సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులతో (బీసీలు) పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు (ఈబీసీలు) చెందిన వారికి వర్తింపజేసే కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీ సంక్షేమశాఖ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీశాఖలు, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాన్ని మైనారిటీశాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక స్థోమత లేని కారణంగా అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించడంలో పేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది.
వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాల్లోని పేదలు కూడా తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో బీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిపై బీసీ సంక్షేమశాఖ కూడా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. కాగా, బీసీలతో పాటు అన్నికులాల్లోని పేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఏడాది బడ్జెట్‌లో బీసీలకోసం ఈ పథకానికి రూ. 50 కోట్లు కేటాయించి, ముందుగా పదివేల మందికి ప్రయోజనం కల్పించనున్నారని సమాచారం. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ (అగ్రకులాల పేదలతో సహా) ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ఈసీబీల్లో సుమారు 25వేలమంది వరకు లబ్ధికల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించనున్నారని సమాచారం. తెల్ల రేషన్‌కార్డు ఉండడంతోపాటు పట్టణప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకుండా, గ్రామీణప్రాంతాల్లో రూ.లక్షన్నరకు లోబడి ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
బీసీ సంక్షేమంలోకి బీసీ, ఈబీసీ ‘కల్యాణలక్ష్మి’
Published Fri, Mar 4 2016 3:11 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM
Advertisement