సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేస్తుండగా, ఇప్పుడు సంక్షేమ పథకాల మంజూరును జిల్లా యంత్రాంగం వేగంగా చేపడుతోంది. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.
నియోజకవర్గంలో దరఖాస్తుల వివరాలు..
►ఆగస్టు నెలలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కోసం 268 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అవి మంజూరయ్యాయని చెక్కులు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
►చౌటుప్పల్ మండలంలో ఈ నెలలో ఇప్పటి వరకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటి మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు.
►నారాయణపూర్ మండంలో జూలై నెలలో 10 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 78 దరఖాస్తులు, ఈ నెలలో ఇప్పటివరకు 12 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అవి మంజూరయ్యాయని, త్వరలోనే చెక్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
►మునుగోడు మండలంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 19 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రాసెస్ చేసిన రెవెన్యూ అధికారులు.. ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. త్వరలోనే చెక్కులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
►మర్రిగూడ మండలంలో జూలై నెలలో కల్యాణలక్ష్మి కోసం 25 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 27 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటిని ఆమోదం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు.
►నాంపల్లి మండలంలో ఆగస్టు నెలలో 36 దరఖాస్తులు రాగా, ఈ నెలలో మరో 2 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు.
►చండూరు మండలం పరిధిలో జూలైలో 3 దరఖాస్తులు, ఆగస్టులో 16 దరఖాస్తులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 3 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
మండల స్థాయిలో పెండింగ్ లేకుండా..
నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణంతో నిర్వాసితులైన వారికి పెండింగ్‌లో ఉన్న పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. ఇటీవలే దాదాపు 10 వేల కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. గొర్రెల పంపిణీకి కసరత్తు చేస్తోంది. చండూరు మండలంలోని గొల్లగూడెం, శేరిగూడెం, మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, గుండ్లోరిగూడెం, రావిగూడెం గ్రామాలకు రేషన్ దుకాణాలను మంజూరు చేసింది. ఇప్పుడు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసే ప్రక్రియను వేగంగా చేస్తోంది. ఇందుకోసం వచ్చివ దరఖాస్తులను వెంట వెంటనే తహసీల్దార్లు ప్రాసెస్ చేస్తున్నారు. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిస్తున్నారు. ప్రస్తుతం వాటన్నింటిని మంజూరు చేసే పనిలో జిల్లా యంత్రాంగం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment