funds sanctioned
-
Andhra Pradesh: రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాదీ కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో నిధులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాధించింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక ప్రణాళికలో రూ.12,130 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక ప్రణాళిక కింద ఆమోదించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల ప్రాజెక్టులను పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి చెందితేనే ఆ మేరకు ఆర్థిక సంవత్సరం ఆఖరులో నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో పూర్తి సంతృప్తి చెందినందున రికార్డు స్థాయిలో వార్షిక ప్రణాళిక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్ తరువాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం జగన్ ప్రణాళికకు కేంద్రం ఆమోదం రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో కార్యాచరణ చేపడుతున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తూ పట్టుబట్టి నిధులను సాధిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి రహదారుల అభివృద్ధే కీలకమన్న అంశంపై ఏకాభిప్రాయం రావడమే రాష్ట్రానికి మరింత సానుకూలంగా మారింది. 2019–20 వార్షిక ప్రణాళికలో తొలుత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.600 కోట్లే కేటాయించింది. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తేవడంతో 2019–20లో రాష్ట్రానికి నిధుల కేటాయింపును రూ.1,304.42 కోట్లకు పెంచారు. ఇక 2020–21 వార్షిక ప్రణాళికలో కేంద్రం రూ.2,476.50 కోట్లు మంజూరు చేయగా, 2021–22లో ఏకంగా రూ.7,561 కోట్లు మంజూరు చేసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు కేటాయించడం గమనార్హం. తాజాగా 2022–23 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి రూ.12,130 కోట్లు మంజూరు చేసింది. 541.45 కి.మీ. మేర 24 ప్రాజెక్టులు 2022–23కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళిక నిధులతో రాష్ట్ర ప్రభుత్వం 24 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.11,699.55 కోట్లతో ఇప్పటికే 513.72 కి.మీ. మేర 21 ప్రాజెక్టులను పూర్తి చేసింది. రూ.431.27 కోట్లతో 27.73 కి.మీ.మేర మూడు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరు భవిష్యత్‌లో నిధుల కేటాయింపుపై సానుకూల ప్రభావం చూపనుంది. 2023–24 వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి మరింత భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. నాడు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని కూడా.. నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు జాతీయ రహదారుల అభివృద్ధికి తగిన నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఐదేళ్లలో టీడీపీ సర్కారు కేవలం రూ.10,661 కోట్లే తేగలిగింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలోనే రూ.12,130 కోట్లు సాధించింది. మొత్తం నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.23,471.92 కోట్లు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక, తీర ప్రాంతాలు, ఎకనామిక్ జోన్లు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ రహదారుల అభివృద్ధి జోరందుకుంది. -
రైతు బంధుకు రూ.7 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.1,200 కోట్లు విడుదల చేయాలనే సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో 5.5 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. వీటితో పాటు మరో రూ.7 వేల కోట్లను రైతు బంధు కింద పెట్టుబడి సాయంగా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది’అని ఆయన వెల్లడించారు. -
పాలకుల్లారా.. ఇటు ‘కేసీ’ చూడండి
♦ ఉత్తుత్తి కాల్వలు కాదు..ఉన్న కాల్వలు కాపాడండి ♦ జిల్లాలో కేసీ కెనాల్‌కు 84 చోట్ల ప్రమాదకర పరిస్థితి ♦ అరకొరగా నిధులు - స్పందించని ప్రభుత్వం ♦ తలలు పట్టుకుంటున్న అధికారులు ♦ 39 చోట్ల పనులకు ప్రతిపాదనలు ♦ రూ.2 కోట్ల నిధులు మంజూరు ♦ మరో రూ.4.8 కోట్లు కావాలంటున్న అధికారులు కేసీకెనాల్.. జిల్లాకు వరప్రదాయిని.. రైతులకు ప్రాణప్రదమైన కాలువ. అలాంటి కాలువను ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్వహణకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిధులు కేటాయించక పోవడంతో కాల్వల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడే దెబ్బతింది. లైనింగ్ లేచిపోవడంతో పాటు చాలాచోట్ల కట్ట కూడా దెబ్బతింది. కాలువ పరిస్థితి చూసి రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం వస్తోంది.. వరుణుడు కరుణించి ప్రాజెక్టుల్లో నీరు చేరి కాలువకు నీళ్లు వదిలితే ఎక్కడ గండ్లు పడతాయోనని అన్నదాతల్లో కలవరం నెలకొంది. - చెన్నూరు చెన్నూరు : ఇరిగేషన్‌కు అధికప్రాధాన్యం ఇస్తున్నామంటూ ఆర్భాటం చేసే ప్రభుత్వ పెద్దలకు కేసీ (కర్నూలు-కడప కాలువ) కెనాల్ దుస్థితి కనిపిం చడం లేదు. నీరు-చెట్టు పథకం పేరుతో కోట్లు ఖర్చుపెట్టి ఉపయోగం లేని ఉత్తుత్తి కాల్వల పనులను చేపడుతున్న పాలకులు వేలాది ఎకరాలకు నీరిస్తున్న కేసీ కాల్వను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 10 మండలాల్లో 92వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో కేసీ కాల్వను ఆధునీకరించారు. చాగలమర్రి సమీపంలోని రాజోలి ఆనకట్ట వద్ద నుంచి పాత కడప చెరువు నానేపల్లె వరకు చేసిన కేసీ కాల్వ లైనింగ్ చేశారు. వాటితో పాటూ ఉపకాల్వలు చేశారు. 82 కిలోమీటర్ల మేర జరిగిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో కాల్వ లైనింగ్ దెబ్బతిని, కట్టలు కోతలకు గురైంది. ఎదురుచూస్తున్న రైతులు కేసీ కాల్వ ద్వారా వైఎస్సార్ జిల్లాలో 10 మండలాల్లో 92 వేల సాగునీరు అందించాల్సి ఉంది. రాజోలి ఆనకట్ట వద్ద నుంచి దువ్వూరు, రాజపాలెం, ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, వల్లూరు, చెన్నూరు, సీకెదిన్నె, కడప మండలాల్లో కేసీ కెనాల్ కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీరు అందకపోవడం, ఈ ఏడాదైనా కాల్వకు నీరొస్తే పంటలు సాగు చేసుకొనేందుకు రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చెన్నూరు మండల పరిధిలోని శివాలపల్లి, చిన్నమాసుపల్లి, గోపవరం, వల్లూరు మండలం పరిధిలోని ఆదినిమ్మాయపల్లిలో, ఖాజీపేట మండలంలో రెండుచోట్ల, మైదుకూరు మండలంలో ఆరుచోట్ల, మిగతా మండలాల్లోనూ భారీగా లైనిం గ్ దెబ్బతిన్నట్లు అధికారులే చెబుతున్నారు. వీటి లో ఐదారు చోట్ల పరిస్థితి దారుణంగా ఉందని, కాలువకు నీళ్లు వదిలితే గండ్లుపడే ప్రమాదం పొం చి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 97 చోట్ల దెబ్బతిన్న కాల్వ: 82కిలోమీటర్ల మేర జిల్లాలో కేసీకాల్వ ఉంది. దీంతో పాటూ మరో 264 కిలోమీటర్లపైగా లైనింగ్ ఉపకాల్వలు ఉన్నా యి. ఇటీవల 39చోట్ల అత్యవసరంగా పనులు చేయాలంటూ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపడంతో రూ.2కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ మొత్తం సరిపోదంటూ మరో రూ.4.8కోట్లు కావాలంటూ నీరు-చెట్టు కింద మంజూరుకు కేసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మైదుకూరు, పొద్దుటూరు నియోజకవర్గాల్లోని నీటిసంఘం ప్రతి నిధులు చురుగ్గా పనులు చేస్తు న్నా, కమలాపురం, కడపల్లోని కమిటీలు పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కాల్వలు, షెట్టర్లు, పలుచోట్ల లైనింగ్ దెబ్బతిన్నా యి. దీంతో కేసీకి నీరొచ్చినా చివరి ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4.8 కోట్లతో ప్రతిపాదనలు పంపాం నీటి పారుదల శాఖ నుంచి అత్యవసర పనుల కింద 39 పనులకు రూ.2 కోట్లు మంజూరైంది. మైదుకూరు డివిజన్లో నీటిసంఘం ప్రతి నిధులు పనులు చేస్తున్నారు. నీరు-చెట్టు కింద మరో రూ.4.8కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే వెంటనే పనులు చేయిస్తాం. -జిలానీబాష, డివిజనల్ ఇంజనీరు, కేసీ కెనాల్ అధ్వానంగా మారాయి కేసీ కాల్వల లైనింగ్ దెబ్బతిన్నాయి. కట్టలపై కంపచెట్లు పెరిగి పొలాల వద్దకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు, పాలకులకు ఎన్నిమార్లు చెప్పినా స్పందించడం లేదు. ఇలాగే ఉంటే కాల్వల మనుగడ కష్టంగా మారుతుంది. -ముండ్ల విశ్వనాథరెడ్డి, రామనపల్లె,చెన్నూరు మండలం నీరు రావడం చాలా కష్టంగా ఉంది కేసీ కాల్వ ద్వారా కొండపేట చెరువుకు నీరివ్వాలి. కాలువలు పూడిపోవడం, లైనింగ్ దెబ్బతినడం, పూడిక చేరడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు రావడం చాలాకష్టంగా మారింది. ప్రభుత్వం నీరు-చెట్టు ద్వారా అనవసరమైన వాటికి ఖర్చు చేస్తుంది. వేలాది ఎకరాలకు నీరిచ్చే కేసీ కాల్వను కాపాడాలి. -జి పుల్లారెడ్డి రైతు, కొండపేట, చెన్నూరు మండలం జిల్లాలో కేసీ కెనాల్ పరిధిలోని మండలాలు : 10 మొత్తం ఆయకట్టు : 92వేల ఎకరాలు మొత్తం దూరం : 82కిలోమీటర్లు ఉపకాల్వలు : 264కిలోమీటర్లు ఆయకట్టు రైతులు : 60వేల మంది కాల్వ దెబ్బతిన్న ప్రాంతాలు : 97 -
బడిని బాగు చేద్దాం
♦ విద్యాభివృద్ధికి పంచసూత్రాల ప్రణాళిక ♦ నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ఇవ్వండి ♦ వాటి ఆధారంగానే నిధులు మంజూరు చేస్తాం ♦ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు తప్పనిసరి ♦ సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విద్యపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. దీంతో ప్రభుత్వం సైతం ప్రాధాన్యత కేటగిరీగా విద్యను పరిగణించడం లేదు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఫలితంగా ప్రభుత్వ విద్య గాడితప్పుతోంది. ఇది చాలా దారుణం. విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ) నిధులను వినియోగించుకోవాలి. - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ సమావేశం నిర్వహించారు. మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ స్థాయిలో ‘ప్లాన్’ ఇకపై నియోజకవర్గస్థాయిలో విద్యాశాఖ కార్యక్రమాలపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. శాసన సభ్యుల అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు అధికారులంతా హాజరు కావాలన్నారు. ఈనెలాఖర్లోగా నియోజకవర్గస్థాయి సమావేశాలు తప్పకుండా నిర్వహించాలన్నారు. సమావేశాల్లో నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వసతులు, సౌకర్యాలు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. అక్కడ గుర్తించిన వాటితో ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి జిల్లా యంత్రాంగానికి అందించాలని స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక ఆధారంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, జాగ్రత్తగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఇందులో ఐదు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలన్నారు. టాయిలెట్లు, వాటర్, విద్యుత్, ప్రహరీలు, ఫర్నీచర్ అంశాలతో ప్రణాళిక తయారు చేయాలన్నారు. అదేవిధంగా అదనపు తరగతి గదులు, మరమ్మతులకు సంబంధించి ఎస్ఎస్ఏకు వివరించాలన్నారు. ఒక్కక్కరు రూ.కోటి ఇవ్వండి జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం.. మౌలిక వసతుల కల్పనకు రూ.245 కోట్లు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎంపీ తమ నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి కనిష్టంగా రూ.కోటి ఇవ్వాలని మంత్రి కోరగా.. ప్రజాప్రతినిధులు అందుకు మద్దతు పలికారు. ఈ నిధులను వారి నియోజకవర్గాల్లో గుర్తించిన పనులకే వెచ్చిస్తామన్నారు. ప్రజాప్రతినిధుల కోటా కింద రూ.25 కోట్లు, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ) మరో వంద కోట్లు సమకూరుస్తామన్నారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి నిధి కింద రూ.20 కోట్లు అందుబాటులో ఉన్నాయని.. వాటిని కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక కోటాలో నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో క్లీనర్, స్వీపర్, స్కావెంజర్‌ను ప్రత్యామ్నాయ పద్ధతిలో నియమించుకోవాలన్నారు. పాఠశాలను శుభ్రపర్చే బాధ్యత స్థానిక సంస్థలదేనని, ఈమేరకు గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వికారాబాద్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీని సీఎం మంజూరు చేశారన్నారు. పాఠశాలల్లో నెలకొన్న ప్రధాన సమస్యల్ని నియెజకవర్గాల వారీగా ఎంపీలు సీహెచ్ మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, ప్రభాకర్, ప్రకాష్‌గౌడ్, తీగల క్రిష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, గాంధీ, సంజీవరావు తదితరులు వివరించారు. వాటిని సానుకూలంగా విన్న మంత్రి సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ ప్రణాళికలో పొందుపర్చాలన్నారు. జేసీ ఆమ్రపాలి జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. -
'కల్యాణ లక్ష్మి'కి నిబంధనాలు
- ధువీకరణ పత్రాల పేరిట మెలిక - మొదటి పెళ్లి అని గజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సిందే.. - ఏ ఒక్క ఎస్సీ లబ్ధిదారు ఖాతాలోనూ జమకాని ఆర్థికసాయం - అభాసుపాలవుతున్న పథకం ఆదిలాబాద్: ‘కల్యాణ లక్ష్మి’.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లికి ఆర్థిక చేయూతనందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం. కానీ జిల్లాలో బాలారిష్టాలు దాటడం లేదు. ధ్రువీకరణ పత్రాల పేరుతో కఠినతరమైన నిబంధనలు ఓ వైపు.. పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం మరోవైపు వెరసి పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. దీనికి తోడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడం.. ఈ దరఖాస్తుల పరిశీలనలో అధికారులు వారాల తరబడి జాప్యం చేస్తుండడంతో అన్ని పత్రాలు సమర్పించిన లబ్ధిదారులకు కూడా ఆర్థిక సహాయం అందడం గగనమవుతోంది. పెళ్లి చేసుకుంటున్న యువతికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. ధ్రువీకరణ పత్రాలు.. ఈ పథకం కింద లబ్ధిపొందే యువతులు వారికి జరిగేది ‘మొదటి పెళ్లి’ అంటూ ఎవరైనా గజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక వీఆర్ఓ కూడా ఆ యువతికి ‘గతంలో పెళ్లి కాలేదు..’ అని ధ్రువీకరించాలి. వీటితోపాటుగా వధూవరుల పుట్టిన తేదీ, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం గిరిజనులకు ఇబ్బందిగా మారింది. ఈ దరఖాస్తులను ఎస్టీ లబ్ధిదారులు ఏటీడబ్ల్యూవోలకు, ఎస్సీ లబ్ధిదారులు ఏఎస్‌డబ్ల్యూఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీలు మాత్రం సంబంధిత తహశీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన కూడా సదరు అధికారులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదీ ప్ర‘గతి’.. ఈ పథకం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఏ ఒక్క ఎస్సీ లబ్ధిదారురాలికి కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 157 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 66 మందికి అధికారులు ఆర్థిక సహాయం మంజూరు చేశారు. కానీ ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సహాయం జమ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎస్టీ లబ్ధిదారుల్లో ఇద్దరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందింది. మొత్తం 45 మంది పెళ్లి చేసుకునే గిరిజన యువతులు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికి మాత్రమే ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకంపై గిరిజనుల్లో సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతుండడంతో అర్హులైన నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. షాదీముబారక్ పథకం అమలు తీరు గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 167 మంది లబ్ధిదారులు ‘షాదీముబారక్’కు దరఖాస్తు చేసుకోగా, అధికారులు 141 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.71.91 లక్షలు ఆర్థిక సహాయాన్ని జమ చేయగలిగారు. మూలుగుతున్న రూ.ఐదు కోట్ల నిధులు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పథకాలకు కలిపి ఇప్పటివరకు జిల్లాకు రూ.ఐదు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖకు రూ.కోటి, మైనార్టీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. ఇందులో సుమారు రూ.నాలుగు కోట్లపైగా నిధులు ట్రెజరీల్లో మూలుగుతుండడం గమనార్హం.