పాలకుల్లారా.. ఇటు ‘కేసీ’ చూడండి | negligence on kc canal | Sakshi
Sakshi News home page

పాలకుల్లారా.. ఇటు ‘కేసీ’ చూడండి

Published Fri, Jun 3 2016 3:55 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

పాలకుల్లారా.. ఇటు ‘కేసీ’ చూడండి - Sakshi

పాలకుల్లారా.. ఇటు ‘కేసీ’ చూడండి

ఉత్తుత్తి కాల్వలు కాదు..ఉన్న కాల్వలు కాపాడండి
జిల్లాలో కేసీ కెనాల్‌కు 84 చోట్ల ప్రమాదకర పరిస్థితి
అరకొరగా నిధులు  - స్పందించని ప్రభుత్వం
తలలు పట్టుకుంటున్న అధికారులు
39 చోట్ల పనులకు ప్రతిపాదనలు
రూ.2 కోట్ల నిధులు మంజూరు
మరో రూ.4.8 కోట్లు కావాలంటున్న అధికారులు

కేసీకెనాల్.. జిల్లాకు వరప్రదాయిని.. రైతులకు ప్రాణప్రదమైన కాలువ. అలాంటి కాలువను ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్వహణకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిధులు కేటాయించక పోవడంతో కాల్వల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడే దెబ్బతింది. లైనింగ్ లేచిపోవడంతో పాటు చాలాచోట్ల కట్ట కూడా దెబ్బతింది. కాలువ పరిస్థితి చూసి రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం వస్తోంది.. వరుణుడు కరుణించి ప్రాజెక్టుల్లో నీరు చేరి కాలువకు నీళ్లు వదిలితే ఎక్కడ గండ్లు పడతాయోనని అన్నదాతల్లో కలవరం నెలకొంది. - చెన్నూరు

చెన్నూరు : ఇరిగేషన్‌కు అధికప్రాధాన్యం ఇస్తున్నామంటూ ఆర్భాటం చేసే ప్రభుత్వ పెద్దలకు కేసీ (కర్నూలు-కడప కాలువ) కెనాల్ దుస్థితి కనిపిం చడం లేదు. నీరు-చెట్టు పథకం పేరుతో కోట్లు ఖర్చుపెట్టి ఉపయోగం లేని ఉత్తుత్తి కాల్వల పనులను చేపడుతున్న పాలకులు వేలాది ఎకరాలకు నీరిస్తున్న కేసీ కాల్వను మాత్రం పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 10 మండలాల్లో 92వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గతంలో కేసీ కాల్వను ఆధునీకరించారు. చాగలమర్రి సమీపంలోని రాజోలి ఆనకట్ట వద్ద నుంచి పాత కడప చెరువు నానేపల్లె వరకు చేసిన కేసీ కాల్వ లైనింగ్ చేశారు. వాటితో పాటూ ఉపకాల్వలు చేశారు. 82 కిలోమీటర్ల మేర జరిగిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో కాల్వ లైనింగ్ దెబ్బతిని, కట్టలు కోతలకు గురైంది.

 ఎదురుచూస్తున్న రైతులు
కేసీ కాల్వ ద్వారా వైఎస్సార్ జిల్లాలో 10 మండలాల్లో 92 వేల సాగునీరు అందించాల్సి ఉంది. రాజోలి ఆనకట్ట వద్ద నుంచి దువ్వూరు, రాజపాలెం, ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, వల్లూరు, చెన్నూరు, సీకెదిన్నె, కడప మండలాల్లో కేసీ కెనాల్ కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీరు అందకపోవడం, ఈ ఏడాదైనా కాల్వకు నీరొస్తే పంటలు సాగు చేసుకొనేందుకు రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చెన్నూరు మండల పరిధిలోని శివాలపల్లి, చిన్నమాసుపల్లి, గోపవరం, వల్లూరు మండలం పరిధిలోని ఆదినిమ్మాయపల్లిలో, ఖాజీపేట మండలంలో రెండుచోట్ల, మైదుకూరు మండలంలో ఆరుచోట్ల, మిగతా మండలాల్లోనూ భారీగా లైనిం గ్ దెబ్బతిన్నట్లు అధికారులే చెబుతున్నారు. వీటి లో ఐదారు చోట్ల పరిస్థితి దారుణంగా ఉందని, కాలువకు నీళ్లు వదిలితే గండ్లుపడే ప్రమాదం పొం చి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 97 చోట్ల దెబ్బతిన్న కాల్వ: 82కిలోమీటర్ల మేర జిల్లాలో కేసీకాల్వ ఉంది. దీంతో పాటూ మరో 264 కిలోమీటర్లపైగా లైనింగ్ ఉపకాల్వలు ఉన్నా యి. ఇటీవల 39చోట్ల అత్యవసరంగా పనులు చేయాలంటూ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపడంతో రూ.2కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ మొత్తం సరిపోదంటూ మరో రూ.4.8కోట్లు కావాలంటూ నీరు-చెట్టు కింద మంజూరుకు కేసీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మైదుకూరు, పొద్దుటూరు నియోజకవర్గాల్లోని నీటిసంఘం ప్రతి నిధులు చురుగ్గా పనులు చేస్తు న్నా, కమలాపురం, కడపల్లోని కమిటీలు పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కాల్వలు, షెట్టర్లు, పలుచోట్ల లైనింగ్ దెబ్బతిన్నా యి. దీంతో కేసీకి నీరొచ్చినా చివరి ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

4.8 కోట్లతో ప్రతిపాదనలు పంపాం
నీటి పారుదల శాఖ నుంచి అత్యవసర పనుల కింద 39 పనులకు రూ.2 కోట్లు మంజూరైంది. మైదుకూరు డివిజన్‌లో నీటిసంఘం ప్రతి నిధులు పనులు చేస్తున్నారు. నీరు-చెట్టు కింద మరో రూ.4.8కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే వెంటనే పనులు చేయిస్తాం.
-జిలానీబాష, డివిజనల్ ఇంజనీరు, కేసీ కెనాల్

 అధ్వానంగా మారాయి
కేసీ కాల్వల లైనింగ్ దెబ్బతిన్నాయి. కట్టలపై కంపచెట్లు పెరిగి పొలాల వద్దకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు, పాలకులకు ఎన్నిమార్లు చెప్పినా స్పందించడం లేదు. ఇలాగే ఉంటే కాల్వల మనుగడ కష్టంగా మారుతుంది.
-ముండ్ల విశ్వనాథరెడ్డి, రామనపల్లె,చెన్నూరు మండలం

 నీరు రావడం చాలా కష్టంగా ఉంది
కేసీ కాల్వ ద్వారా కొండపేట చెరువుకు నీరివ్వాలి. కాలువలు పూడిపోవడం, లైనింగ్ దెబ్బతినడం, పూడిక చేరడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు రావడం చాలాకష్టంగా మారింది. ప్రభుత్వం నీరు-చెట్టు ద్వారా అనవసరమైన వాటికి ఖర్చు చేస్తుంది. వేలాది ఎకరాలకు నీరిచ్చే కేసీ కాల్వను కాపాడాలి.  -జి పుల్లారెడ్డి రైతు, కొండపేట, చెన్నూరు మండలం

జిల్లాలో కేసీ కెనాల్ పరిధిలోని మండలాలు : 10
మొత్తం ఆయకట్టు :  92వేల ఎకరాలు
మొత్తం దూరం :   82కిలోమీటర్లు
ఉపకాల్వలు : 264కిలోమీటర్లు
ఆయకట్టు రైతులు : 60వేల మంది
కాల్వ దెబ్బతిన్న ప్రాంతాలు : 97

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement