కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిర్వహణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపడుతోంది.
హైదరాబాద్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిర్వహణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఈ పథకాలలో దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలలో అవకతవకలు జరుగుతున్నట్లు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. దీంతో అక్రమార్కుల ఆట కట్టించేందుకు ఏసీబీని రంగంలోకి దించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో లబ్ధిదారుల వివరాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి కేసులు సైతం నమోదు చేశారు.
పథకాలలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేశారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వ వర్గాలు పథకాలలో మునుముందు అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏసీబీ గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుంచి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఏసీబీ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.