సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ’ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా ఉన్నా.. నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్ళిలు చేసిన పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికి పోతున్నారు. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతుండగా... మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా...ఆర్థిక సహయం మాత్రం బ్యాంక్ ఖాతాలో జమా కావడం లేదు. ఫలితంగా నెలల తరబడి పేదలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఆర్థిక సహాయం మాత్రం అందని ద్రాక్షగా తయారైంది.
ఇదీ పరిస్ధితి..
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద వధువు చేయూత నత్తలకు నడక నేర్పిస్తోంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం కళ్యాణ లక్ష్మి పథకం కింద 4,480 కుటుంబాలు, షాదీముబారక్ పథకం కింద 9,504 కుటుంబాలు దరఖాస్తు చేస్తుకున్నాయి. అందులో సగానికి పైగా దరఖాస్తులకు అతీగతీ లేకుండా పోగా, మరి కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం అమలు తీరు పరిశీలిస్తే మొత్తం దరఖాస్తుల్లో తహసీల్ స్థాయిలో 399, ఎమ్మెల్యే అమోదం కోసం 612, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో 1518, ట్రెజరీ వద్ద 288 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. షాదీముబారక్ పథకం కింద మొత్తం 9,504 దరఖాస్తులకు గాను తహసీల్ స్ధాయిలో 528 దరఖాస్తులు, ఎమ్మెల్యే స్థాయిలో 881, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 3,958 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
రూ. 73.53 కోట్లు అత్యవసరం
హైదరాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ. 73.53 కోట్లు అత్యవసరమని అధికారం యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రసుత్తం షాదీ ముబారక్ పథకం కింద రూ. 52,01,39,000, కళ్యాణ లక్ష్మి పథకం కింద బీసీ, ఓబీసీ లబ్ధిదారులకు రూ, 17,01,16,000, ఎస్సీ సామాజిక వర్గం లబ్ధిదారులకు 3,00,34,800లు, ఎస్టీ సామాజిక వర్గం లబ్ధిదారులకు రూ.1,50, 11, 600 నిధులు అత్యవసరం ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment