కల్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై మూడు కేసులు నమోదు కాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
► ఏడుగురు నిందితులకు రిమాండ్
► పరారీలో కార్యదర్శి, హెచ్‌డబ్ల్యూఓ
అమ్రాబాద్ : కల్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై మూడు కేసులు నమోదు కాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను బుధవారం ఇక్కడ ఎస్‌ఐ శ్రీనివాసులు వెల్లడించారు. అమ్రాబాద్ మండలంలోని ఈదులబావికి చెందిన రామానుజమ్మ, అన్న ఆంజనేయులు, ఎమిరెడ్డిపల్లికి చెందిన ఎనుపోతుల శ్రీదేవి, భర్త మన్నెం వెంకటయ్య, కుమార్ (శ్రీదేవి అన్న), తిర్మలాపూర్ (బీకే) కు చెందిన పెర్ముల అరుణమ్మ, భర్త చక్రపాణిలపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వీరందరినీ బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాస్తవానికి రామనుజమ్మకు 2009లో కుమ్మరోనిపల్లి వాసి చంద్రయ్యతో వివాహం కాగా 2014 అక్టోబర్ 26న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కల్యాణలక్ష్మి కింద లబ్ధి పొందారు. శ్రీదేవికి ఎనిదేళ్లక్రితమై వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా 2015 ఫిబ్రవరి 22న జరిగినట్టు చూపించారు.
అరుణమ్మకు మూడేళ్ల క్రితమే పెళ్లికాగా 2014 నవంబర్ 3న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక్కొక్కరు ఈ పథకానికి సంబంధించి రూ.51 వేలు తీసుకున్నట్లు తేలింది. ఈ ధ్రువపత్రాలన్నీ అచ్చంపేట పట్టణం లింగాల రోడ్డులోని వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్పిడి చేసినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో దళారీలతో అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారుల సమాచారం అందింది. దీనిపై ఏఎస్‌డబ్ల్యూఓ శ్రీకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తాజాగా ఏడుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుల్లో నిందితులైన అమ్రాబాద్ గ్రామ కార్యదర్శి అంజనేయులు, విచారణ అధికారి (హెచ్‌డబ్ల్యూఓ) హన్మంత్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.