‘కల్యాణా’నికి రూ.280 కోట్లు | Rs.280 crores for Kalyana Lakshmi ,shadi mubarak schemes | Sakshi
Sakshi News home page

‘కల్యాణా’నికి రూ.280 కోట్లు

Published Fri, Dec 26 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

Rs.280 crores for Kalyana Lakshmi ,shadi mubarak schemes

నిజామాబాద్‌కల్చరల్ : షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 280 కోట్లు కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్ ప్రాంగణంలో గల న్యూ అంబేద్కర్ భవన్‌లో జిల్లాలో షాదీ ముబారక్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాదీ ముబారక్ పథకం కింద ఎంపికైన 15 మందికి మంత్రితోపాటు కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ సుజాత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మంజూరు ఉత్తర్వులను అందించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణలక్ష్మి, మైనారిటీల కోసం షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు వివాహం నిమిత్తం రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఎస్సీలు, మైనారిటీలకు రూ. 100 కోట్ల చొప్పున, ఎస్టీలకు రూ. 80 కోట్లు కేటాయించామన్నారు.
 పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 2.15 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేశామన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామన్నారు. పేదవారికి రూ. 3.50లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఒకటో తేదీ నుంచి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వసతిగృహాలు, మధ్యాహ్న భోజన పథకాలకు సన్న బియ్యం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫయీమ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగగంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దాదాన్నగారి విఠల్‌రావు, టీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తారిక్ అన్సారి, నాయకులు రహమాన్,అక్తార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement