సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కేన్సర్ సోకిందని, అది కాస్తా ఇప్పుడు నయం చేయలేని స్థితికి చేరు కుందని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని వీడాల్సి వస్తుందని తాను అనుకోలేదని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినే అనుకున్నానని.. కానీ కొంతకాలం నుంచి కాంగ్రెస్‌లో జరుగు తున్న పరిణామాలు తాను పార్టీలో ఉండలేని స్థితికి తీసుకొచ్చాయని చెప్పారు.
ఒక హోంగార్డు కాంగ్రెస్‌ను వీడితే పోయేదేమీ లేదని.. కానీ పార్టీలోని పరిస్థితులు తనలా చాలామంది హోంగార్డులు కాంగ్రెస్‌ను వీడేలా చేస్తాయని వ్యాఖ్యానించారు. శనివా రం మధ్యాహ్నం ఢిల్లీలో తనను కలిసిన విలేకరులతో శశిధర్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శుక్రవారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలను చర్చించానని చెప్పారు.
రేవంత్ వల్ల పార్టీ ఉనికికి దెబ్బ
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి ఏమాత్రం సరిగా లేదని, ఆయన వైఖరితో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందని శశిధర్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించానని.. రేవంత్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను మూడు నెలల క్రితం కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
కానీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు రేవంత్ అందుబాటులో ఉండడని.. పూర్తిగా ఆయన వర్గం వారితోనే పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. పార్టీకి నష్టం కలిగించేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3వేల ఓట్లు రావడం కంటే, మునుగోడులో 20వేలకు ఓట్లు పెరిగాయని సంబరపడడం అవివేకమని ఎద్దేవా చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకుని తన సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని ఆరోపించారు. గత పీసీసీ అధ్యక్షుడు తనకు సనత్‌నగర్ టికెట్ ఇవ్వకున్నా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశానన్నారు. తన అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాడినే అంటూ పెట్టుకున్న వాక్యాన్ని శశిధర్‌రెడ్డి తొలగించడం గమనార్హం. ఈ నెల 25న ఢిల్లీలో మర్రి శశిధర్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో వీలైనంత త్వరగా పార్టీలో చేరాలని అమిత్ షా కోరినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment