- ధువీకరణ పత్రాల పేరిట మెలిక
- మొదటి పెళ్లి అని గజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సిందే..
- ఏ ఒక్క ఎస్సీ లబ్ధిదారు ఖాతాలోనూ జమకాని ఆర్థికసాయం
- అభాసుపాలవుతున్న పథకం
ఆదిలాబాద్: ‘కల్యాణ లక్ష్మి’.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లికి ఆర్థిక చేయూతనందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం. కానీ జిల్లాలో బాలారిష్టాలు దాటడం లేదు. ధ్రువీకరణ పత్రాల పేరుతో కఠినతరమైన నిబంధనలు ఓ వైపు.. పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం మరోవైపు వెరసి పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. దీనికి తోడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడం.. ఈ దరఖాస్తుల పరిశీలనలో అధికారులు వారాల తరబడి జాప్యం చేస్తుండడంతో అన్ని పత్రాలు సమర్పించిన లబ్ధిదారులకు కూడా ఆర్థిక సహాయం అందడం గగనమవుతోంది. పెళ్లి చేసుకుంటున్న యువతికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది.
ధ్రువీకరణ పత్రాలు..
ఈ పథకం కింద లబ్ధిపొందే యువతులు వారికి జరిగేది ‘మొదటి పెళ్లి’ అంటూ ఎవరైనా గజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక వీఆర్‌ఓ కూడా ఆ యువతికి ‘గతంలో పెళ్లి కాలేదు..’ అని ధ్రువీకరించాలి. వీటితోపాటుగా వధూవరుల పుట్టిన తేదీ, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం గిరిజనులకు ఇబ్బందిగా మారింది. ఈ దరఖాస్తులను ఎస్టీ లబ్ధిదారులు ఏటీడబ్ల్యూవోలకు, ఎస్సీ లబ్ధిదారులు ఏఎస్‌డబ్ల్యూఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీలు మాత్రం సంబంధిత తహశీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన కూడా సదరు అధికారులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ ప్ర‘గతి’..
ఈ పథకం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఏ ఒక్క ఎస్సీ లబ్ధిదారురాలికి కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 157 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 66 మందికి అధికారులు ఆర్థిక సహాయం మంజూరు చేశారు. కానీ ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సహాయం జమ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఎస్టీ లబ్ధిదారుల్లో ఇద్దరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందింది. మొత్తం 45 మంది పెళ్లి చేసుకునే గిరిజన యువతులు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికి మాత్రమే ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకంపై గిరిజనుల్లో సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతుండడంతో అర్హులైన నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. షాదీముబారక్ పథకం అమలు తీరు గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 167 మంది లబ్ధిదారులు ‘షాదీముబారక్’కు దరఖాస్తు చేసుకోగా, అధికారులు 141 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.71.91 లక్షలు ఆర్థిక సహాయాన్ని జమ చేయగలిగారు.
మూలుగుతున్న రూ.ఐదు కోట్ల నిధులు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పథకాలకు కలిపి ఇప్పటివరకు జిల్లాకు రూ.ఐదు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖకు రూ.కోటి, మైనార్టీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. ఇందులో సుమారు రూ.నాలుగు కోట్లపైగా నిధులు ట్రెజరీల్లో మూలుగుతుండడం గమనార్హం.