బడిని బాగు చేద్దాం | funds sanctioned for educational devolopment | Sakshi
Sakshi News home page

బడిని బాగు చేద్దాం

Published Wed, May 18 2016 3:26 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

బడిని బాగు చేద్దాం - Sakshi

బడిని బాగు చేద్దాం

విద్యాభివృద్ధికి పంచసూత్రాల ప్రణాళిక 
నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ఇవ్వండి
వాటి ఆధారంగానే నిధులు మంజూరు చేస్తాం
ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు తప్పనిసరి
సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

విద్యపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. దీంతో ప్రభుత్వం సైతం ప్రాధాన్యత కేటగిరీగా విద్యను పరిగణించడం లేదు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఫలితంగా ప్రభుత్వ విద్య గాడితప్పుతోంది. ఇది చాలా దారుణం.  విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ) నిధులను వినియోగించుకోవాలి - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని  ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ సమావేశం నిర్వహించారు. మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

 నియోజకవర్గ స్థాయిలో ‘ప్లాన్’
ఇకపై నియోజకవర్గస్థాయిలో విద్యాశాఖ కార్యక్రమాలపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. శాసన సభ్యుల అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు అధికారులంతా హాజరు కావాలన్నారు. ఈనెలాఖర్లోగా నియోజకవర్గస్థాయి సమావేశాలు తప్పకుండా నిర్వహించాలన్నారు. సమావేశాల్లో నియోజకవర్గ పరిధిలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వసతులు, సౌకర్యాలు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు.

అక్కడ గుర్తించిన వాటితో ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి జిల్లా యంత్రాంగానికి అందించాలని స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక ఆధారంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, జాగ్రత్తగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఇందులో ఐదు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలన్నారు. టాయిలెట్లు,  వాటర్, విద్యుత్, ప్రహరీలు, ఫర్నీచర్ అంశాలతో ప్రణాళిక తయారు చేయాలన్నారు. అదేవిధంగా అదనపు తరగతి గదులు, మరమ్మతులకు సంబంధించి ఎస్‌ఎస్‌ఏకు వివరించాలన్నారు.

 ఒక్కక్కరు రూ.కోటి ఇవ్వండి
జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం.. మౌలిక వసతుల కల్పనకు రూ.245 కోట్లు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎంపీ తమ నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి కనిష్టంగా రూ.కోటి ఇవ్వాలని మంత్రి కోరగా.. ప్రజాప్రతినిధులు అందుకు మద్దతు పలికారు. ఈ నిధులను వారి నియోజకవర్గాల్లో గుర్తించిన పనులకే వెచ్చిస్తామన్నారు. ప్రజాప్రతినిధుల కోటా కింద రూ.25 కోట్లు, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ) మరో వంద కోట్లు సమకూరుస్తామన్నారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి నిధి కింద రూ.20 కోట్లు అందుబాటులో ఉన్నాయని.. వాటిని కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక కోటాలో నిధులు మంజూరు చేస్తుందన్నారు.

ప్రతి పాఠశాలలో క్లీనర్, స్వీపర్, స్కావెంజర్‌ను ప్రత్యామ్నాయ పద్ధతిలో నియమించుకోవాలన్నారు. పాఠశాలను శుభ్రపర్చే బాధ్యత స్థానిక సంస్థలదేనని, ఈమేరకు గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వికారాబాద్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీని సీఎం మంజూరు చేశారన్నారు. పాఠశాలల్లో నెలకొన్న ప్రధాన సమస్యల్ని నియెజకవర్గాల వారీగా ఎంపీలు సీహెచ్ మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, ప్రభాకర్, ప్రకాష్‌గౌడ్, తీగల క్రిష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, గాంధీ, సంజీవరావు తదితరులు వివరించారు.

వాటిని సానుకూలంగా విన్న మంత్రి సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ ప్రణాళికలో పొందుపర్చాలన్నారు. జేసీ ఆమ్రపాలి జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement