తిరుపతిరెడ్డి, ఎంపీపీని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
దౌల్తాబాద్(కొడంగల్): మండల పరిధిలోని కుదురుమళ్లలో మంగళవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ గందరగోళంగా మారింది. ఓ దశలో కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలు.. కుదురుమళ్లలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీకి మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి వచ్చారు. తహసీల్దార్ అతిథులుగా జెడ్పీ చైర్మన్‌తోపాటు ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీపీని ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి ఆహ్వానించారు. దౌల్తాబాద్ ఎంపీపీ నర్సింగ్‌భాన్‌సింగ్ స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించాలని తహసీల్దార్‌ను కోరారు. అంతలోనే జెడ్పీ చైర్మన్ కల్పించుకుని ఆయన ఎవరు..? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే సోదరుడని ఎంపీపీ చెప్పడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయన స్టేజీపైకి అవసరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాటకు దిగారు. దాదాపు గంటసేపు ఆందోళనగా మారడంతో ఉత్కంట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ...రేవంత్‌రెడ్డి డౌన్...డౌన్ అంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు నరేందర్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు తిరుపతిరెడ్డితోపాటు ఎంపీపీ నర్సింగ్‌భాన్‌సింగ్, నాయకులను సమావేశం నుంచి బయటకు పంపించారు. కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుంటే ఇలా దౌర్జాన్యం చేసి గొడవలు దిగడం సరికాదన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తరమికొడతారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment