మళ్లీ మళ్లీ.. పెళ్లి! | midiums froud in shadimubarak and kalyanalaxmi | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ.. పెళ్లి!

Published Wed, Apr 13 2016 2:39 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

మళ్లీ మళ్లీ.. పెళ్లి! - Sakshi

మళ్లీ మళ్లీ.. పెళ్లి!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో బయటపడుతున్న లీలలు
అధికారులు, దళారుల మిలాఖత్
సరూర్‌నగర్ మండలంలోనే 100కుపైగా నకిలీలు
ఓ మధ్యవర్తి మూడు దరఖాస్తుల్లో పెళ్లికొడుకు
రెండు గంటల్లోనే కుల, ఆదాయ సర్టిఫికెట్లు
తీగలాగుతున్న అవినీతి నిరోధక శాఖ
ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ

సరూర్‌నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకు నకిలీలుగా గుర్తించిన దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి తానే మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అక్రమాల డొంక కదులుతోంది. ఈ పథకాల  సొమ్ము లబ్ధిదారులు కాకుండా మధ్యవర్తులకు దక్కుతోందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం అక్రమాలు జరుగుతున్న తీరును బయటపెట్టిన ఏసీబీ.. తాజాగా సర్కారు సొమ్ము దారిమళ్లిందన్న విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో సూత్రధారుల బాగోతాన్ని బహిర్గతం చేస్తూ.. అందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది.-  సాక్షి, రంగారెడ్డి జిల్లా

 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక లబ్ధి చేకూర్చాలనే  సంకల్పంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రక్రియను సాజావుగా సాగించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉండగా.. కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. షాదీముబారక్ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలుగులోకి తెస్తోంది. ఈ క్రమంలో తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. పది రోజుల క్రితం సరూర్‌నగర్ మండలానికి చెందిన సుల్తానాబేగం పేరిట మంజూరైన షాదీముబారక్ నగదును ఇతరులు కాజేసిన వైనాన్ని ఏసీబీ బయటపెట్టింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరు తీసుకున్నారు.. ఎలా చెల్లింపులు జరిగాయి.. సుల్తానాబేగం పేరిట దరఖాస్తు చేసిన తీరును పూర్తిగా అధ్యయనం చేసిన ఏసీబీ పలు ఆసక్తికర విషయాల్ని మంగళవారం మీడియాకు వెల్లడించింది.

 మైనార్టీ శాఖలో దళారుల రాజ్యం..
ప్రస్తుతం షాదీముబారక్ పథకంలో అక్రమాలను వెలికితీసే క్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. షాదీముబారక్ పథకం కింద నకిలీ దరఖాస్తులను సృష్టిస్తూ.. వాటిని శాఖపరంగా ఓకే చేయించే క్రమం లో తాహెరుద్దీన్ చురుకైన పాత్ర పోషిం చినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. అదేవిధంగా అన్ని అర్హతలున్న ఒక్కో లబ్ధిదారుడి నుంచి కూడా కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసి వారికి మంజూరు పత్రాన్ని అందిస్తున్నట్లు గుర్తించింది. మైనార్టీ శాఖ ఉద్యోగిలా కాకుండా.. బయటివ్యక్తిలా మాట్లాడుతూ లబ్ధిదారులతో బేరసారాలు చేయడం, అనర్హుల నుంచి దరఖాస్తు చేయించడంలో ఒక ముఠాను ఏర్పాటు చేసి చక్రం తిప్పుతున్న తీరును కూడా ఏసీబీ నిగ్గుతేల్చింది.

 ఇలా దరఖాస్తు.. అలా సర్టిఫికెట్..
సరూర్‌నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. వీరికి సంబంధించి దరఖాస్తు చేసుకునే తీరు మొదలు.. నగదు మంజూరయ్యే వరకు ప్రతిచోట దళారులు చురుకైన పాత్ర పోషించారు. సరూర్‌నగర్ మండలంలో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి మీసేవా కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తాడు. అనంతరం వారికి సంబంధించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను చంద్రాయణగుట్టలోని క్లిక్ నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత.. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మరో మధ్యవర్తిని ఆశ్రయించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను రెండు మూడు గంటల్లో పొందుతాడు.

ఆ తర్వాత పహడీషరీఫ్‌లోని ఇండియన్ బ్యాంకులోనూ ఎలాంటి పరిచయస్తులు, ఆధారాలు లేకుండా బ్యాంకు ఖాతాను తెరిచి ఒక రోజులోనే ఈ వివరాలను మైనార్టీ శాఖలోని తాహెరుద్దీన్‌కు అందిస్తాడు. ఇక శాఖాపరంగా జరిగే పరిశీలన.. ఫైల్ మూవ్‌మెంట్ అంతా అక్కడ చకచకా సాగిపోతుంది. ఈ ప్రక్రియకోసం తాహెరుద్దీన్ సగటున రూ.5 నుంచి రూ.10వేలు తీసుకుంటాడని, క్షేత్రస్థాయిలో పని పూర్తిచేసేందుకు ఎజాజుల్లాఖాన్ రూ.వెయ్యి రూపాయలు తీసుకుంటాడని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్ లక్ష్మి విలేకర్లకు వివ రించారు. నకిలీలుగా గుర్తించిన 16 దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే తాహెరుద్దీన్, ఎజాజుల్లాఖాన్‌లను అదుపులోకి తీసుకోగా.. తహసీల్దార్ కార్యాలయం, ఇండియన్‌బ్యాంకులో వీరికి సహకరించినవారిని త్వరలో పట్టుకోనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement